Tuesday, December 3, 2024

ఆ నాలుగు పత్రికల నిష్క్రమణ మిగిల్చిన ప్రశ్నలు!

న సామాజిక జీవనంలో కొన్ని అంశాల ప్రాసంగికత (రిలవెన్స్) తగ్గుతున్నప్పుడు, ‘యాజ్ ఆన్ డేట్’ అన్నట్టుగా ఆ పరిణామాలను నమోదు చేయడం వల్ల, వాటి నిష్క్రమణకు మనం వొక గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చినట్టుగా అవుతుంది. ఎవరో వొకరు అటువంటి చొరవ చేసినప్పుడు, అస్సలు అక్కడ ‘ఖాళీ’ ఎందుకు ఏర్పడింది? ఆ ‘ఖాళీ’ లోకి కొత్తగా ఇప్పుడు రావలిసింది ఏమిటి? అనే చర్చకు కూడా తర్వాతి కాలంలో అది ఉపకరించవచ్చు. తెలుగునాట లబ్ధప్రతిష్టమైన ‘ఈనాడు గ్రూప్’ కు చెందిన రామోజీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ 2021 మార్చి తర్వాత ప్రస్తుతం తమ సంస్థ ప్రచురిస్తున్న నాలుగు ప్రచురణలు ఇకముందు వెలువడవని మార్చి 3 న ప్రకటించింది.

ఇన్నాళ్ళు ఈ ఫౌండేషన్ నుంచి ‘విపుల’, ‘చతుర’ (1978) ‘తెలుగు వెలుగు’ (2012) ‘బాల భారతం’ (2013) తెలుగు మాసపత్రికలు వెలువడుతున్నాయి. అయితే ‘కరోనా’ కారణంగా గత ఏడాది జూన్-ఆగస్టు మధ్య వీటి ముద్రణ ఆపి, అప్పటి నుంచి ‘ఈ-పత్రిక’ గా వీటిని చదువరులకు అందుబాటులో ఉంచారు. “సేవా దృక్పధంతో ఇన్నాళ్ళు చేసిన ఈ నాలుగు పత్రికల నిర్వహణ కష్టతరంగా మారినందున” అంటూ వొక ప్రకటనలో తెలిపిన ఈ ట్రస్టు, ఇవి ఏప్రెల్ నుంచి ఇక వెలువడవు అని ప్రకటించింది.

Also Read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

ఆధునిక తెలుగు సమాజ చరిత్రలో ‘భారతి’ మాస పత్రిక మూసివేత తర్వాత, అంచెలంచెలుగా జరుగుతున్న వార, మాస పత్రికల మనుగడకు, 2020 ఇంచుమించు నిష్క్రమణ ఏడాదిగా భావించవచ్చు. ‘ఇండియా టుడే’ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ప్రాంతీయ భాషల్లో తెచ్చిన పత్రికలు, పదేళ్ళ క్రితమే ఇక్కడ కనుమరుగు అయ్యాయి. అయితే, ఇప్పటి రామోజీ ఫౌండేషన్ ప్రచురణలు ఆగిపోవడం వాటితో పోల్చదగ్గ పరిణామం కాదు. అందుకు కారణం ‘హరిత విప్లవ’ ఫలాలు అందుతున్న కాలంలో ఇవి తెలుగు ప్రజల ‘సాంఘిక జీవనం’ లో భాగంగా కలిసిపోయిన పత్రికలు. ఏకంగా ‘అన్నదాత’ పేరుతో ఈ సంస్థ మాస పత్రిక కూడా వుంది.

అయితే, పేరు ఏదైనా, ‘పత్రిక’ అంటే అది కేవలం వొక ‘వాహిక’ (కెటలిస్ట్) మాత్రమే. ఇంకా చెప్పాలంటే, అదొక ‘టూల్’ మాత్రమే! దానికి ‘కంటెంట్’ ఇచ్చేవారు (రచయిత) – దాన్ని అందుకునేవారు (పాఠకుడు) వీరిద్దరి మధ్య ఉండే సజీవ బాంధవ్యం (‘లైవ్ కాంటాక్ట్’) ఆ ‘వాహిక’ లేదా ఆ ‘టూల్’ ఆయుషును నిర్ధారిస్తుంది. ఇక్కడే ‘వాహిక’ ను కొద్దిసేపు పక్కన వుంచి, మొదటి రెండింటి మధ్య వచ్చిన ‘గ్యాప్’ విషయం విషయం చూద్దాం. దృశ్యమాధ్యమాలు వచ్చాక పత్రికల ఉనికి దెబ్బతింది, అనే నిర్ధారణ పాతబడి కూడా చానాళ్లు అయింది. అయితే, ‘దృశ్యమాధ్యమాలు’ కూడా ‘అవుట్ డేట్’ అవుతున్న  విషయం మనం గుర్తించడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

ఇక్కడే, సామాజిక శాస్త్రాల చదువులు మనం వదిలివేసిన తర్వాత వచ్చిన పరిణామాలుగా దీన్ని చూడడానికి బొత్తిగా మనం ఇష్టపడం! ఎందుకీ మాట అనడం అంటే, ఇక్కడ కనుక మనం కొంచెం ‘క్రిటికల్ లుక్’ పెట్టగలిగితే, రచయిత-పాఠకుడు లేదా ప్రేక్షకుడు మధ్య విస్తరిస్తున్న ‘గ్యాప్’ ను మనం పసిగట్టవచ్చు. ఒకప్పుడు ‘హరిత విప్లవ’ కాలంలో తెలుగు ప్రజల ‘సాంఘిక జీవనం’ లో భాగం అయ్యేట్టుగా వీరు ప్రచురించిన అంశాల్లో, ఇప్పటికీ ఇంకా అదే గౌరవాన్ని ఎన్ని పొందగలుగుతున్నాయి? ఈ సందేహానికి సమాధానం కోసం, అస్సలు వొక సృజనకు వుండే ‘షెల్ఫ్ లైఫ్’ ఎంత? అనే ప్రాధమిక ప్రశ్న వద్దకు వెళ్ళక తప్పడం లేదు.

Also Read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

సందర్భం సృజన కనుక, అటు నుంచే చూద్దాం. సమాంతర సినిమా దర్శకుడు బి. నరసింగరావు ‘రంగుల కల’ చిత్రం 1983 లో తీస్తూ, అందులో తెలంగాణ గ్రామీణ జీవితాన్నితమ కుంచెల ద్వారా ప్రతిఫలించిన చిత్రకారుల (పెయింటర్స్) కళా దృక్పధాన్ని వెండితెర మీద చూపిస్తాడు. అయితే, మూడు దశాబ్దాలు తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా అని, మళ్ళీ ఆయన ఆ ‘థీం’ తో ఇప్పుడు సినిమా తీయలేదు. ‘ఆర్ట్ @ తెలంగాణ’ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్ట్ గ్యాలరీని 360 పేజీల గ్రంధంగా 2014 లో ఆయన వెలువరించారు. ముప్పై ఏళ్లనాటి తమ జీవితాన్ని సెల్యులాయిడ్ మీద మళ్ళీ ఇప్పుడు చూడ్డానికి ఈ తరం సిద్దంగా లేదనే ఎరుక, ఆయనకు ఉండడమే అందుకు కారణం. ఆ గమనం, రెండు భాగాలుగా ఎన్. టి.ఆర్. ‘కధానాయకుడు’, ఎన్. టి.ఆర్. ‘ప్రజానాయకుడు’ బయోపిక్చర్ తీసిన నటుడు బాలకృష్ణకు అస్సలు లేకపోయింది!

అంత ఎందుకు? స్టూడియో ఫ్లోర్స్, సెట్ ప్రాపర్టీస్, సిబ్బందిని ఖాళీగా వుంచడం ఎందుకు అని, రామోజీ ఫిల్మ్ సిటీలో వొకప్పుడు వరసగా నిర్మించిన పౌరాణిక సీరియల్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నవి ఏవీ లేవు. లేకపోగా ‘దాష్మి క్రియేషన్స్’ నిర్మించిన ‘సద్గురు సాయి’ హిందీ సీరియల్ తెలుగు డబ్బింగ్ ‘ఈ.టివి.’ ప్రైం టైం సీరియల్ గా సాయంత్రం 6.30 కి ఇస్తున్నారు. అందులో కనిపించే పాత్రలు అంతా వొకప్పుడు తెలంగాణ చిత్రకారులు చిత్రించిన మట్టి మనష్యులు వంటి వారు కావడం, ఇక్కడ గమనించవలసిన ప్రధానమైన అంశం. ఇక ప్రధాన పాత్ర అయిన షిర్డీ సాయి ఫిలాసఫీ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు!

Also Read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

అయితే, స్థానికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ప్రాంతాలు, మనుష్యులు, వారి కధలు, నవలలు మనకు లేవా? పోనీ మనం వొకప్పుడు మన పత్రికలలోనే ప్రచురించిన అటువంటి మట్టిమనుష్యుల నవలలు ఇప్పుడు మన స్టూడియో సీరియల్స్ కోసం పనికిరావా? అంటే, సరిగ్గా అక్కడే అస్సలు సమస్య ఉపరితలం మీదికి వస్తున్నది! మారుతున్న కాలంతో పాటుగా ‘కమ్యునికేషన్ టూల్స్’ మార్చి, ఇప్పుడు మనం వాటిని నిర్మించడం ద్వారా, ఎవరి రాజకీయ తాత్విక (పొలిటికల్ ఫిలాసఫీ) అవసరాల్ని మనం తీరుస్తున్నాము? అనేది మౌలిక ప్రశ్న అవుతున్నది! మరి మిగిలిన పరిష్కారం? వినమ్ర నమస్కారాలతో నిష్క్రమణ. అలాగని సమస్య ఇక్కడ సమసిపోలేదు. కొత్తగా ఏర్పడ్డ ఆ ఖాళీని పూరించేది దేనితో అనే ప్రశ్నకు సమాధానం మన వద్ద లేకపోవడమే, ఇప్పటి విషాదం.    

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles