రామాయణమ్ – 221
‘‘రామా, నీ కొరకు అమూల్య వస్త్రాభరణములను, చందన శీతల గంధములు తెచ్చినాము. మూలికలతో కూడినస్వచ్ఛమైన నీటితో స్నానము చేయించి అలంకరింపచేయుటకు తగిన పనివారు, సుందరీమణులు వేచియున్నారు. ఆ పిదప లంకలో నా ఆతిథ్యము నీవు స్వీకరింపవలె. ఇది నా చిరుకోరిక. రామా నన్ను అనుగ్రహించవయ్యా’’ అని దోసిలియొగ్గి విభీషణుడు ప్రార్ధించెను.
Also read: దివ్యవిమానములో దశరథ దర్శనం
రామచంద్రుడు ఆ ప్రార్ధన ఆలకించి, ‘‘విభీషణా, అక్కడ నా సోదరుడు భరతుడు అన్నపానములుమాని కళ్ళలో వత్తులు వేసుకొని నా కోసము ఎదురు చూచుచున్నాడు. నా భరతుని కలుసుకొని ఆలింగనముచేయనంతవరకు నాకు మాత్రము ఈ సుఖములు ఎందుకు? ఈ అలంకారములు ఎందుకు? నా మనస్సు నా సోదరునిచూడ తొందరపెడుతున్నది. నీ కోరిక నేను తీర్చలేను. అయోధ్యకు అతిత్వరగా చేరుకొను ఉపాయము ఆలోచింపుము. అదియే నీవు నాకు చేయగల సత్కారము’’ అని శ్రీరాముడు పలికెను.
అప్పుడు విభీషణుడు వెంటనే పుష్పకమును రప్పింపచేసెను. ఆ దివ్యవిమానము రాయంచవలె వయ్యారముగా వచ్చి సీతారాముల ఎదుట నిలుచుండెను.
Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు
మరియొకసారి విభీషణుడు ‘‘రామచంద్రా, ఈ విమానము అతివేగముగా నిన్ను అయోధ్య చేర్చగలదు. కావున ఒక్కసారి నా మాట మన్నించి నా ఆతిథ్యము సీతా లక్ష్మణ సమేతుడవై స్వీకరింపుమయ్యా’’ అని మరల మరల ప్రార్ధించెను .ఆ విన్నపమును కూడా రాఘవుడు సున్నితముగా తిరస్కరించి, ‘‘నా బదులు ఈ వానరులందరినీ సత్కరించు రాక్షసరాజా’’ అని పలికెను. విభీషణుడు అటులే చేసెను.
అప్పుడు రామచంద్రుడు పుష్పకముఎక్కి తన అంకముపై సిగ్గులమొగ్గయై ముడుచుకొన్న సీతమ్మను కూర్చుండబెట్టుకొనెను. లక్ష్మణుడు కూడా పుష్పకము అధిరోహించెను.
శ్రీరామచంద్రుడు విమానమున కూర్చుండి విభీషణుని, సుగ్రీవుని చూసి ‘‘మిత్రులారా, మీరు మీ మిత్రుని కార్యమును సమర్దవంతముగా సాధించినారు. కావున ఇక మీరు మీ మీ స్వస్థలములకు తిరిగి వెళ్ళుడు. నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను’’ అని పలికెను.
Also read: సీతమ్మ అగ్నిప్రవేశం
రాముని మాటలు విన్న వారందరూ చేతులు జోడించి ఒకే గొంతుకతో ఇలా పలికిరి.
‘‘రామా, మాకు పట్టభిరాముని కనులారా కాంచవలెనని కోరిక. అయోధ్యరాముని చూడవలెనని అభిలాష’’ అని పలికిరి. వారి కోరికను గ్రహించిన రాముడు ‘‘అయోధ్యకు మా వెంటనే రండి అందరూ. విమానమధిరోహించండి’’ అని ఆనతిచ్చెను .
విభీషణ సుగ్రీవులతో కూడి బిలబిలమంటూ వానరులంతా విమానమెక్కిరి. రాముడు అనుమతి ఇవ్వగానే ఆకసములోనికి విమానము లేచెను.
ఆకసమునుండి ఒక్కొక్క ప్రదేశమునూ మిధిలారాజకుమారికి దాశరధి చూపించసాగెను.
‘‘సీతా, అదుగో చూడు లంక. అదుగదుగో అటుచూడు ఈ తావునందే రావణ సంహారము గావించితిని. ఇదుగో ఈ ప్రదేశము ఎంత రమణీయముగా ఉన్నదో చూశావా? ఇదుగో మేఘాల మాలిక ఎలా అల్లుకున్నదో చూడు. సముద్రము చూశావా ఎంత ఎత్తున లేస్తున్నదో మనలను అందుకోవాలని!
Also read: రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ
‘‘ఇదుగో ఇదే కిష్కింధ. ఇక్కడే వాలిని సంహరించాను’’ అని చెపుతున్న రాముని మాటలకు అడ్డుతగిలి సీతమ్మ, ‘‘నాధా! తార, రుమ మొదలైన వానర స్త్రీలను కూడా మనతో అయోధ్యకు తీసుకు వెళదాము అని కోరింది.
రామచంద్రుడు సరేనన్నాడు.
సుగ్రీవునితో ఈ సంగతి చెప్పినాడు. పుష్పకము కిష్కింధలో ఆగినది.
సుగ్రీవుడు వెళ్లి ఈ సంగతి తెలుపగానే సీతమ్మను చూడవలెనను కుతూహలముతో వెంటవెంటనే అందరూ బయలుదేరి వచ్చి విమానమెక్కినారు అబ్బ “చూడచక్కని రమణి రాములోరి ఇల్లాలు” అని ఆనందపడిరి.
మరల బయలుదేరినది పుష్పకము.
Also read: రాముని సందేశము సీతమ్మకు వినిపించిన హనుమ
వూటుకూరు జానకిరామారావు