” క్వాడ్ “ఈ మధ్య తరచుగా వినవస్తున్న మాట. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ నాలుగు దేశాలు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డాయి. ప్రధానంగా అన్నిరకాల భద్రత చుట్టూ ముడిపడి, దాన్ని కాపాడుకోవడానికి ఈ దేశాలన్నీ ఒక బృందంగా ఏర్పడ్డాయి. అదే “క్వాడ్” (క్వాడ్రలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ). దీనికి సంబంధించిన ప్రథమ శిఖరాగ్ర సమావేశం మొన్ననే ముగిసింది. వర్చ్యువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగా పాల్గొన్నారు.
పరస్సర సహకారం
ఈ మొట్టమొదటి సదస్సు అద్భుతంగా జరిగిందని, పలు దేశాలు మెచ్చుకున్నాయని జో బైడెన్ అంటున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగినా, ఇంకా అనేక అంశాలు చర్చకు వచ్చాయి.అంతర్జాతీయ చట్టాల అమలులో ఇంకా సంపూర్ణత్వాన్ని సాధించుకోలేక పోవడంపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్ళను ఎదుర్కుంటోంది. కరోనాపై యుద్ధం, వాతావరణంలో వచ్చిన పెనుమార్పులు, ఆర్ధిక సంక్షోభం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి, కలిసి సాగితేగానీ ముందుకు వెళ్ళలేమనే అభిప్రాయాన్ని క్వాడ్ దేశాలు వెల్లడించినట్లుగా సమాచారం. ఇండో – పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం ఎంత ముఖ్యమో, కరోనా పోరులో సహకారం అంతకంటే ఎక్కువే ముఖ్యమని దేశాలు భావించి తీరాలి.
Also Read : అంతరిక్షంలో నాలుగు స్థంభాలాట
కరోనాపై పోరులో తోడ్పాటు
సహకారాన్ని అందించుకోవడంలో వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ కూడా చాలా కీలకమైన అంశం. కరోనా వల్ల ఆర్ధిక, సామాజిక వ్యవస్థలు ఛిద్రమయ్యాయి. సెకండ్ వేవ్ పొంచి ఉందనే ఘంటికలు గట్టిగా వినపడుతున్నాయి. కేవలం వ్యాక్సిన్లు తయారు చేయడం, ఒకరికొకరు పంపిణీ చేసుకుంటే సరిపోదు. వ్యాక్సిన్ల సామర్ధ్యంపై దృష్టి పెట్టాలి. సర్వ సమర్ధవంతమైన వ్యాక్సిన్ల రూపకల్పన వల్లనే ఆశించిన ప్రయోజనం ఉంటుంది. కళ్లనీళ్లు తుడిచే వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ దిశగా క్వాడ్ దేశాల మధ్య ఆర్ధిక ఒప్పందాలు కూడా జరగాలని, జరుగుతాయని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశాధ్యక్షులు పాల్గొన్న సమావేశం
క్వాడ్ దేశాల మధ్య గతంలో అనేకసార్లు సమావేశాలు జరిగాయి. వాటిల్లో విదేశాంగ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇలా దేశాధినేతలు పాల్గొనడం మంచి అడుగు.భారత్ – జపాన్ అధినేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇండో – పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా, ఈ నాలుగు దేశాలు భేటీ కావడంపై చైనా ఆగ్రహంగా ఉంది. ఈ దేశాల పట్ల చైనాకు చాలా అనుమానాలు ఉన్నాయి. తనని ఒంటరి చేయడానికి అమెరికా ఆడుతున్న ఆటలో భాగమే ఈ సమావేశమని చైనా అభిప్రాయ పడుతోంది. అందులో కొంత నిజం వుంది.
Also Read : శత్రు దుర్భేద్యంగా భారత్ జలాంతర్గాములు
చైనా చేతలే కారణం
అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ ఒకతాటిపై తెచ్చి, వాటికి నాయకత్వం వహించాలనే ఆలోచనలు చైనాకు ఉన్నాయి.ఇస్లామిక్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలన్నింటినీ తనవైపు తిప్పుకోవాలనీ చైనా విస్తృతంగా పనిచేస్తోంది. అమెరికాను తొక్కేసి,అగ్రరాజ్యంగా ఎదిగి, ప్రపంచంపై ఆధిపత్యం చూపించాలనే సామ్రాజ్య కాంక్షతోనే చైనా వ్యూహాలు పన్నుతోంది.ఈ విషయాన్ని అమెరికాతో సహా చాలా దేశాలు ఇప్పటికే గ్రహించాయి. రష్యాను ఇప్పటికే చైనా చాలా వరకూ వశపరుచుకుంది. భారత్ – రష్యా మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇంకా చేస్తూనే వుంది.
Also Read : 2035 నాటికి చైనా భూగర్భంలో రహస్య పట్టణాలు
భారత్-రష్యా సంబంధాలపై ప్రభావం
చైనా ప్రభావంతో రష్యా – భారత్ బంధాలు ఇదివరకు ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. చాలా వరకూ దెబ్బతిన్నాయి. సమీప భవిష్యత్తులో ఇంకా దెబ్బతినే అవకాశాలే కనిపిస్తున్నాయి.ఒకప్పుడు భారత్ – రష్యా మధ్య గొప్ప సంబంధాలు ఉండేవి. ఇప్పటికీ రక్షణకు సంబంధించిన ఆయుధాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.ఇంకా రెండు దేశాల మధ్య బంధాలు పూర్తిగా దెబ్బతినలేదు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోడానికి భారత్ ఇంకా ప్రయత్నం చేస్తూనే వుంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికా – రష్యా సంబంధాలు బాగానే వున్నాయి. పుతిన్ – ట్రంప్ మధ్య వ్యక్తిగత మైత్రి కూడా బాగా నడిచింది. రెండో పర్యాయం కూడా ట్రంప్ రావాలని, జో బైడెన్ రాకూడదని పుతిన్ భావించినట్లు అంతర్జాతీయ రాజకీయ రంగంలో వార్తలు, కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
చైనా-అమెరికా తగాదాలు
అదే సమయంలో, ట్రంప్ పాలనాకాలంలో చైనా – అమెరికా మధ్య తగాదాలు మిన్నంటాయి. జిన్ పింగ్ – ట్రంప్ మధ్య వ్యక్తిగత విభేదాల దాకా వెళ్ళింది. ఆ సందర్భంలో, చైనాపై వాణిజ్య పరంగా ట్రంప్ అనేక ఆంక్షలు విధించారు.ఇరుదేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, రాకపోకలు అనే అంశాల్లో శాశ్వతంగా ద్వారాలు మూసివేయాలని ట్రంప్ భావించాడు. అమెరికా – భారత్ మధ్య బంధాలు పెరుగుతూ వున్న నేపథ్యంలో, భారత్ ను ఇబ్బంది పెట్టాలని, కట్టడి చేయాలని చైనా విశ్వప్రయత్నం చేసింది. ఇప్పటికీ చేస్తూనే వుంది.కరోనా ప్రభావం వల్ల ఆర్ధిక రంగం బాగా దెబ్బతింది. సరిహద్దుల్లో పెరుగుతున్న వివాదాల వల్ల రక్షణ రంగంపై బడ్జెట్ ఎక్కువ కేటాయించవలసిన పరిస్థితిలో భారతదేశం వుంది.
Also Read : అమెరికాతో భారత సంతతి అనుబంధం బలోపేతం
చైనా సామ్రాజ్య విస్తరణకాంక్ష కారణం
సామ్రాజ్యకాంక్షతో చైనా చేస్తున్న దురాగతాలను ఎదుర్కోడానికి ప్రస్తుతం అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ఏకమయ్యాయి. భవిష్యత్తులో, చైనా వ్యతిరేక దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడతాయని రాజనీతి శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. తమను తాము కాపాడుకోడానికి, చైనాకు చెక్ పెట్టడానికే “క్వాడ్” ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఆర్ధిక, వాణిజ్య రంగాల్లోనూ చైనా దూకుడుకు కళ్లెం వేయాలనే క్వాడ్ భాగస్వామ్య దేశాలు చూస్తున్నాయి. చైనా అనుమానించినట్లుగా, “క్వాడ్” వెనకాల ఆమెరికా ఉన్నప్పటికీ, ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం చైనాయే అని ఆ దేశం భావించడం లేదు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చైనాకు ఎంతో సహకారాన్ని అందించారు. తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా ద్వైపాక్షిక సంబంధాలు పెరగడానికి ఎంతో కృషి చేశారు.మనతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా చైనా ఎంతో లాభపడింది. ఇవన్నీ మర్చిపోయి, కృతజ్ఞతా రాహిత్యంతో,భారత్ పై కక్ష కట్టింది. మన సరిహద్దు దేశాలన్నింటినీ మనపై రెచ్చకొట్టింది.సరిహద్దుల్లో తాను స్వయంగా నానా విధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే భారత్ “క్వాడ్”లో చేరాల్సి వచ్చింది.
క్వాడ్ భాగస్వామ్యం వర్థిల్లాలి
చైనా తనకున్న ఆర్ధిక, సైనిక శక్తులను దుర్మార్గంగా ఉపయోగిస్తోందని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి. కరోనాను ఎదుర్కొనే క్రమంలో, అమెరికా ఔషధ సంస్థలైన జాన్సన్ అండ్ జాన్సన్, నోవా వ్యాక్స్ లకు భారత సంస్థలు వ్యాక్సిన్లు తయారు చేసేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఔషధ మార్కెట్ రంగంలో వినపడుతోంది.వ్యాక్సిన్ల తయారీలో వేగం పెరగడానికి క్వాడ్ దేశాలు సహకరించుకుంటాయనీ తెలుస్తోంది.చైనా తన వైఖరి పట్ల ఆత్మసమీక్ష చేసుకోవాలని కోరుకుందాం. క్వాడ్ భాగస్వామ్య దేశాల సంకల్పలాన్నీ సిద్ధించాలని ఆకాంక్షిద్దాం.
Also Read : అంగారకుడిపై రోవర్ క్యాట్ వాక్ అదరహో!