- రెండేళ్ళ తర్వాత దేదీప్యమానంగా కదిలిన రథచక్రాలు
- భక్తుల ఆనంద సాగర ఘోష
- తండోపతండాలుగా పాల్గొన్న జనం
స్వాతంత్ర్యం,సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం పునాదులు కదిలిన కరోనా కాలం దాటి జగన్నాథ రధచక్రాలు జనమార్గం పట్టాయి. రెండేళ్ల విరామం తర్వాత, జగమంతా ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథుని ‘నందిఘోష్’ (జగన్నాథుడి రథం) భక్తుల ఆనంద సాగరఘోష మధ్య సోదరుడు బలభద్రుని ‘తాళధ్వజ’ ( బలరాముని రథం), సోదరి సుభద్ర రథం ‘దర్పదళన్’ వెంటరాగ, కన్నులపండువగా కదలి సాగింది. లక్షలాదిమంది ప్రత్యక్షంగా పాల్గొనగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది జనులు విభిన్న సాంకేతిక రూపాల్లో వీక్షిస్తున్నారు. కోవిడ్ మళ్ళీ ప్రబలుతోందని వార్తలు వ్యాపిస్తున్నా, ప్రజలు లెక్కచేయక ఈ యాత్రలో పాల్గొన్నారు.
Also read: ఉసురు తీసిన ఉగ్రవాదం
లక్షలాది మంది భక్తజన సందోహం
పూరీ వీధులు మునుపటికి మించి కిక్కిరిసిపోయాయి. సుమారు 15లక్షలమంది పైగా భక్తులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. జగన్నాథ యాత్రను తిలకించడానికి విదేశీయులు కూడా తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఇంత పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడడం కరోనా కాలంలో ఆందోళన కలిగించే అంశం. నిబంధనలను పాటించే అవకాశాలు ఏమాత్రం లేని పరిస్థితిలో ఈ మహోత్సవం సాగుతోంది. ఆ జగన్నాథుడే రక్షిస్తాడని వారి విశ్వాసం కాబోలు! సోదరుడు, సోదరితో కలిసి జగన్నాథుడు ‘గుండిచా’ మందిరానికి రథంలో వెళ్లి కొన్నాళ్ళు విడిది చేసే ఈ వేడుక వందల ఏళ్ళ నుంచి నేత్రపర్వంగా సాగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఈ మహోత్సవంలో జనం పాల్గొనడమే గొప్ప సౌందర్యం! ‘గుండిచా’ ముగ్గురు మూర్తుల జన్మక్షేత్రంగా వాసికెక్కింది. పెంచిన తల్లి గుండిచా మహారాణి దగ్గరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ వెళ్లి కొంతకాలం అక్కడ గడుపుతారు. అదే ఈ వేడుకలోని విశిష్టత. పురాణప్రసిద్ధమైన పూరీజగన్నాథుని విశేషాలు నిజంగానే విశేషంగా ఉంటాయి. జగత్తుకు నాథుడైన విష్ణుమూర్తియే జగన్నాథుడని భక్తులు అచంచలమైన విశ్వాసంతో కొలుచుకుంటారు. పూరీ మహారాజులకు, సామంతులైన దసపల్లా రాజులకు ఈ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది. రథాలు బయలుదేరే ముందు సంప్రదాయం ప్రకారం పూరీ మహరాజు మూడు రథాల ముందు బంగారుచీపురుతో ఊడుస్తారు. ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాజా దివ్యసింగ్ దేవ్ బంగారు చీపురుతో ఊడ్చి స్వాగతం పలికారు. గవర్నర్ గణేశీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో పాటు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఈ మహోత్సవానికి ఘన స్వాగతం పలికారు. రెండేళ్ల తర్వాత ఈ వేడుక జరుగుతున్న నేపథ్యంలో భక్తులు రెట్టింపు ఉత్సాహంతో రథాన్ని లాగుతున్నారు. జయ జయ ద్వానాలు మిన్ను ముట్టుతున్నాయి. నారాయణ స్మరణ మార్మోగుతోంది. ఈ కోలాహలం నడుమ గుండిచా ఆలయం చేరడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని గత అనుభవాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఒరిస్సా అనేక విశిష్ట సంస్కృతులకు ఆలవాలంగా ప్రసిద్ధికెక్కింది. ఆ రాష్ట్రంలో కోనార్క్ సూర్యదేవాలయం మొదలు ఎన్నో పౌరాణిక,చారిత్రక క్షేత్రాలు, ప్రదేశాలు,దర్శనీయ స్థలాలు ఉన్నాయి.అష్టపదులు రచించిన జయదేవుడు అక్కడివాడే. మనిమా! అంటూ పిలుచుకొనే జగన్నాథుడు ఒరియావాసులకు అత్యంత ఇష్టదైవం.మనకు తిరుమల వెంకన్న వలె ఒరియావారికి జగనన్న ఇలవేలుపు.
Also read: అమరనాథ్ యాత్రికులకు పొంచి ఉన్న ముప్పు!
పరమ పావన యాత్ర
రథయాత్ర ఆషామాషీ వ్యవహారం కాదు.సుమారు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి.ఎక్కడా యంత్రాన్ని వాడకుండా కలప ద్వారానే రథాలను నిర్మాణం చేయడం తరతరాల ఆచారం. జగన్నాథ యాత్రగా పిలుచుకొనే ఘోషయాత్ర (నందిఘోష్) వేళ స్వామిని పతితపావనుడని అంటారు. జనుల పాపాలను పోగొట్టి పావనం చేసేవాడని తాత్పర్యం. ఒకప్పుడు కొన్ని వందల మైళ్ళ నుంచి లక్షలాది మంది భక్తులు అరణ్యాలను,పర్వతాలను, పొంగిపొరలే నదులను దాటి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చేవారు.రవాణా సదుపాయాలు పెరిగిన ఈ రోజుల్లో ఆ శ్రమ తగ్గింది. చారిత్రక ఆధారాల మేరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వైభవం జరుగుతోంది. పూరీ జగన్నాథుని ఆలయనిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు,గాథలు, చారిత్రక వివాదాంశాలు కూడా ఉన్నాయి.అవన్నీ అలా ఉంచగా ‘జగనాథ రథయాత్ర’ గొప్ప ఆకర్షణీయమైన, వైభవోపేతమైన ఉత్సవమన్నది నిర్వివాదాంశం. జగన్నాథ ఆలయంలో అనేకమందిరాలు ఉన్నాయి. సమీపంలో పంచతీర్ధాలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా గొప్ప పర్యాటక ప్రాంతం. ఆధ్యాత్మిక,ప్రాకృతిక పర్యాటకం ద్వారా ప్రభుత్వాలకు, ప్రైవేటు వ్యాపారులకు, స్థానికులకు బోలెడు ఆదాయం వస్తోంది. సుమారు 20వేలమంది పూరీ జగన్నాథుడి ఆలయం ద్వారా ఉద్యోగ,ఉపాథులు పొందుతున్నారని సమాచారం. వచ్చే రథయాత్ర సమయానికి కరోనా సమసిపోయి అందరికీ మంచిరోజులు వస్తాయని ఆశిద్దాం, రావాలని ఆకాంక్షిద్దాం.