Thursday, November 21, 2024

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ దృష్టి పెట్టాలో కర్ణాటక ఎన్నికలు చెప్పాయి

అదే సామాజిక వ్యవస్థ ప్రాతిపదిక (సోషల్ పిరమిడ్ బేస్)!

ఇప్పుడు నడుస్తున్న పిరమిడ్ (త్రికోణరాశి) రాజకీయాలలో పాత గరీబీ హటావో లాంటి నినాదాలు పని చేయవు. అదే సమయంలో ఆనవాయితీగా వస్తున్న వామపక్ష రాజకీయ ధోరణులు సైతం పనికి రావు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2024కు దారి చూపుతాయి. వాటిని పిరమిడ్ రాజకీయాల పునాది అని పిలుద్దాం. ఇది పాతదారిగానే కనిపించవచ్చును. కానీ ఈ దారిలో మనం ఎంత జయప్రదంగా మన పాత్రను మనం ఊహించుకొని, ఎంత శక్తిమంతంగా ముందుకు నడుస్తామనే విషయంపైన మన గణతంత్రవ్యవస్థను మనం కాపాడుకుంటామా లేదా అన్నది ఆధారపడి ఉన్నది.

Also read: కర్ణాటక ఎన్నికలలో 4 నిర్ణాయక అంశాలు

కాంగ్రెస్ కు పడిన ఓట్లలో నాలుగు రకాల విభాగాల గురించి ఈ సరికి విశ్లేషకులు చెప్పే ఉంటారు. ఓటింగ్ విషయంలో వర్గం అనేది ఎంత పకడ్బందీగా పని చేసిందో చూపించేందుకు నేను ‘ఈదిన.కాం’ ప్రీపోల్ సర్వే డేటాను వినియోగించుకుంటాను. ‘ఇండియా టుడే,’  ‘మై ఇండియా యాక్సిస్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ విశ్లేషణ కూడా సంపన్నవర్గాలు ఉన్నచోట్ల కాంగ్రెస్ కన్నా బీజేపీకి కొద్దిగా ఆధిక్యత వచ్చినట్టు ధ్రువీకరించింది. పేద ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్ వైపు నిశ్చయంగా మొగ్గు చూపారు. ఇది పాత ధోరణికి కొనసాగింపా లేదా కొత్తగా వచ్చిన మార్పా అనే విషయం తేల్చడానికి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు.

కులాల విషయానికి వస్తే ‘‘అహిండా’’ (వెనకబడిన తరగతులూ, దళితులూ, ఆదివాసులూ, అల్పసంఖ్యాకవర్గాలు-అన్ని కలిపి జనాభాలో మూడింట రెండువంతులకు పైగానే ఉంటాయి) అనే సామాజిక సమీకరణాల మిశ్రమం కాంగ్రెస్ పార్టీని గట్టిగా బలపరిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. పోలింగ్ అనంతరం లోక్ నీతీ-సీఎస్ డీఎస్ సర్వే ఇప్పటికీ అన్ని సర్వేలలోకెల్లా శ్రేష్ఠమైనది. ఈ సర్వే కూడా పేదవర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచాయన్న విషయాన్నిరూఢి చేసింది. ఎక్కువగా చెప్పుకుంటున్న లింగాయత్ ల ఓట్లు కాంగ్రెస్ కు ఈ సారి పడ్డాయో లేదో కచ్చితంగా చెప్పలేము కానీ వెనుకబడిన తరగతుల, దళితుల, ఆదివాసీల, మైనారిటీల ఓట్లు మాత్రం ఇదివరకటి కంటే కూడా ఈ సారి కట్టగట్టుకొని కాంగ్రెస్ కు పడినాయన్నది స్పష్టం. ప్రతి కులంలోనూ, సామాజిక విభాగంలోనూ వర్గ (క్లాస్) ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని నా పరిశోధనలో తేలింది.

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

రెండు అదనపు అంశాలు

లోగడ చేసిన విశ్లేషణలలో పరగణనలోకి తీసుకొనని రెండు అదనపు అంశాలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలలో వెల్లడైనాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ జరిగిన విధానాన్ని పరిశీలించినప్పుడూ, పోలింగ్ తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనించినప్పుడూ గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ఆధిక్యం పదిశాతానికి పైగా ఉన్నది. ఇదివరకు గ్రామీణ. పట్టణ ప్రాంతాల మధ్య ఓటింగ్ లో తారతమ్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే అది అంతగా పట్టించుకోవాల్సినంత స్థాయిలో లేదు. ‘ఇండియాటుడే’ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇదివరకటి ఎగ్జిట్ పోల్ ఫలితాలతో పోల్చి చూసుకుంటే  కాంగ్రెస్ కు పురుషులలో అయిదు శాతం అధిక్యం ఉంటే, మహిళలలో 11 శాతం ఆధిక్యం కనిపించింది.

మొత్తం మీద కులం, వర్గం, ఆడ-మగ, ప్రాంతం అన్నవి అన్నీ ఒకే దిక్కు చూపిస్తున్నాయి. సమాజంలో సౌఖ్యంగా ఉన్న ఎగువ తరగతివారూ, ఎగువ మధ్య తరగతివారూ బీజేపీ పక్షాన ఉన్నారు. అధోజగత్సహోదరులూ, పేదవారూ, దిగువ మధ్యతరగతివారూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఈ నాలుగు అంశాలూ స్పష్టం చేసేదేమంటే సోషల్ పిరమిడ్ దిగువ స్థాయి కాంగ్రెస్ కు జైకొట్టిందని. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఇతర రాష్ట్రాలలో కనుక అమలు చేయగలిగితే మనం 2024లో కేంద్రంలో అధికార మార్పిడిని చూడబోతున్నాం.

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

మరెవరో చెప్పడానికి ముందే నేను చెప్పేదేమంటే ఇదేమీ కొత్త విషయం కాదు. ఇందులో కొత్త ఏమీ లేదు. మహిళలు, గ్రామీణులు, దళితులు, ఆదివాసీలు, పేదలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం అన్నది పాత కథే. భారత దేశంలో ఓటింగ్ సరళిని పరిశోధిస్తే తేలేది ఈ అంశాలే. సోషల్ పిరమిడ్ ఎగువ భాగంలో బీజేపీ కుదురుకోవడం అంత పాత విషయం కాకపోవచ్చు. బీజేపీ కొత్త సామాజిక విభాగం (న్యూ సోషల్ బ్లాక్) గురించి నేను 1999లో రాసినట్టు గుర్తు. కులం, వర్గం ద్వారా సోషల్ పిరమిడ్ పైభాగంలో బీజేపీ తిష్ఠవేయడం గురించి ‘ఫ్రంట్ లైన్’ లో ప్రచురించిన నాటి నా వ్యాసం వివరించింది. పిరమిడ్ దిగువ భాగంలో చీలికలు ఉన్నాయి. వాటిలో కొన్ని భాగాలు బీజేపీతో మమేకమైన సందర్భాలు ఉన్నాయి.

అప్పటి నుంచి బీజేపీ అనుసరించిన విధానం అదే. ఆడ-మగ, గ్రామీణ-పట్టణ విషయాలలో బీజేపీ చాలా కష్టపడి అననుకూలతను బాగా తగ్గించుకోగలిగింది. దిగువ, చిన్న ఓబీసీ కులాలకు దగ్గర కావడానికి బీజేపీ ప్రయత్నించింది. కొన్ని దళిత వర్గాలకు (సర్వసాధారణంగా మహాదళితులు), ఆదివాసీలలో కొన్ని తెగలనూ, ముస్లింలలో చిన్నచిన్నవర్గాలనూ(బోహ్రా, షియా, పాస్మాండా) దగ్గరికి తీసుకొని అననుకూలతను తగ్గించుకుంటూ వచ్చింది.  పేదలకు సంబంధించినంత వరకూ లాభార్థి పంథా ద్వారా నేరుగా ఆర్థిక సహాయం చేసి ఓటు అడగడం, రాజకీయ క్విడ్ ప్రోకో అమలు చేస్తోంది.

బీజేపీ ఆడుతున్న పిరమిడ్ ఎగువ రాజకీయాలకు విరుగుడుగా ప్రతిపక్షాలు పిరమిడ్ దిగువ రాజకీయాలను ప్రయోగించాలి. అడుగులో సగం కోసం నడిపించే రాజకీయం కాదిది. బడుగువర్గాలలో నాలుగు తరగతులవారి గురించి మాట్లాడుతున్నాం కనుక భారతీయులలో అత్యధికులు పిరమిడ్ దిగువ భాగానికి చెందినవారే. జనాభాలో కనీసం 80 శాతంమంది దళితులు, ఆదివాసీలు, ఓబిసీలు, మైనారిటీలు. జనాభాలో 66 శాతం మంది పేదవారు. వారికి నెలనెలా రేషన్ అందుతుంది. జనాభాలో 65 శాతం మంది ఇప్పటికీ గ్రామాలలోనే నివసిస్తున్నారు. 48శాతం మంది మహిళలు. అన్ని రకాలుగా లెక్కలు వేస్తే ఎగువ మధ్య తరగతికి చెంది, పట్టణాలలో నివసిస్తున్న హిందూ పురుషులు దేశ జనాభాలో రెండు శాతానికి మించి ఉండరు.

దిగువ పిరమిడ్ లో భారత దేశంలోని ఓటింగ్ జనాభాలో 98 శాతం మంది వస్తారు.

Also read: ఆశావహంగా హిందీ బాల సాహిత్యం

నివారించవలసిన మూడు నమూనాలు

మన గణతంత్ర వ్యవస్థను పునరుద్ధరించాలనీ, రాజ్యాంగ విలువలను కాపాడాలనీ, ప్రజాస్వామ్య సంస్థల్ని పునరుజ్జీవింపజేయాలనీ కోరుకునేవారు ఈ పిరమిడ్ దిగువ భాగంపైన దృష్టి పెట్టాలి. ఆ క్రమంలో మూడు పరిహరించవలసిన నమూనాలను దూరంగా పెట్టాలి.

ఇది బీజేపీ అనుసరించే లాభార్థి  రాజకీయాలకంటే మెరుగైనది మాత్రమే కాదు. లాభార్థి అన్నది యజమాని-కూలీ సంబంధమైనది. లాభార్థులను హక్కులు కలిగిన పౌరుడుగా చూడరు. వారు కేవలం లాభార్థులే కాకుండా పురుషార్థులు కూడానని పిరమిడ్ దిగువ రాజకీయాలు చేసేవారు గుర్తించాలి. సగౌరవంగా బతికేందుకు కష్టపడి సంపాదించుకోవాలని అనుకునేవారు పురుషార్థులు. వస్తువులనూ, సేవలనూ, విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసేవారు/ అందించేవారు.

పిరమిడ్ దిగువ రాజకీయాలంటే గరీబీ హటావ్ వంటి పాతరకం రాజకీయాలు కాదు. అందరి సంక్షేమం ఆకాంక్షించే రాజకీయాలు కావాలి. కొంతమంది – ఉదాహరణకు ఎకరం, రెండకరాలు కలిగిన సన్నకారు రైతులూ, పట్టణాలలో చిన్న జీతాలకు పనిచేసేవారూ పేదలుగా గుర్తించడానికి అంగీకరించరు. పేదలను సమీకరించేందుకు ఈ నినాదం మాత్రమే సరిపోయే రోజులు గతించాయి. ఇప్పుడు పేదలు నిర్దిష్టమైన ఫలితాలను ఆశిస్తున్నారు. మరో విషయం ఏమంటే పేదలను అందరినీ ఒకే గాట కట్టలేము. భూములు లేని పేదలకు వర్తించే హామీలు భూములున్నవారికి వర్తించవు. పట్టణాలలో సేవలు చేస్తూ జీవించే బడుగువర్గాలనూ, గ్రామాలలో వృత్తిపనులపైన జీవించే పేదలనూ ఒకే విధంగా చూడలేము. ఈ మండలానంతర (మండల్ కమిషన్ సిఫార్సులు అమలు తర్వాత రోజులలో) యుగంలో కులాన్నీ, వర్గాన్నీ  కలిపి చూడాలి.

పాత వామపక్ష రాజకీయాలూ చెల్లవు

అదే మాదిరిగా పాత వామపక్ష రాజకీయాల వంటివి కూడా చెల్లవు. సంఘటితమైన మిల్లు కార్మికుడు లేదా ఆర్థికంగా వెనకబడినవ్యక్తో కాదు. ఉత్పత్తిదారులూ, కౌలుకు ఇచ్చేవారి గురించి ప్రస్తావించినప్పుడు తప్ప వర్గ వైరుధ్యాలూ, వర్గ సంఘర్షణ వంటి మాటలు వినియోగించడం వ్యర్థం. గ్రామీణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన కార్మికుల, రైతుకూలీల మధ్య వర్గ ఏకీకరణ సాధించడంలోనే పిరమిడ్ దిగువ రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలను ప్రభుత్వరంగం ఉండి తీరాలన్నవాదనతో ముడిపెట్టడం అనవసరం. పిరమిడ్ దిగువ అంటే  ఆర్థిక వ్యవస్థలో చోటులేని బడుగువర్గాలని అర్థం కాదు. సంపదను ఎట్లా సృష్టించాలో, దాన్ని ఎట్లా పంపిణీ చేయాలో కూడా తెలిసిన రాజకీయం కావాలి.

Also read: అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

కొత్త పిరమిడ్ దిగువ రాజకీయాలలో సరికొత్త సంకీర్ణం, నవీన వ్యూహం, వాటికి తగిన భాష అవసరం. ఇది పిరమిడ్ దిగువ గురించి కాదు పిరమిడ్ ప్రాతిపదిక, పునాది గురించి. భారత్ కు ఆధారమైనవారు ఇక్కడే ఉన్నారు. దిగువన ఉన్నవారంటే ప్రభుత్వం ఇచ్చే ఉచితాలను అందుకునేవారు మాత్రమే కాదు. వీరిలో ఉత్పత్తిదారులు ఉంటారు. సేవలందించేవారు ఉంటారు. విజ్ఞానాన్ని పంచేవారు ఉంటారు. వీరిలో సంపద సృష్టించేవారూ, యువపారిశ్రామికులూ, దేశనిర్మాతలూ ఉంటారు. కనుక ఈ రాజకీయాలు ప్రజలకు ఏది లేదో అన్న విషయంపై కన్నా వారి నైపుణ్యం దేనికి పనికి వస్తుందో, వారి తెలివితేటలు ఎట్లా ఉపయోగించవచ్చునో, వారి ఆశలు ఏమిటో, ఆకాంక్షలు ఏమిటో తెలుసుకొని వాటిపైన ఆధారపడి రాజకీయాలు చేయాలి. మౌలికమైన జీవన పరిస్థితులూ, అవసరాల గురించి పట్టించుకుంటూనే ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాలనూ, సగౌరవంగా జీవించడానికి దోహదం చేసే చదువులూ, మెలకువలు నేర్చుకోవడానికీ సంబంధించి కూడా ఆలోచించాలి.

స్వల్ప కాలిక వ్యూహం

ఇటీవల సంభవించిన పరిణామాలు ఆధారంగా స్వల్పకాలిక వ్యూహంతో 2024 ఎన్నికల వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. ఈ కొత్త రాజకీయాలకు అదానీ వ్యవహారాన్ని బట్టబయలు చేయడం పునాది వేసింది. ఈ విషయంలో మీడియా నీరుగార్చి ఉండవచ్చును కానీ రాఫేల్ వ్యవహారంలాగా అదానీ వ్యవహారాన్ని ప్రజలు విస్మరించే పరిస్థితులు లేవు. సంపద పంపిణీలో న్యాయం కోసం కులం లెక్కలు (కాస్ట్ సెన్సస్) తీయాలనే డిమాండ్ పుంజుకుంటున్నది. గ్రామీణ  వ్యవస్థనంతటినీ రాజకీయంగా ఏకం చేసేందుకు వ్యవసాయదారుల ఉద్యమం బాట వేసింది. మహిళలను ఎంతో కాలంగా బాధిస్తున్న సమస్యకు పరిష్కారంగా మద్యవ్యతిరేక ఉద్యమాలు (మద్య నిషేధం కానీ నియంత్రణ కానీ కోరుతూ) జాతీయ అజెండాలోకి చేరుతున్నాయి. ఈ అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకొని 2024 ఎన్నికలకు అజెండా తయారు చేసుకోవడం ప్రతిపక్షాల ఎదుట ఉన్న సవాలు.

మన రాజ్యాంగ విలువలనూ, ప్రజాస్వామ్య సంస్థలనూ కాపాడటానికి జరిగే పోరాటం ఆత్మరక్షణ పద్ధతిలో ఉండనక్కరలేదు. వీటికి మౌలికమైన, సకారాత్మకమైన మలుపు ఇవ్వడానికి అవకాశాలు పిరమిడ్ ప్రాతిపదిక రాజకీయాలలో లభిస్తాయి.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles