- జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఘనంగా కార్యక్రమం
- పీవీ మార్గ్ గా నక్లెస్ రోడ్డుకు నామకరణం
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారంనాడు ఇక్కడి నక్లెస్ రోడ్డులో విగ్రహావిష్కరణ జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కంచువిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది నక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలోనే ఉంది. నక్లెస్ రోడ్డుకు ‘‘పీవీ మార్గ్’’ అని నామకరణం చేశారు. పీవీ జయంత్యుత్సవ కమిటీ అధ్యక్షులు కె. కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీవీ కుటుంబ సభ్యులూ, మంత్రులు శ్రీనివాసగౌడ్, శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన పుస్తకావిష్కరణ సభలో వక్తలు పీవీ గుణగణాలను స్తుతించారు. తెలంగాణలోని ఒక కుగ్రామంలో జన్మించి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన పీవీ అసాధారణ ప్రజ్ఞావంతుడని, బహుభాషా కోవిదుడనీ, అసమాన పరిపాలనా దక్షుడనీ, బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వివరించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల పుణ్యఫలితంగానే ఈ రోజు చిన్న రాష్ట్రాల బడ్జెట్ వ్యయాలు లక్షలకోట్లకు మించి ఉంటున్నాయనీ, తలసరి ఆదాయం పెరిగిందనీ, పేదరికం తగ్గిందనీ వివరించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అత్యంత సమర్థంగా అయిదేళ్ళపాటూ నిర్వహించడమే కాకుండా అనేక ఘనకార్యాలు చేశారనీ, అటువంటి ప్రతిభావంతుడు తెలంగాణ ముద్దుబిడ్డ కావడం అందరికీ గర్వకారణమనీ చెప్పారు. పీవీ తెలంగాణ ఠీవి అనీ, ఆయనను ఎంత గౌరవించుకున్నా, ఎంత స్మరించుకున్నా, ఆయన ఘనకార్యాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని ముఖ్యమంత్రి చెప్పారు.
పీవీ బహుముఖీన వ్యక్తిత్వానికి అద్దం పట్టే విధంగా ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో అనేక వ్యాసాలు ప్రచరించారని చెబుతూ పీవీని భిన్నకోణాలలో తెలుగువారికి మరోసారి పరిచయం చేసినందుకు ఆ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. పత్రికలో ప్రచురించిన వ్యాసాలను సంకలించి ‘నమస్తే పీవీ’ అనే శీర్షికతో ఒక పుస్తకం ప్రచురించారు. గవర్నర్ ఆవిష్కరించిన తొమ్మిది పుస్తకాలలో అదీ ఒకటి. అదే విధంగా ప్రముఖ పాత్రికేయుడు సంజయ్ బారు ఆధ్వర్యంలో కాఫీ టేబుల్ బుక్ తీసుకొని వచ్చారనీ, పీవీ ప్రసంగాలూ, ఇంటర్వూలూ, వ్యాసాలూ కలిపి మూడు పుస్తకాలు వేశారనీ, పీవీ రచించిన కథలతో ఒక పుస్తకం ఇంగ్లీషులో వచ్చిందని చెప్పారు. ‘కాలాతీత వ్యక్తి’ అనే శీర్షికతో ఒకటి తెలుగులోనూ, ‘చాణక్య’ అనే పేరుతో ఇంగ్లీషులోనూ పుస్తకాలు విడుదల చేశారు. పీవీ ఆలోచనా విధానాన్ని, పీవీ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకొని వాటిని భావి తరాలకు సైతం అందించవలసిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు.
పీవీని స్మరించుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేశామనీ, మున్ముందు కూడా పీవీ పేరు మీద సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామనీ చంద్రశేఖరరావు చెప్పారు. ఇక్కడే పీవీ అధ్యయన కేంద్రం వస్తుందనీ, మ్యూజియం వస్తుందనీ తెలిపారు.
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన మంత్రిమండలిలో తాను సభ్యుడుగా ఉండేవాడిననీ, సందర్భం వచ్చినప్పుడల్లా మన్మోహన్ సింగ్ పీవీ ప్రస్తావన తెచ్చేవారనీ, పీవీని గురువుగా, తండ్రిగా ఆయన సంభావించేవారనీ చెప్పారు. తాను దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసుకుంటుంటే పిలిచి ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగించారనీ, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనీ, ప్రజలకు మంచి జరుగుతుందని భావించినప్పుడు తలచుకున్న పనులు ధైర్యంగా చేయవలసిందిగా ఆదేశించారనీ, ఆయన ఇచ్చిన మద్దతుతోనే ఆర్థిక సంస్కరణలు అమలు చేయగలిగాననీ మన్మోహన్ సింగ్ తనతో చెప్పినట్టు చంద్రశేఖరరావు వెల్లడించారు.
పీవీ జ్ఞానభూమిలో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ కేశవరావు సభికులకు స్వాగతం చెప్పారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి సంచాలకులుగా వ్యవహరించారు. సంవత్సరం పొడవునా పీవీ శతజయంతి వేడుకలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిర్వహించామనీ, కోవిద్ మహమ్మారి కారణంగా దిల్లీలోనూ, ఇతర ప్రాంతాలలోనూ నిర్వహించాలని తలపెట్టిన సెమినార్లను నిర్వహించలేకపోయామని, ఈ కార్యక్రమాలు కొనసాగుతాయనీ కేశవరావు తెలియజేశారు. విశాఖపట్టణంలో కూడా పీవీ విగ్రహం నెలకొల్పుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిందని ఆయన చెప్పారు.
పీవీని ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలిదక్షిణాత్యుడుగా గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. పీవీ సమర్థుడైన ప్రధానిగా, సంస్కరణల సారథిగా, దేశ సేవకు అంకితమైన రాజనీతిజ్ఞుడుగా ప్రజలు గుర్తుంచుకుంటారనీ, ఆయన సేవానిరతినీ, అధ్యయనశీలాన్నీ, సంస్కరణవాదాన్నీ వర్తమానంలో రాజకీయ నాయకులు అలవరచుకోవాలనీ అన్నారు. పీవీ విశాల హృదయం గురించీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించీ మాట్లాడుతూ, ఆయన ప్రధానిగా ఉండగా విపక్షానికి చెందిన అటల్ బిహారీ వాజపేయిని ఐక్య రాజ్య సమితి సమావేశానికి భారత ప్రతినిధివర్గం నాయకుడిగా పంపించారని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొని పోయేవారనీ, అందరినీ సంప్రతించేవారనీ, అందరినీ గౌరవించేవారనీ, అటువంటి లక్షణాలను రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకోవాలనీ గవర్నర్ ఉద్బోధించారు.
పీవీ కుమార్తె, ఎంఎల్ సీ సురభి వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకరరావు, పీవీ బంధువు, పోలీసు ఉన్నతాధికారి నందన్, పీవీ మనుమడు, బీజేపీ నాయకుడు సుభాష్, ట్రాన్స్ కో, జన్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు, ప్రభుత్వ సలహాదారు టంకసాల అశోక్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ సీతారామారావు, జలసంస్థ చైర్మన్ వి. ప్రకాష్, తదితరులు హాజరైనారు.