- భారత్ కు మిశ్రమ ఫలితాలు
- పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో లక్ష్యసేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ కే తలమానికంగా నిలిచే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ గత రెండుదశాబ్దాలుగా భారత స్టార్ ప్లేయర్లు సింధు, శ్రీకాంత్, సైనాలను ఊరిస్తూ, ఉడికిస్తూ అందినట్లే అంది చేయిజారిపోతూ వస్తోంది.అయితే కరోనా కారణంగా ప్రస్తుత 2021 టోర్నీకి పలువురు ప్రపంచ మేటి క్రీడాకారులు దూరం కావడంతో భారత క్రీడాకారులకు విజయావకాశాలు మెరుగయ్యాయి.తొలిరౌండ్ నుంచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ పోటీలలో మిశ్రమఫలితాలు రావడంతో ఇప్పుడు ఆశలన్నీ సింధు పైనే కేంద్రీకృతమయ్యాయి.
ఇంగ్లండ్ లోని బర్మింగ్‌హామ్ హామ్ వేదికగా ముగిసిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు వరుస గేమ్ ల్లో డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టోఫర్సెన్ 21–8, 21–8తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఐదోసీడ్ సింధు కేవలం 25 నిమిషాల్లోనే ప్రత్యర్థిని సింధు అధిగమించగలిగింది.
Also Read: ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్
సైనాకు ఆదిలోనే..
మాజీ రన్నరప్,వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్‌లోనే నిష్క్ర్రమించింది. ఈ మధ్యకాలంలో ఫిట్ నెస్ సమస్యలు,తరచూ గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సైనా తన తొలిరౌండ్ పోరు సగం నుంచే గాయంతో ఉపసంహరించుకొంది. డేనిష్ ప్లేయర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ జరిగిన పోటీలో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో తప్పుకుంది.
క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్…
పురుషులసింగిల్స్ లో భారత యువఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. ప్రీ- క్వార్టర్స్ లో ఫ్రాన్స్ ఆటగాడు థామస్ రౌక్సెల్ పై లక్ష్యాసేన్ 21–18, 21–17తో విజేతగా నిలిచాడు.భారత ఇతర ఆటగాళ్లలో సాయి ప్రణీత్, ప్రణయ్ లకు సైతం ఓటమి తప్పలేదు. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్‌సన్ చేతిలో ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు.
Also Read: క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి 21–17, 21–10తో బల్గేరియా జంట గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా పై అలవోక విజయం సాధించింది.మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరులో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి జోడీ 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయాలు చవిచూశారు.
డబుల్స్ లోనూ చుక్కెదురే..
పురుషుల డబుల్స్ లోనూ భారత టాప్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ ల పోటీ ప్రీ-క్వార్టర్స్ లోనే ముగిసింది. మొత్తం మీద మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ మాత్రమే పోటీలో మిగిలినట్లయ్యింది.
Also Read: భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్