- కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం
దిల్లీ: కేంద్ర మంత్రులతో మంగళవారం జరిగిన చర్చలు విఫలమైనకారణంగా ఆందోళన కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తిరిగి గురువారంనాడు చర్చలు జరపాలనీ, ఈ లోగా బుధవారంనాడు రైతు సంఘాలు తమ డిమాండ్లను పేర్కొంటూ ఒక పత్రాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలనీ నిర్ణయించారు.
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలనూ సస్పెండ్ చేసి తమను చర్చలకు పిలవాలని రైతు సంఘాలు పెట్టిన షరతుకు కేంద్ర మంత్రులు అంగీకరించలేదు. ఆందోళన విరమించాలనీ, కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రవీణుల సంఘంతో చర్చలు జరపాలన్న కేంద్ర మంత్రుల ప్రతిపాదనకు రైతు సంఘాలు సమ్మతించలేదు. రైతు వ్యతిరేకమైన మూడు తాజా చట్టాలనూ రద్దు చేయాలన్న డిమాండ్ తో రైతులు ఉద్యమం ఆరంభించారు. కొన్నినెలలకు సరిపోను రేషన్ ను ట్రాక్టర్లలో వేసుకొని పంజాబ్, హరియాణా రైతులు దిల్లీ సరిహద్దు చేరుకొని అక్కడే మకాం పెట్టారు. చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదంటూ వారు నినాదాలు చేశారు. రైతు ఉద్యమంలో చీలిక తేవడానికి ప్రభుత్వం శాయశక్తులలా ప్రయత్నిస్తున్నదని రైతు నాయకులు ఆరోపించారు.
Also Read: అన్నదాత అస్త్ర సన్యాసం చేస్తే?
రైతాంగ ఉద్యమ కార్యాచరణ కమిటీలో గత నెల 27, 28 తెదీలో వ్యక్తమైన అభిప్రాయభేదాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. బుహారీ గ్రైండ్ ని కేటాయిస్తే కొందరు రైతు నేతలు మెత్తబడేట్టు ఉన్నారని గ్రహించింది. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. కానీ అధికసంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది రైతులు దిల్లీకి తరలి వచ్చే అవకాశం ఉంది.