* టైటిల్ కు రెండడుగుల దూరంలో తెలుగుతేజం
* క్వార్టర్స్ లో యమగుచిపై విజయం
ప్రతిష్టాత్మక 2021 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు భారత ఆశాకిరణం,తెలుగుతేజం పీవీ సింధు చేరుకొంది. బర్మింగ్ హామ్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో 5వ సీడ్ సింధు మూడుగేమ్ ల హోరాహోరీ సమరంలో చిరకాల ప్రత్యర్థి, జపాన్ ప్లేయర్ అకానే యమగుచీని కంగుతినిపించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.
Also Read : బ్యాటిల్ ఆన్ షిప్ బౌట్ లో విజేందర్ గల్లంతు
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరు తొలిగేమ్ ను 16-21 తో చేజార్చుకొన్న సింధు…ఆ తర్వాతి రెండుగేమ్ ల్లోనూ చెలరేగి ఆడింది. కోర్టు నలుమూలలకూ షాట్ల కొట్టి ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
సింధు 21-16, 21-19తో రెండు, మూడు గేమ్ లు నెగ్గడం ద్వారా యమగుచిని అధిగమించగలిగింది.
యమగుచి పై 10-7 రికార్డు
యమగుచి ప్రత్యర్థిగా సింధుకు 10 విజయాలు, 7 పరాజయాల రికార్డు ఉంది. అయితే… గత మూడు మ్యాచ్ ల్లోనూ యమగుచి చేతిలో ఓటమి పొందిన సింధు…కీలక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్స్ లో విజయం సాధించడం విశేషం. ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో థాయ్ లాండ్ ప్లేయర్ , 6వ సీడ్ పోర్న్ పావీ చోచువాంగ్ తో సింధు తలపడాల్సి ఉంది.
Also Read : ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో సింధు
1980 లో ప్రకాశ్ పడుకోన్, 2000 లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్స్ నెగ్గిన తర్వాత మరే భారత ప్లేయరూ విజేతగా నిలువలేకపోయారు. గతంలో సైనా నెహ్వాల్ ఫైనల్స్ చేరినా రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు. ఒలింపిక్స్ రజత, ప్రపంచ బ్యాడ్మింటన్ స్వర్ణపతకాలు సాధించిన సింధు…ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సైతం నెగ్గితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.