ఉపన్యసించేందుకు అంగీకరించిన జస్టిస్ ఎన్ వి రమణ
హైదరాబాద్ : గురువారం డిసెంబర్ 23 మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి. ఆయన 2004లో అస్తమించారు. 2012 డిసెంబర్ 31న పీవీ నరసింహారావు స్మారకోపన్యాసాలను నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని జూబిలీ హాల్ లో ప్రారంభించారు. నేను అప్పుడు హెచ్ ఎంటీవీ, హన్స్ ఇండియా చీఫ్ ఎడిడర్ గా ఉండేవాడిని. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ పీవీ స్మారకోపన్యాసాలను కొనసాగిస్తూ వచ్చాం. ఆ తర్వాత కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాంనబీ ఆజాద్, మహాత్మాగాంధీ, రాజగోపాలాచారి మనుమడు, ఆచార్యుడూ, సుప్రసిద్ధ రచయిత రాజ్ మోహన్ గాంధీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ మాజీ సంపాదకుడూ, ప్రస్తుతం ‘ప్రింట్’ వ్యవస్థాపక సంపాదకుడూ శేఖర్ గుప్తా, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉపకులపతి, ప్రొఫెసర్ హెరాల్డ్ లాస్కీ శిష్యుడు ప్రొఫెసర్ చంద్రశేఖరరావు పీవీ స్మరకోపన్యాసాలు చేశారు. పీవీ శతజయింతి సందర్భంగా పీవీ స్మారకోపన్యాసాన్నికాంగ్రెస్ వరిష్ఠ నాయకుడూ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు, బహుగ్రంథ రచయిత శశిథరూర్ చేశారు.
ఈ సంవత్సరం పీవీ స్మారకోపన్యాసం ఇవ్వడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అంగీకరించారు. ఈ సారి సభ హైదరాబాద్ లోనే జరుగుతుంది. జనవరి మాసాంతంలో స్మారకోపన్యాసం ఉంటుంది. మళ్ళీ ఒక తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి కావడం నేను చూడలేకపోవచ్చు. అందుకే కొంత జాప్యం అయినా జస్టిస్ రమణగారి చేత పీవీ గురించి మాట్లాడించాలని నిర్ణయించాం. అందుకు ఆయన అంగీకరించారు. ఆ సభలోనే పీవీ గారిపైన ఆంధ్రజ్యోతి దిలీ బ్యూరో చీఫ్ ఏ కృష్ణారావు రచించిన ఇంగ్లీషు పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది. ఆలస్యానికి మన్నించవలసిందిగా కోరుతూ ఏ తేదీన స్మారకోపన్యాసం ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తర్వాత తెలియజేస్తామని పీవీ స్మారకోపన్యాస వ్యవస్థాపక నిర్వాహకుడు, వరిష్ఠ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి తెలియజేశారు.