• వాణి తొందర పడ్డారా!
• డిఫెన్స్ లో టిఆర్ఎస్…
• పట్టభద్రులు పీవీ ఇమేజ్ ను ఏమి చేస్తారో?
ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులు ఎనమిది నెలలుగా పట్టభద్రుల ఓట్లు నమోదులో తంటాలు పడ్డారు…వాళ్ళ ఓటు బ్యాంకు లెక్కలు వారికి ఉన్నాయి. రంగారెడ్డి- హైద్రాబాద్- మహాబూబ్ నగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో చివరి నిమిషంలో పీవీ తనయ వాణీదేవిని దించి టీఆర్ఎస్ పీవీ ప్రాబల్యాన్ని పరీక్షించాలనుకోవడం చూస్తే గురజాడ కన్యాశుల్కంలో లుబ్ధావధానులు ‘తాంబూలాలు ఇచ్చేశాను. తన్నుకు చావండి’ అన్న చందంగా ఉంది. అసలు ఈ దశలో కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి పీవీ పేరిట తెలంగాణకు ఒక జిల్లాకు పేరు, లేదా ఆయన పేరిట అతిపెద్ద ఆసుపత్రి కడితే చాలు అన్నట్టు పీవీ కుటుంబీకులు వ్యవహరిస్తే గౌరవప్రదంగా ఉండేది! మరణించే వరకు కాంగ్రెస్ బిడ్డగా ఉన్న పీవీ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని పట్టభద్రుల నియోజకవర్గంలోకి పోటీకి దిగడం సాహసం. ఓడితే పీవీ కుటుంబానికి తీరని మచ్చ. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా పీవీ పట్ల పట్టభద్రుల సానుభూతే. ఇక్కడ కేసీఆర్ వ్యూహాత్మక వైఖరిలో కూడా పెద్ద లోటు కనిపిస్తోంది. వాణీదేవి సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం ప్రారంభించారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాణీదేవిని గెలిపించే బాధ్యత తనయుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్ )కు కేసీఆర్ అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో అత్యధికులు కేటీఆర్ కి తెలిసినవారే. ఏమి చేస్తారో చూడాలి.
Also Read: ఎంఎల్సీ ఎన్నికలు: టీఆర్ ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె
నిజంగా వాణీదేవిని పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేయించదలిస్తే అన్ని పార్టీల నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ ఎన్నిక చేయిస్తే బాగుండేది. కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనకు సరే అనేది. బిజెపి తమ అభ్యర్థిని నిలబెట్టినా కూడా మొగ్గు పీవీ వారసుల వైపు ఉండేది. పోటీ చేస్తోంది ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు కాబట్టి బ్రాహ్మణ ఓట్లు చీలడం ఖాయం. దానికి తోడు ఇంతకు ముందు శాసన మండలిలో తన వంతు పాత్ర నిర్వహించిన వ్యక్తి కూడా తన సామాజిక వర్గం ఓట్లను చీల్చుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థికి పడే ఓట్లు ఎన్ని? అసలు ఉద్యోగస్తులు ఈ మధ్య కేసీఆర్ విధానాలపై గుర్రుగా ఉన్నారు. ఇదే అదనుగా వాళ్ళు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదిపితే పోయేది కేసీఆర్ పరువు. అసలు ఈ ఎన్నికల రంగంలోకి పీవీ కుటుంబీకులు ఎందుకు వచ్చారో అర్ధం కాని విషయం. ఇక పీవీ మనవడు బిజెపి లో కీలక పాత్ర వహిస్తున్నారు. సోదరుడు తటస్థ వైఖరిలో ఉన్నారు. దానికి తోడు ఇది మాస్ ఓటింగ్ కాదు. విద్యావంతులైన పట్టభద్రులు ఓట్లు వేసే ప్రక్రియ.
అధికారం దగ్గరి నుంచి చూసి జెడ్ కేటగిరి పొందిన పీవీ తనయ పెద్దల సభకు రావడం మంచిదే. కానీ ఆ సభకు రాకుండా అడ్డుపడే పెద్దలు ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకుంటే బాగుండేది. చివరి నిముషంలో కేసీఆర్ అన్ని పార్టీలనూ ఒప్పించి పీవీ కూతురుకు పట్టం కడతారనే ఆశ మిణుకు మిణుకు మంటుంది.
Also Read: రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
ఉద్దండులైన రామచంద్రరావు, కె. నాగేశ్వర్ చట్ట సభల్లో అరితేరి ఉన్నారు. ఇప్పుడు పట్టభద్రుల సమస్యలను తెలుసుకుని ఎన్నికల రంగంలో ఓటు బ్యాంకు కొల్లగొట్టే స్థితికి వాణి చేరుకుంటారా? పీవీ శతజయంతి ఉత్సవాల్లో పీవీ కుటుంబానికి నామినేట్ డ్ పదవులు ఇచ్చి కేసీఆర్ గౌరవం ఇస్తే బాగుండేది. వాణి విద్యావేత్త, కొన్ని కాలేజీల ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళ! కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా వేసే ఎత్తులు అన్నీ ఇప్పుడు బిజెపిని దెబ్బతీయడానికి అనుకుంటున్న వారు ఉన్నారు. పీవీ తనయను ఓడించారు అని బీజేపీపై ముద్ర వేయడానికి కూడా ఈ పాచిక వేయవచ్చు. నిజానికి కాంగ్రెస నూ, బిజెపిని ఒప్పించి ఎన్నికను ఏకగ్రీవం చేసే సత్తా కూడా కేసీఆర్ లో ఉంది. మా ఇంటి అమ్మాయి అని కాంగ్రెస్, శత జయంతి ఉత్సావాల్లో మేము పీవీ కుటుంబానికి సహకరించాం అని బీజేపీ సరిపెట్టుకునేవి. రేపు నామినేషన్ల గడువు ముగుస్తుందనగా ఈ రోజు పీవీ తనయను అభ్యర్థిగా ప్రకటించడం చూస్తే పీవీ కుటుంబం మీద అభిమానం కన్నా ప్రత్యర్థులను దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా భావించే అవకాశం ఉంది. బిజెపి ఇప్పుడు ఎన్నికల రంగంలో పీవీ కుటుంబాన్ని విమర్శించాలి. అలాగే కాంగ్రెస్ కూడా పీవీ కుటుంబాన్ని ఆడిపోసుకోవాలి.
Also Read: రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
ఇదా రాజకీయం? ఆ మహానుభావునికి ఇచ్చే నివాళి ఇదేనా? ఏదీ ఏమైనా పీవీ కుటుంబం ఈ రాజకీయ ఉచ్చులో చిక్కకుండా రాజనీతిజ్ఞత పాటించగలిగితే బాగుండేది. మాకు పదవులు కాదు గొప్ప. రాజకీయ వేత్త, ఆర్థిక సంస్కరణకర్త శత జయంతి ఉత్సావాల్లో సరియైన గౌరవం ఇచ్చేలా ట్యాంక్ బండ్ దగ్గర భారీ పీవీ భారీ విగ్రహాన్ని, అలాగే తెలంగాణలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టేందుకు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తే బాగుండేది.
Nice article sir
Well written article
Perfect anlysis.