Saturday, November 23, 2024

ఇద్దరు తెలుగు బిడ్డలు, ఇద్దరూ శాపగ్రస్థులు

దేశ ప్రధానమంత్రిగా అయిదేళ్ళు పరిపాలించి, అపూర్వమైన ఆర్థిక సంస్కరణలు అమలు పరిచిన పాములపర్తి వేంకట నరసింహారావుకీ, తెలుగుజాతి ఉనికిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకీ భారతరత్న ఇవ్వరేమని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇది చర్చనీయాంశం.

రావలసినంత ఖ్యాతి రాలేదు                         

తెలుగు బిడ్డలైన పీవీ, ఎన్ టీ ఆర్ ఇద్దరూ శాపగ్రస్థులు. వీరిద్దరూ భరత జాతికీ, తెలుగుజాతికీ  ఎనలేని సేవచేసిన తెలుగుబిడ్డలు. వారివారి రంగాలలో అత్యంత సమర్థులు. దేశానికి నిస్వార్థ సేవలు అందించిన నేతలు. వీరికి రావలసినంత ఖ్యాతి రాలేదు. దక్కవలసినంత పేరుప్రతిష్ఠలు దక్కలేదు. అందుకు వారు ఎవరినైతే నమ్ముకున్నారో వారే కారణం. ఎవరిపైన ఆధారపడ్డారో వారే వెన్నుపోటు పొడిచారు. చరిత్రలో మిగలకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ చరిత్రకి ఇష్టాయిష్టాలు ఉండవు. రాగద్వేషాలు ఉండవు. తమపర భేదాలు ఉండవు. పాలకులు చరిత్రను కొంతకాలం నిర్దేశిస్తారు కానీ శాశ్వతంగా ఆ పని చేయలేరు. మంచినీ, చెడునీ చరిత్ర ఆలస్యంగానైనా గుర్తించి నిర్ద్వంద్వంగా నమోదు చేస్తుంది.

తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉంది

 పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ  ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్రాన్ని భారతరత్న ఇవ్వమని అడిగే హక్కు ఉంది. కానీ పీవీ నరసింహారావు 2004లో మరణిస్తే నిన్నమొన్నటి దాకా ఆయన ఊసు ఎత్తని టీఆర్ఎస్ కి కూడా పీవీని సొంతం చేసుకునే హక్కు పూర్తిగా లేదు. పీవీ బతికుండగానే నరకం చూపించిన కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ అధినేత సోనియాగాంధీకి ఆయన గురించి మాట్లాడే హక్కులేదు. భారతీయ జనతా పార్టీ సైతం ప్రేక్షకపాత్ర వహించింది. పీవీ తర్వాత ప్రధానిగా పని చేసిన అటల్ బిహారీ వాజపేయికి భారతరత్నం పురస్కారం అందజేసింది కానీ పీవీ గురించి ఆలోచించలేదు. కర్ణుడి చావుకి ఆరుగురు కారణం అన్నట్టు పీవీకి కీర్తికిరీటం దక్కకపోవడానికి ఆయన సేవించిన కాంగ్రెస్ పార్టీ, ఆయన సహించిన బీజేపీ, సొంత రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలూ, నాయకులూ కారణం.

చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు

నిజానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిల్లనిచ్చిన మామ ఎన్ టీ ఆర్ ని గద్దె దించినప్పుడు ఆయనకు పీవీ సహకరించారు. ఆ నాడే పీవీ ఎన్ టీ ఆర్ అభ్యర్థనను మన్నించి శాసనసభ రద్దు చేయాలన్న నాటి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే చంద్రబాబునాయుడు అప్పుడే బుట్టదాఖలయ్యేవారు. అటువంటి కీలక సమయంలో ఆదుకొని, సహాయం చేసిన పీవీకి భారతరత్న బిరుదు ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకు ప్రయత్నించలేదు.

ఎనిమిదేళ్ళ నిశ్శబ్దం

పీవీ మరణించిన తర్వాత ఎనిమిదేళ్ళ వరకూ తెలుగునాట ఒక్క సంతాప సభ కూడా జరగలేదు. పదహారేళ్ళ మౌనం తర్వాత ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు తెలంగాణలో. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆ ఊసే లేదు. పీవీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  కి ముఖ్యమంత్రిగా చేశారన్న స్పృహ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మొక్కుబడిగా ఉత్సవాలు ఆరంభించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పీవీ శతజయంత్రి ఉత్సవాలను ప్రారంభిస్తూ ఆయనను ఆర్థిక సంస్కరణలకు పితామహుడంటూ అభివర్ణించారు. చంద్రబాబునాయుడు పీవీ శతజయంతి గురించి మాట్లాడిన పాపాన పోలేదు.

అయినవారే అప్రతిష్ఠపాలు చేశారు

ఇక ఎన్టీఆర్ ను ఇంటివారే అప్రదిష్ఠపాలు చేశారు. కడుపున పుట్టిన కొడుకులూ,కూతుర్లూ, అల్లుళ్ళూ, కోడళ్లూ అందరూ కలిసి ఆయన భార్య లక్ష్మీపార్వతిపట్ల ద్వేషంతో ఆయన కడుపుకొట్టారు. చీకాకు పెట్టి చుక్కలు చూపించారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి సంయుక్తంగా ప్రచారం చేసి ఎన్నికలలో ఘనవిజయం సాధించి సంవత్సరం తిరగకుండానే కుట్ర చేసి ఆ మహానుభావుడిని గద్దె దించారు. కుట్ర యావత్తూ చంద్రబాబునాయుడూ, ఒక పత్రికాధిపతి రచించిన పథకం ప్రకారం జరిగింది. కుట్రలో సహకరించినవారిలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే కేసీఆర్ కూడా ఒకరు. సింహం వంటి ఎన్ టీఆర్ ని బోనులో బంధించారు. లక్ష్మీపార్వతి పేరు చెప్పి ఆయన ఉసురు తీశారు.

చంద్రబాబునాయుడు తలచుకుంటే ఎన్టీఆర్ కు వచ్చేది

మరణానంతరం భారతరత్న ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నాలను చంద్రబాబునాయుడు చేయకపోగా, అడ్డుకున్నారని కొందరి ఆరోపణ. మరణం తర్వాత భారతరత్న పొందినవారు చాలామంది ఉన్నారు. అంబేడ్కర్, సర్దార్ పటేల్, ఎంజి రామచంద్రన్, కామరాజ్ వంటి ప్రముఖులందరూ ఈ లోకం వదిలి వెళ్ళిన  తర్వాత దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం అందుకున్నవారే. తెలుగుదేశం నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ లో భాగంగా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాలంలో, వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ఏమి కోరితే అది మంజూరు చేసేవారు. పైగా ఎన్ టీ ఆర్ అంటే వాజపేయికి స్వయంగా గౌరవాభిమానాలు మెండుగా ఉండేవి. ఎన్ టీ ఆర్ కు భారతరత్న ఇస్తే దానిని ఆయన భార్య అయిన లక్ష్మీపార్వతి స్వీకరించవలసి వస్తుందనీ, ఆమెకు జాతీయ స్థాయిలో కొంత పేరు వస్తుందనే దుగ్ధతోనే చంద్రబాబునాయుడు అడ్డుకున్నారనీ పలువురు రాజకీయ పరిశీలకుల ఆరోపణ. లక్ష్మీపార్వతి సైతం ఇదే నిజమని చెబుతున్నారు. తెలుగు చిత్ర సీమలో, తెలుగు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన గొప్ప మనిషిని భ్రష్టుపట్టించిన సంతానం, వారిని కట్టుకున్నవారూ ఎప్పటికైనా వారి ప్రవర్తన గురించి చింతించవలసిందే. ఎంజీఆర్ చలనచిత్ర సీమలో ఎన్టీఆర్ తో సమానంగా రాణించినప్పటికీ రాజకీయాలలో ఎన్ టీఆర్ కి దీటుకాదు. ఉన్న డిఎంకే పార్టీని  చీల్చి అన్నాడిఎంకే పేరుతో కొత్తపార్టీ నెలకొల్పిన ఎంజీఆర్ కీ, స్వయంగా  తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది మాసాలలో కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకిలించిన నందమూరి తారకరామారావుకీ అంతరం ఉంది. ఎన్ టీ ఆర్ స్థానం ఎంజీఆర్ కంటే ఒక మెట్టు పైనే. జయలలితకు ఎంజీఆర్ ఉన్న గౌరవంలో కొంత భాగం ఎన్ టీఆర్ పైన చంద్రబాబునాయుడికి ఉన్నట్లయితే రామచంద్రన్ లాగానే తారకరాముడిని కూడా భారతరత్న వరించేది.

మజ్లీస్ నేత దుర్మార్గంగా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు

 దేశానికి ఎనలేని సేవలందించిన ఇద్దరు తెలుగువారు పీవీ నరసింహారావు, ఎన్ టి ఆర్ ల సమాధులను తొలగించాలంటూ ఎన్నికల సమయంలో మజ్లీస్ నాయకుడు దుర్మార్గంగా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమున్నది. ఆరు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన సొంతపార్టీ, అల్లారుముద్దుగా పెంచిన సొంత సంతానం, గౌరవించిన అల్లుళ్ళూ, కోడళ్ళూ నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా, దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు తెలుగు నాయకులను ఎన్నడూ గౌరవించని మజ్లీస్ నాయకులు ఏదో అన్నారని బాధపడితే ప్రయోజనం ఏముంది? అందుకే ఇద్దరు తెలుగు బిడ్డలూ శాపగ్రస్థులు. కానీ చరిత్ర వారికి తగిన స్థానం ఇస్తుంది. వారిని అవమానించినవారినీ, భ్రష్టుపట్టించినవారినీ చరిత్ర బోనులో దోషులుగా నిలబెడుతుంది. ఇద్దరికీ భారతరత్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. రాకపోయినా వారికి లోటు ఏమీ లేదు. వారు ప్రజల దృష్టిలో, చరిత్ర దృష్టిలో భారత అనర్ఘ రత్నాలే.  ఇది ముమ్మాటికీ ఎవ్వరూ కాదనలేని సత్యం.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles