- పి.వి. నరసింహారావు గొప్ప ప్రధాని, సాటిలేని దార్శనికుడు
- చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు
- ‘లుక్-ఈస్ట్’ పాలసీ ఆయన మానసిక పుత్రిక
- వాజపేయిని జెనీవా పంపారు, సుబ్రమనియన్ స్వామికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు.
స్వర్గీయ పి.వి. నరసింహారావు జయంతి ఉత్సవాలను టీపీసీసీ 24 జులై 2020న హైదరాబాద్ లో ప్రారంభించిన సందర్భంగా ముఖ్య అతిధిగా దిల్లీ నుంచి మాజీ ప్రదాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆన్ లైన్ లో ఇచ్చిన సందేశం.
డియర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు,
శ్రీ పి. చిదంబరం
శ్రీ జయరాంరమేష్,
డాక్టర్ జె. గీతారెడ్డి
శ్రీ పి.వి. మనోహరరావు
సోదరీసోదరులారా,
గొప్ప ప్రతిభావంతుడైన భూమిపుత్రుడు, మన మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించడం సంతోషదాయకం. ఈ ఉత్సవాలను ప్రారంభించడం మహత్తరమైన అవకాశంగా నేను భావిస్తున్నాను.
నరసింహారావుజీ ప్రభుత్వంలో 1991లో మొదటి బడ్జెన్ ను నేను ప్రవేశపెట్టిన రోజునే (24 జులై 1991) ఈ ఉత్సవాలను ప్రారంభించడం ఆనందదాయకం. రాజీవ్ గాంధీజీ హృదయవిదారకమైన మరణం తర్వాత కొన్ని రోజులకే ఇది జరిగింది. నేను బడ్జెజ్ ప్రసంగం చదువుతూ రాజీవ్ జీ ఇక లేరని చెప్పాను. ‘కానీ ఆయన స్వప్నం భద్రంగా ఉంది. పటిష్టమైన, సమైక్యమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, మానవీయమైన భారత్ ను ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకొని వెళ్ళడం అనే స్వప్నం ఆయనది. రాజీవ్ ఉత్తేజకరమైన స్మృతికి నా ఈ బడ్జెట్ ను అంకితం చేస్తున్నాను’ అంటూ ప్రసంగించాను.
ఆ బడ్జెట్ ఇండియాను పలు విధాలుగా మార్చివేసింది. అది ఆర్థక సంస్కరణలనూ, ఉదారవాద విధానాలనూ ప్రవేశపెట్టింది. అది చాలా కష్టమైన, సాహసోపేతమైన నిర్ణయం. భారత్ ను బాధిస్తున్న అంశాలు ఏమిటో క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్రహించిన ప్రధాని పి. వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు కనుక అది సాధ్యమైంది. సంస్కరణలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవసరమైన దూరదృష్టినీ, సాహసాన్ని ప్రదర్శించిన ఆ దార్శనికుడికి వినమ్రంగా నా ప్రణామాలు సమర్పిస్తున్నాను. రాజీవ్ గాంధీ వలెనే నరసింహారావుకు కూడా దేశ ప్రజలంటే అపరిమితమైన ప్రేమ. అందుకే ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే సమయంలో భారత ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ మిషెల్ కాండెస్సస్ తో అన్నారు.
ఆర్థిక సంస్కరణలవైపు అడుగులు వేయడం రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉండగానే ఆరంభమైంది. అంతకంటే ముందే మన ఆర్థిక విధానాలను పునరాలోచించవలసిన అవసరాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గుర్తించారు. కానీ 1991లో దేశం దివాళా తీయడానికి సిద్ధంగా ఉంది, విదేశీమారకద్రవ్యం నిల్వలు అడుగంటాయి. విదేశీమారక ద్రవ్యం సంక్షోభం ఏర్పడింది. కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెను సవాలుగా పరిస్థతి మారిన నేపథ్యంలో భారత ప్రభుత్వ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలదా, లేదా అన్న సంశయం ఎదురయింది. చాలా సున్నితమైన స్థితిలో ఉండిన మైనారిటీ ప్రభుత్వం, బయటి నుంచి మద్దతు ఉంటేనే కానీ నిలబడలేని అర్భక ప్రభుత్వం ఇంత పెద్ద సవాలును ఎదుర్కోవలసిన పరిస్థితి. అయినా సరే, పి.వి. నరసింహారావు ఒక నిర్ణయానికి వచ్చి, ఇతరులను ఒప్పించి, అందరినీ కలుపుకొని పోయారు. ఆయనకు నాపైన పూర్తి విశ్వాసం ఉన్నది కనుక ఆయన ఆలోచనలను అమలు చేయడంలో నేను నిస్సంకోచంగా ముందుకు నడిచాను. ఒక ఆలోచనకు అవసరం ఏర్పడి కాలం కలిసి వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరని విక్టర్ హ్యూగో (No power on earth can stop an idea whose time has come) చెప్పిన సంగతి నిజమని తేలింది. భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఎదగడం అన్నది అటువంటి ఆలోచన. ఇండియా నిద్రలేచి మెలకువగా ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం అది. ఇంకా చాలా దూరం కష్టభూయిష్టమైన మార్గంలో ప్రయాణించవలసి ఉంది. మిగతాది చరిత్ర. ఒక సారి వెనక్కి తిరిగి చూస్తే, భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడు నరసింహారావు జీ అని నిస్సందేహంగా అనవచ్చు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జన్మించిన పి.వి. నరసింహారావు జీ స్వాతంత్ర్య సమరంతోనే తన సుదీర్ఘమైన రాజకీయ యాత్ర ఆరంభించారు.1957లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. 1962 నాటి మంత్రి పదవిని అలంకరించారు. 1971-73 ప్రాంతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించారు. రాష్ట్రంలో భూసంస్కరణలను చాలా బలంగా అమలు పరిచారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పలు ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. 1985-88 కాలంలో మానవవనరుల శాఖ మంత్రిగా 1986 జాతీయ విద్యావిధానాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేశ వ్యాపితంగా జవహర్ నవోదయ పాఠశాలలు నెలకొల్పాలని నిర్ణయించారు. వెన్నెల వంటి తన వివేకాన్ని విదేశాంగమంత్రిగా ప్రదర్శించారు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యుడు. శ్రీమతి ఇందిరాజీతో, శ్రీ రాజీవ్ జీతో సన్నిహితంగా మెలిగేవారు. 1991లో లోక్ సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీజీ హత్య జరిగిన మీదట పి.వి. నరసింహారావు జీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 244 స్థానాలు లభించాయి. నరసింహారావుజీ ఎన్నికలలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానిగా ఆయన అప్రయత్నంగానే ఎంపికైనారు. 21 జూన్ 1991 నాడు ప్రధానిగా ప్రమాణం చేశారు. అదే రోజు ఆయన నన్ను ఆర్థిక మంత్రిగా నియమించారు.
ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ నిజంగా ఆయన చేసిన రెండు ఘనకార్యాలు. కానీ ఇతర రంగాలలో ఆయన దేశానికి చేసిన సేవలను విస్మరించలేము. విదేశీ వ్యవహారాలలో మన పొరుగు దేశమైన చైనాతో సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నించారు. ‘సార్క్’ దేశాలతో కలసి సౌత్ ఆసియా ప్రిఫెరెన్సియల్ ట్రేడ్ అగ్రిమెంట్ పైన సంతకం చేశారు. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందడానికి దారితీసిన ‘లుక్ ఈస్ట్’ విధానం కూడా ఆయన మానస పుత్రికే.
పి.వి. హయాంలోనే భారత అంతరిక్ష రంగానికి ప్రోత్సాహం లభించింది. అప్పుడే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఏఎస్ ఎల్ వీ), పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ ఎల్ వీ)ని జయప్రదంగా ప్రయోగించాం. బహిరంగ భద్రతను పటిష్టం చేసేందకు పృథ్వీ క్షిపణిని ప్రయోగించింది కూడా ఆయన పాలనలోనే. న్యూలీగ్ లో ఇండియా చేరడానికి వీలుగా అణుబాంబు పరీక్షకు సన్నాహాలు చేయవలసిందిగా డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాంని 1996లో పి.వి. పురమాయించారు. అప్పుడు అనుకున్న అణుపరీక్షను వాజపేయి ప్రధానిగా ఉండగా ఎన్ డీఏ ప్రభుత్వం 1998లో నిర్వహించింది (పోఖ్రాం-2).
అది రాజకీయాలలో సంక్లిష్టమైన శకం. నిశ్చలమైన మనస్తత్వం, సంపూర్ణ రాజకీయ శక్తి కలిగిన నరసింహారావు జీ చర్చలనూ, సమాలోచనలనూ ఎప్పుడూ ఆహ్వానించేవారు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి ఎల్ల వేళలా ప్రయత్నించేవారు. కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే, జమ్మూ-కశ్మీర్ లో మానవ హక్కుల పరిస్థితిపైన పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపైన చర్చించబోయే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో భారత ప్రతినిధి వర్గానికి నాయకుడిగా బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయిని పంపించారు. పాకిస్తాన్ ప్రయత్నాన్ని అప్పుడు విజయవంతంగా తిప్పికొట్టాం. కార్మిక ప్రమాణాలూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కమిషన్ చైర్మన్ గా డాక్టర్ సుబ్రమణియం స్వామిని కేబినెట్ హోదాలో నియమించారు.
పది భారతీయ భాషలలోనూ, నాలుగు విదేశీ భాషలలోనూ పరిజ్ఞానం కలిగిన బహుభాషా కోవిదుడుగా, మేధావిగా పి.వి. సాటిలేని వారసత్వాన్ని వదిలి వెళ్ళారు. కేవలం కంప్యూటర్ ని వినియోగించుకోవడంలోనే కాదు ప్రోగ్రామింగ్ ను అవగాహన చేసుకొని రూపొందించడంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నమా తరం నాయకులలో ఆయన మొదటివారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఆయనకు ఎల్లప్పుడూ ఉండేది కనుకనే ఇది సాధ్యమైంది.
స్వర్గీయ ప్రధాని శ్రీ నరసింహారావుజీ నాకు మిత్రడూ, ఆధ్యాత్మికగురువు, మార్గదర్శి. చివరిగా, అటువంటి మహానాయకుడి స్మృతికి నా నివాళులు అర్పిస్తున్నాను.
జై హింద్!