15. తిరుప్పావైకథలు
‘నాయగనాయ్’ పాశురంలో రామాయణ భాగవత భారతాలనుంచి అనేక ఘట్టాలను గోదాదేవి ప్రస్తావించారు.
భావశుధ్ధి: పరమపురుషుని పొందడానికి భావశుధ్ధి కావాలి. ప్రతిసారీ దేహశుధ్ది అవసరం లేదు. శ్రీలంకపై దాడిచేసి సముద్రానికి ఆవలి తీరంలో ఉన్న శ్రీరాముని శరణువేడిన సందర్భంలో ప్రత్యేకంగా విభీషణుడు సముద్రంలో మునక వేయాల్సిన పని లేదు.
Also read: భాగవత సహవాసం వల్లనే గురుకృప
కురుక్షేత్రం సమరాంగణంలో అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు ప్రబోధించిన చరమశ్లోకాన్ని రణార్థులైన ధూర్తుల మధ్య విన్నాడు. అక్కడ స్నానాలు అవీ చేయడానికి వీలులేదు. అంతకు ముందు ద్రౌపది శ్రీకృష్ణుని శరణువేడినప్పుడు రజస్వల. అది కూడా శరణువేడడానికి అడ్డుకాదు. ముఖ్యమైంది భావశుద్ధి, దేహశుధ్ది ఒక్కోప్పుడు సాధ్యం కాదు. సాధారణ సందర్భాలలోదేహశుద్ధీ ఉండాలి భావశుధ్ది కూడా అవసరం. అదే చిత్తశుద్ధి కూడా.
రాజ్యాలెందుకు?తమ కుమారుడిని రాజుగా చూసుకునే భాగ్యం దశరథుడికీ, వసుదేవుడికీ కలగలేదు. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన ముహూర్తానికి కైక తనకు వాగ్దానం చేసిన వరాలు ఇప్పుడు ఇవ్వాలని, భరతుడికి రాజ్యం ఇవ్వడంకోసం రాముడిని వనాలకు పంపాలని కోరడం వల్ల పట్టాభిషేకం జరగదు. పద్నాలుగేళ్లతరువాత పట్టాభిషేకాన్ని చూడడానికి దశరథుడు లేనే లేడు.
తన కుమారుడు శ్రీకృష్ణుడు పట్టాభిషేకానికి సిద్ధంగా లేడుకనుక వసుదేవుడు ఆయనను రాజు గా చూడలేకపోతాడు. కంసుడి తండ్రి ఉగ్రసేనుడి రాజ్యాన్ని కంసుడు లాక్కుంటాడు. తండ్రినే జైలు పాలు చేసి తానే రాజై పాలిస్తూ ఉంటాడు. కంసుని చంపిన తరువాత ఆయన తండ్రి ఉగ్రసేనుడిని రాజు చేస్తాడే గాని తాను స్వీకరించడు. అంతకుముందు వ్రేపల్లె లె ఉన్నపుడు నందుడిని ఆ ప్రాంతానికి రాజుగా శ్రీకృష్ణుడు సంభావిస్తాడు. నందుడిని సర్వలోకాలకు తండ్రి అయిన శ్రీకృష్ణుడు తనకు తండ్రి నందగోపుడని సంభావించి, తండ్రిపేరనే భవనాన్ని పిలుచుకుంటున్నాడు. శ్రీకృష్ణుడికి కూడా తండ్రి చాలా ప్రేమ. శ్రీరాముడికి ఉన్నట్టే. శ్రీరాముడు వనవాసానంతరం తిరిగివస్తూ విమానం ద్వారా సీతకు అయోధ్యను ‘రాజధానీ పితుర్మమ’ = ఇది నాతండ్రి రాజధాని అని గర్వంగాతండ్రిపట్ల ఎంతో ప్రేమతో చెబుతూ చూపుతాడు.
Also read: మన మనసును నిర్మించేది మనం తినే ఆహారమే
ధ్వజతోరణాలు
గోకులంలో అన్ని ఇళ్లూ సుసంపన్నంగా నందగోపుని భవనాలవలెనే ఉంటాయట. గోపికలు గుర్తు బట్టడానికి శ్రీకృష్ణుడే ధ్వజాన్ని, తోరణాలను కట్టి ఉంచినాడట. రాముని వెదుక్కుంటూ వెళ్లిన భరతుడు, నారవస్త్రాలతో అలరుతున్న రామాశ్రమాన్ని గుర్తించి తరించినట్టు, గోపికలు ఈ ధ్వజతోరణాలను చూసిధన్యులైనారట. ‘అచేతనములైన ధ్వజాలు తోరణాలు ద్వారాలు మమ్ము స్వాగతించలేవు. నీవు సచేతనుడివి కనుక మా ఆర్తి నీకు అర్థమవుతుంది. లోపలికి అనుమతించు అని గోపికలు అంటున్నారు. ‘సర్వాదేవాన్ నమస్యంతి రామస్యార్థే’ రాముని కాపాడాలని సకలదేవతలనూ అయోధ్య ప్రజలు కోరుకునే వారట. అదే విధంగా వ్రేపల్లెలో గోపికలు, శ్రీ విల్లి పుత్తూరు లో గోదాదేవి చెలికత్తెలు కూడా శ్రీకృష్ణుడికి దేవతలందరూ రక్షకలిగించాలని కోరుతూ ఉంటారు.
ఆ భవన మణినిర్మిత ద్వారం అసమానంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. నాయగనాయ్ పాశురంలో ద్వారానికి సంబంధించిన వివరణ ఉంటుంది. ద్వార సౌందర్యం చూసి అక్కడే ఆగకండి. లోనికి వెళ్లండి అనేది సందేశం. ఆత్మస్వరూపం మణికవాటం వంటిదట. ఆ ఆత్మసౌందర్యానికి అబ్బురపడి దాన్నే అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారట. కాని పరమాత్మస్వరూపాన్ని చేరాలంటే ఆత్మసౌందర్యానుభవాన్ని దాటి వెళ్లాలి. ద్వారపాలకుడై నిలబడ్డ ఆచార్యుడే ఆతలపులు తెరుస్తాడు. తలుపులూ తెరుస్తాడు.
Also read: శంఖు చక్రాలతో పుట్టిన చిన్ని శ్రీకృష్ణుడుశంఖు చక్రాలతో పుట్టిన చిన్ని శ్రీకృష్ణుడు
రాముడిని ఆహ్వానించడానికి సుమంతుడు వెళ్లినప్పుడు ఆయన భవన మణిద్వారాన్ని చూసి మైమరిచాడట. ఆ ద్వార సౌందర్యాన్ని చూసి మా కళ్లు చెదిరిపోకముందే మమ్మల్ని లోనికి అనుమతించండి అని కోరుకుంటున్నారు గోపికలు.
ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణిచూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అది నిజమైన భక్తుడికి పరీక్ష.
శ్రీకృష్ణుడు మాకు మాట ఇచ్చాడు. కనుక అనుమతిస్తాడు. ఆయన తన మాటను పాటిస్తాడు శ్రీరాముడివలెనే అని గోపికలు ద్వారపాలకుడితో వాదిస్తున్నారు. ‘రామోద్విర్నాభిభాషతే..’ రాముడు రెండు విధాలుగా మాట్లాడడు. వాగ్మీశ్రీమాన్ అందంగా మాట్లాడే వాడు, మాట్లాడేటప్పుడు అందంగా ఉండే వాడు. అతని వచో రామణీయకతను వాల్మీకి ఆళ్వారులూ వర్ణించారు కదా.
Also read: నీ తామర రేకు కన్ను తెరవవా?
మాడభూషి శ్రీధర్