Sunday, December 22, 2024

ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పాయం భార్గవ

మన భారతదేశంలో ఆత్మలని, పరమాత్మలని, దేవుళ్ళని, దయ్యాల్ని, స్వాముల్ని, బాబాల్ని, మంత్రాల్ని, పూజల్ని, ముహూర్తాల్ని, తాయత్తుల్ని నమ్మే సైంటిస్టులకి కొదువలేదు. నిజమే! కాని, వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందాలని జీవితాలు ధారపోసిన వైజ్ఞానికులు, సైన్సు ప్రచారకులు, రచయితలు లేకపోలేదు. అలాంటి వారిలో ముందు వరసలో చెప్పుకోవాల్సినవారు పుష్పాయం భార్గవ! ఈయన జీవితం నుంచి నేటి యువతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొంతమంది మనుషులు తమ వాక్చాతుర్యంతో అబద్ధాలు ప్రచారం చేస్తారు. కానీ, సైన్సు అనేక రుజువులతో సత్యాన్ని భౌతికంగా మనముందు నిలబెడుతుంది. ఆ సైన్సు వెలుగులో ప్రజలకు సత్యాన్ని చూపించడానికి ఆహర్నిశలు తపించిన హేతువాది పుష్ప మిత్ర భార్గవ!

పాఠశాల స్థాయి నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి దాకా అలాగే బయట సమాజంలోనూ మేథావుల గొంతులు నొక్కేయడానికి నేటి ప్రభుత్వ పాలకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎండగడుతూ వచ్చిన ఉన్నతశ్రేణి వైజ్ఞానికుడు ఆయన! ఒకవైపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావల్సిన మార్పులకు – విధి విధానాల రూపకల్పన చేస్తూనే, క్షేత్రస్థాయిలో ప్రాంతీయంగా చేయాల్సిన సైన్సు ఉద్యమాలను కూడా ప్రోత్సహించారు. ఊరికే సలహాలు, సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా, తనే ముందు నిలిచి, యువకులకు స్ఫూర్తినందించారు.

చేపమందుపైన సమరం

పుష్ప మిత్ర భార్గవ ప్రజా పక్షపాతి. ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖపాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్సు ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించిన వారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందుకాదని నిరూపించారు. చేపమందు పంపిణీదారులు పలాయనం చిత్తగించడానికి కారణమయ్యారు. తర్వాత వారు మందును ‘ప్రసాదం’గా ప్రకటించుకోవాల్సి వచ్చింది.

వాస్తవాలు గ్రహించిన జనం ఆ తర్వాత ‘చేప ప్రసాదం’ కోసం బారులు తీరడం మానేస్తూ వచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు-ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చలేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్‌కి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. ఎంఎఆర్‌సీహెచ్‌ (మెడికల్లి ఎవేర్‌ అండ్‌ రెస్పాన్సబుల్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) స్థాపించి అల్లోపతి మందు ప్రామాణికత మీద ప్రతినెలా అవగాహన కల్పించేవారు. శ్రీమతి చందనా చక్రవర్తి సహ రచయిత్రిగా ఆయన రచించిన పుస్తకాలు ‘ఏన్‌ ఎజెండా ఫర్‌ ద నేషన్‌’ – ‘టూ ఫేసెస్‌ ఆఫ్‌ బ్యూటీ : సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌’, ‘ఏంజిల్స్‌ డేవిల్స్‌ అండ్‌ సైన్స్‌’ – ‘ద సాగా ఆఫ్‌ ఇండియన్‌ సైన్స్‌ సిన్స్‌ ఇండిపెండెన్స్‌ ఇన్‌ ఎ నట్‌షెల్‌’ మొదలైనవన్నీ ప్రజాసైన్స్‌ ఉద్యమానికి ఎంతో ఉపకరించాయి. అలాగే శివాజీ; కార్ల్‌ హైండా ఫైట్‌ సహకారంతో భార్గవ రచించిన ‘ప్రొటీన్స్‌ ఆఫ్‌ సెమినల్‌ ప్లాస్మా” అనే గ్రంథం కూడా చెప్పుకోదగ్గది.

21 ఏళ్ళకే పీహెచ్ డీ

డాక్టర్‌ పుష్ప మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928 – 1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీరు (అజరుమేరు)లో జన్మించారు. తండ్రి డాక్టర్‌ రామచంద్ర భార్గవ, వైద్యుడు. తల్లి గాయత్రీ భార్గవ గృహిణి. బాల్యంలో వారణాసిలోని బీసెంట్‌ థియోసాఫికల్‌ స్కూల్లో చదువుకున్న భార్గవ, ఆ తర్వాత క్వీన్స్‌ కళాశాలలో, లక్నో విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యనభ్యసించారు. 1944లో బి.యస్సీ పట్టభద్రుడై, 1946లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ స్వీకరించారు. కొంత కాలం అక్కడే లక్నో యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాదు చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు.

కేన్సర్ పరిశోధన

ఒకవైపు బోధన, మరోవైపు పరిశోధన కొనసాగిస్తూ 23ఏండ్లకే 14 పరిశోధనా పత్రాలు ప్రచురించగలిగారు. 1958లో పోస్ట్‌ డాక్టోరల్‌ స్కాలర్‌షిప్‌తో అమెరికా వెళ్ళి, అక్కడి విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో కొంత కాలం పరిశోధనలు చేశారు. కేన్సర్‌కు మందు (5 ప్లోరో యురాసిల్‌) కనుగొనడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మూడేండ్ల తర్వాత యూ.కే.లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌లో పరిశోధనలు చేశారు. ఐదేండ్ల తర్వాత స్వదేశం తిరిగొచ్చి, హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ ఆర్‌ఆర్‌ఎల్‌)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్‌ ఇనిస్టూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. 1971-72 లలో ఆయన ఫ్రాన్స్‌ వెళ్ళి, పారిస్‌లోని ‘ఇనిస్టిట్యూట్‌ డూ రేడియం’లో కేన్సర్‌పై పరిశోధనలు చేసి వచ్చారు.

1975లో జాతీయ విద్య పరిశోధనా – శిక్షణా సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) సంచాలకుడు రయీస్‌ అహ్మద్‌, పుష్పా భార్గవకు ఒక గురుతరమైన బాధ్యతను అప్పగించారు. విద్యార్థులకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెరిగే విధంగా ఒక ప్రదర్శన (ఎగ్జిబిషన్‌)కు రూపకల్పన చేయమన్నారు. ఫలితంగా పీ.యం. భార్గవ సారథ్యంలో ‘శాస్త్రీయ పద్ధతి’ (మెథడ్‌ ఆఫ్‌ సైన్స్‌) అనే ఇతివృత్తంతో హైదరాబాదు ఐ.ఐ.సీ.టీలో బ్రహ్మండమైన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ రూపుదిద్దుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని బాలభవన్‌లో 1977 జనవరి మార్చి నెలల్లో మరొక అద్భుతమైన సైన్స్‌ ప్రదర్శన ప్రారంభమైంది. అది జనాన్ని విశేషంగా ఆకర్షించింది. అయితే, ఆనాటి జనతా ప్రభుత్వ పెద్దలకు అది నచ్చలేదు.

సైన్స్ ఎగ్జిబిషన్ వివాదం

ఏవో రాజకీయ దురుద్దేశాలతో 1978లో ఆ ఎగ్జిబిషన్‌ను చడీచప్పుడు లేకుండా మరుగున పడేశారు. దానితో దేశ రాజధానిలో ఆందోళనలు జరిగాయి. విషయం కోర్టుకెక్కింది. చివరకు ఆ పరికరాలన్నింటిని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగలు చేసి, వాటిని హైదరాబాద్‌కు తరలించింది. కొంతకాలం ఇక్కడి కేంద్ర గ్రంథాలయంలో లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు గొప్ప వైజ్ఞానిక ఆకర్షణగా నిలిచింది. కాలక్రమంలో ఆ ప్రదర్శనలోని పరికరాలను నౌబత్‌ పహాడ్‌ మీదున్న ‘బిర్లా సైన్స్‌ సెంటర్‌’కు మార్చారు. నిధుల కొరత, ప్రభుత్వాల అనాసక్తత వల్ల అక్కడ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం కాలేదు. ఈసైన్స్‌ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్ని బి. ప్రేమానంద్‌ ‘ఒక కళాత్మక విజ్ఞాన శాస్త్ర నిర్మాణ విధ్వంసం’ (వాండలైజేషన్‌ ఆఫ్‌ ఎవర్క్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌) అనే గ్రంథంలో నమోదు చేశారు.

సీసీఎంబీ వ్యవస్థాపకుడు

డాక్టర్‌ పి.యం. భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ సీసీఎంబీని స్థాపించగలిగారు. 1977-1990 మధ్య కాలంలో దానికి వ్యవస్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్‌ సెగ్మెంట్స్‌ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. శాస్త్రవేత్త గుహ పేరుతో పరిశోధక మహాసభలు నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. దీనికోసం జర్మనీ – గోటెన్జెన్‌లోని మాక్స్‌ – ప్లాంక్‌ బయో ఫిజికల్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పనిచేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారి కోసం కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు దానికి ప్రెసిడెంట్‌గా ఉన్న శామ్‌ పిట్రోడా విధానాలతో విభేదించి రాజీనామా చేసి బయటపడ్డారు. అయితే డి.ఎన్‌.ఏ. ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణమయ్యారు డాక్టర్‌ భార్గవ!

ఒక సైంటిస్టుగా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయిలలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనాశాలల సమన్వయంతో పనిచేస్తూ ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరిశోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన డాక్టర్‌ పుష్పా మిత్ర భార్గవ కృషి చాలా విలువైంది. మరోవైపు పరిశోధనా ఫలితాల సారాంశం సామాన్యుడికి అందాలనీ, సగటు మనిషిలో వైజ్ఞానిక స్పృహ పెరగాలనీ తహతహ లాడినవారు. 1963లో ఆయన సతీష్‌ ధావన్‌, అబుర్‌ రహమాన్‌లతో కలసి వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి ఒక జాతీయ సంఘం నెలకొల్పారు. అలాగే 1980లో రాజా రామన్న, పి.ఎన్‌. హక్సర్తోలతో కలిసి ”ఎ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ టెంపర్‌” ప్రకటించారు. ఇది భారతీయ సామాజిక జీవనంలో రావల్సిన మార్పుల గురించి విపులంగా చర్చించింది.

పద్మభూషణ్ వాపస్

డాక్టర్‌ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఇచ్చే లీజియన్‌ డి ఆనర్‌ (1998) పొందిన ఘనత వీరిదే. 1986లో భారత ప్రభుత్వం ఆయనకు ‘పద్మభూషణ్‌’ ఇచ్చి సత్కరించింది. అయితే ఈ మధ్యకాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందస అసహనం పట్ల – దభోల్కర్‌, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలతచెందిన భార్గవ, తన పద్మభూషణ్‌ సత్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్‌ చేశారు. అంతటి సత్కారాన్ని తృణప్రాయంగా భావించి, వెనక్కి పంపి.. తీవ్రమైన తన నిరసనను ప్రకటించారు. ప్రజా సైన్సు ఉద్యమకారుడిగా తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. చాలా మంది సైంటిస్టులు మానసిక బలహీనులు. రాకెట్‌ మోడల్‌ను గుళ్ళో పెడతారు. స్వాముల, బాబాల ఆశీస్సులు కోరుతూ వెళ్ళి, వాళ్ళ కాళ్ళమీద పడతారు. కాశీదండలు కట్టుకుని తిరుగుతుంటారు. ఉద్యోగపరంగా ఎదిగినా, వ్యక్తులుగా దిగజారిపోయి ఉంటారు. తమ విలువతామే తెలుసుకోరు.

ఇదీ చదవండి: ఆర్థికశాస్త్ర నిపుణుడు `వీఎస్`

మూఢనమ్మకాలపై నిరంతర పోరాటం

సామాన్యజనం వారిపట్ల ఎంత ఆరాధనా భావంతో ఉంటారనేది వీరికి పట్టదు. తమ మానసిక వైకల్యాలు బహిర్గతం చేస్తుంటారు. సైన్స్‌ అంతా హేతువులోంచి జనించేదేనన్న ప్రాథమిక అంశాన్ని కూడా గ్రహించరు. ఇలాంటి వారు డాక్టర్‌ పుష్పా మిత్ర భార్గవ లాంటి వారి జీవితాల్లోంచి ఎంతో నేర్చుకోవాలి. మొత్తం సమాజం చైతన్యవంతం కావాలని, జనంలో మూఢనమ్మకాలు పోవాలని, దేశ పౌరుల్లో వైజ్ఞానిక దృక్పథకం పెరగాలని నిరంతరం తపించిపోయిన వారు డాక్టర్‌ భార్గవ.

ఉద్యోగ బాధ్యతగా విధులు నిర్వహించడం అందరూ చేస్తారు. అవి చేస్తూనే సమాజ చైతన్యానికి కృషి చేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైజ్ఞానిక వ్యవహారాలు చక్కదిద్దుతూ రావడం, కొత్త సంస్థలకు రూపకల్పన చేయడం… కేవలం దార్శనికులు మాత్రమే చేయగలరు. డాక్టర్‌ భార్గవ దార్శనికుడే కాదు ఒక క్రాంతి దర్శి.

ఉత్తర భారతదేశం నుంచి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుంచి పొందుతూనే ఉండాలి! వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేసే పనిలో నిరంతరం పాల్గొంటూనే ఉండాలి!!

(ఫిబ్రవరి 22 పుష్పాభార్గవ జయంతి)

(వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్ర వేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles