నేను తిరిగి వచ్చానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో అక్కడి రాజకీయ వాతావరణం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి నా పర్యటన ప్రారంభిస్తున్నానని లోగడ మీకు మనవి చేశాను. నా జాబితాలో మొదట ఉన్న పంజాబ్ లో పర్యటన పూర్తి చేశాను. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు వేచి ఉన్నాను. నా పర్యటన కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు. ఒమిక్రాన్ వేరియంట్ దాపురించిన కారణంగా పరిస్థితులు అనిశ్చితంగా మారాయి. ఆ రాష్ట్రాలకు ప్రయాణం చేయడం క్షేమదాయకమనే సమాచారం త్వరలో తెలుస్తుందని ఆశిస్తున్నాను. పంజాబ్ ప్రయాణంలో నేను కనుగొన్న అంశాల గురించి ఈ రోజు మీకు తెలియజేస్తాను.
Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు
10 రోజుల విస్తృత పర్యటన
పంజాబ్ లో పదిరోజుల పాటు విస్తృతంగా పర్యటించాను. పంజాబ్ లోని ముఖ్యమైన మూడు ప్రాంతాలైనా మాల్వా, దోఆబా, మాఝాలలో సుమారు రెండు వేల కిలోమీటర్లు తిరిగాను. పట్టణాలలో, గ్రామాలలో పురుషులూ, మహిళలూ, సంపన్నులూ, పేదవారూ, యువత, వయోధికులూ, కర్షకులూ, కూలివారూ, నిరుద్యోగులూ, విద్యార్థులూ, ఉద్యోగులూ – ఒకరని ఏమిటి సమాజంలో ఉన్న సకల వర్గాల ప్రతినిధులనూ మొత్తం 500 మందిని కలుసుకొని వారితో మాట్లాడాను. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలుసుకున్నాను. మరి కొందరిని చిన్న చిన్న బృందాలలో కలుసుకున్నాను. వారంతా ఉదారంగా సమయాన్ని కేటాయించి తమ అభిప్రాయాలు నిస్సంకోచంగా వెల్లడించడం ఆశ్చర్యం కలిగించింది. ఎవ్వరు కూడా తమతో కలిసి టిఫిన్ చేయకుండా, భోజన సమయం అయితే భోజనం చేయకుండా, కనీసం ఒక కప్పు టీ అయినా తాగకుండా నన్ను వదల లేదనే సంగతి మీకు తప్పకుండా చెప్పాలి. పూర్తిగా కొత్తవాడినైన నా పట్ల వారు ప్రదర్శించిన సుహృద్భావం, ఆతిధి మర్యాదా నన్నుఆశ్చర్యచకితుడిని చేశాయి. విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులతోనూ, పరిశోధనా సంస్థలలోని అధ్యయనశీలురతోనూ సుదీర్ఘమైన సంభాషణలు జరిపాను. ఆ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ పరిణామాలపైన దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నవారి అభిప్రాయాలు నాకు బాగా ఉపయోగపడినాయి. రాజకీయ పార్టీల నాయకులను నేను ఉద్దేశపూర్వకంగానే కలుసుకోలేదు.
Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం
ఇవీ నా అభిప్రాయాలు…
ఆ రాష్ట్రాన్ని వీడి వచ్చే ముందు నాకు కలిగిన అభిప్రాయాలు సమగ్రంగా ఇవి: పంజాబ్ అశాంతితో తల్లడిల్లుతోంది. బాధపడుతోంది. రాష్ట్ర రాజకీయాలూ, రాజకీయ నేతలూ, రాజకీయ పార్టీల వల్ల తాము దగా పడ్డామని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. దిల్లీ నుంచి రాజకీయంగా దూరమైనామనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరినో ఒకరిని నమ్మాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నమ్మదగినవారికోసం ఎదురు చూస్తున్నారు. తాము నమ్మదగిన యోగ్యులు ఎవ్వరూ లేరని బహుశా ప్రజల మదిలో ఒక అభిప్రాయం ఉంది. ఆఖరి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తక్కువ అపనమ్మకమైన రాజకీయ వేదికను ఎంచుకొని వచ్చే అయదేళ్ళూ ఎలాగో అలా కాలక్షేపం చేయవలసిన పరిస్థితి. ధరల పెరుగుదల, మాదకద్రవ్యాల ముమ్మరం, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు, పడిపోతున్న ఆదాయాలు, పెరుగుతున్న దొంగతనాలు, భద్రతారాహిత్యం, పవిత్ర గ్రంథానికి జరిగిన అవమానం ప్రజలను కలచివేస్తున్నాయి. ఈ అంశాలను రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదనే ఎరుక వారిని బాధిస్తున్నది. రాష్ట్ర యువతలో నైరాశ్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. మెరుగైన జీవితంకోసం వారు రాష్ట్రాన్ని మాత్రమే కాదు దేశాన్ని వీడిపోవాలని కోరుకుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళేందుకు వీసాలు ఇప్పిస్తామనీ, ఇమ్మిగ్రేషన్ లో సహాయం చేస్తామని హామీ ఇస్తూ చిన్న గ్రామలలో సైతం గోడలకు పెద్దపెద్ద ప్రకటనలు అంటించి ఉన్నాయి. ఐఈఎల్ టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వెజ్ టెస్టింగ్ సిస్టమ్) టెస్టులకు శిక్షణ ఇచ్చే సంస్థల ప్రచార ప్రకటనలు కూడా అంతే బాగా దర్శనమిచ్చాయి.
Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది
మోదీ అనూహ్య ప్రకటన
నేను పర్యటన ముగించిన రోజున వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయాలనే సంకల్పాన్ని ప్రధాని అనూహ్యంగా ప్రకటించారు. దానికి తక్షణ స్పందనగా వీధుల్లోని సగటు మనిషి సంతోషంతో పొంగిపోయాడు. కానీ ప్రధాని పట్ల, ఆయన పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజలలో ఆగ్రహం చల్లారినట్టు నాకు కనిపించలేదు. చట్టాల రద్దు నిర్ణయం వల్ల పంజాబ్ లో బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. ఆగ్రహం తీవ్రంగా ఉన్నది. గాయం పచ్చిగా ఉన్నది. చాలా సంభాషణల్లో ప్రధానిని సామాన్యులు అగౌరవంగా సంబోధించారు. వారి వ్యాఖ్యలను నమ్మాలంటే విని తీరాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని అత్యధిక గ్రామాలలో బీజేపీ నాయకులకు ప్రవేశం లేదు. బీజేపీ/ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ అనే నినాదాలు రాసి ఉన్న బ్యానర్లూ, పోస్టర్లూ చాలా ప్రాంతాలలో కనిపించాయి. ఇటీవల కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను ప్రధాని ప్రారంభించినప్పుడు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఊహించిన సుహృద్భావం ప్రజలలో ఉత్పన్నం కాలేదు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికలలో బీజేపీ పోటీలో ఉండే అవకాశాలు బహుస్వల్పం లేదా మృగ్యం.
అమరీందర్ సింగ్ పట్ల తీవ్రప్రతికూలత
కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రెండు విషయాలు ప్రముఖంగా చెబుతున్నారు. ఒకటి, మాదకద్రవ్యాల ముప్పు విషయంలో ఆయన చేసిన హామీని నిలబెట్టుకోలేదు. ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నితనేమ్ గుటకాపైన (సిక్కుల మతగ్రంథం) ప్రమాణం చేసి మాదకద్రవ్యాల మాఫియా ప్రమాదాన్ని రూపుమాపుతానని ప్రకటించారు. కానీ ఆ విషయంలో గట్టి చర్యలు తలపెట్టలేదనే ఆగ్రహం ప్రజలలో బాగా ఉంది. రెండు, ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరనే పేరు తెచ్చుకున్నారు. మహారాజాను ఆదరించే వాతావరణం పంజాబ్ లో ఇప్పుడు ఏమాత్రం లేదు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్ తో భుజం కలపడం వల్ల బీజేపీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. వ్యవసాయచట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరావడాన్ని పంజాబీలు రైతుల ఉద్యమం సాధించిన విజయంగానే పరిగణిస్తున్నారు. ప్రధాని ఔదార్యమని కానీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వం పైన పెట్టిన ఒత్తిడి ఫలితం అని కానీ అనుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ఇంకా రిజిస్టర్ చేసుకోవలసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తపార్టీని మృతశిశువుగానే పరిగణించవచ్చు.
Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్
చరంజిత్ సింగ్ చన్నీ నియామకం
పంజాబ్ లో ఇటీవల సంభవించిన గమనించదగిన పరిణామం ఏమంటే ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చరంజిత్ సింగ్ చన్నీని నియమించడం. కాంగ్రెస్ ఎన్నికల భవితవ్యంపైన ఈ చర్య ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి కొనసాగింపుగా దీని ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పైన కూడా ఉండవచ్చు. రాష్ట్ర నాయకత్వం మారే వరకూ ఆప్ ప్రాబల్యం పెరుగుతున్నట్టు కనిపించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు నిరాశానిస్పృహలకు లోనైనారు. నిజానికి, కెప్టెన్, అకాలీదళ్ అగ్రనాయకులూ, బీజేపీ కేంద్ర నాయకులూ కూడబలుక్కొని కలిసికట్టుగా పని చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడింది. కనుక బీజేపీ, అకాలీదళ్ లాగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ను కూడా ఎన్నుకోజాలమని పంజాబ్ ప్రజలు భావించారు. పోయిన ఎన్నికలలో అకాలీదళ్-బీజేపీ కూటమిని కాదని కాంగ్రెస్ ను సమర్థించినవారు మెల్లగా ఆప్ వైపు మొగ్గు చూపించడం ప్రారంభించారు. కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు చేతుల్లోకి తీసుకోవడానికి ముందు ఆప్ ప్రాబల్యంలో విశేషమైన పెరుగుదలకు అదే కారణం. నాయకత్వం మార్పుతో ఈ వర్గాలు పునరాలోచనలో పడ్డాయి. వాటిలో కొన్ని వర్గాలు కాంగ్రెస్ కి వెనక్కి వస్తున్నాయనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం. నాయకత్వం మార్పు వల్ల అంతవరకూ ఉండిన ప్రభుత్వం వ్యతిరేకత గణనీయంగా తగ్గిపోయింది. పంజాబ్ లో ఇప్పుడు రాజకీయ సంభాషణలో ఒక అంశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కొత్త ముఖ్యమంత్రి అనతికాలంలోనే ప్రతి ఇంటికీ పరిచయమైన వ్యక్తిగా ఎదిగారు. ఆయన పంజాబ్ లో తొలి దళిత ముఖ్యమంత్రి కావడం కూడా ప్రధాన చర్చనీయాంశం అవుతోంది. ఆయనను గమనించడానికే ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఆయన పైనా, కాంగ్రెస్ పైనా తమ తీర్పును ప్రజలు వాయిదా (రిజర్వ్ చేసినట్టు) వేసినట్టు కనిపిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రికీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికీ మధ్య నిరంతరం కొనసాగుతున్న జగడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో అంచనా వేయవలసి ఉంది.
కాంగ్రెస్ దిద్దుబాటు ఆప్ కు నష్టం
కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్య వల్ల బాగా నష్టపోయిన పార్టీ ఆప్. పంజాబ్ సమాజంలోని అన్ని వర్గాలలోనూ ఆ పార్టీకి ప్రస్తుతం బ్రహ్మండమైన సుహృద్భావం ఉంది. ప్రధానంగా మొదటిసారి ఓటు వేయబోయేవారిలోనూ, యువతలోనూ ఈ ఆదరణ భావన అధికంగా ఉంది. లోగడ అకాలీదల్, కాంగ్రెస్ పార్టీలకు ఓటువేసినవారిని కూడా ఆ పార్టీ ఆకర్షిస్తున్నది. కొత్తపార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మారుమూల గ్రామాలలో మహిళలు సైతం అన్నారు. అయితే, ఆప్ కి సంస్థాబలం లేదు. కార్యకర్తలు లేరు. చాలా నియోజకవర్గాలలో ప్రజలకు పరిచయస్థులైన నాయకులు లేరు. ఆప్ ను రాష్ట్రం వెలుపల వేర్లు ఉన్న పార్టీగా కొందరు పరిగణిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా వాయిదా వేయడం ఆ పార్టీ పెద్ద బలహీనత.
కాంగ్రెస్ పొరపాట్లు చేస్తే అపారనష్టం
ఎన్నికల విషయానికి వస్తే, కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. అధికార కాంగ్రెస్ కే స్వల్పమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఏ పార్టీ తక్కువ పొరపాట్లు చేస్తే ఆ పార్టీని విజయం వరిస్తుంది. అయితే, కాంగ్రెస్, ఆప్ చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టం సమానంగా ఉండదు. ఆప్ పొరపాట్లు ఆ పార్టీకి తక్కువ నష్టం కలగజేస్తాయి. అదే కాంగ్రెస్ కనుక చిన్న పొరపాటు చేసినా రాష్ట్రంలో ప్రజాభిప్రాయం అమాంతంగా ఆమ్ వైపు మరలిపోతుంది. ఎందుకంటే ఆప్ ని అవకాశం ఇవ్వదగిన ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిగణిస్తున్నారు. రైతులు ఉద్యమం విరమించి ఇళ్ళకు చేరుకున్న తర్వాత వారికున్న సుశిక్షితమైన యంత్రాంగం, రాజకీయ పరిజ్ఞానం, వారి దగ్గరున్న సమాచారంతో వారు ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారనేది నిర్ణాయకమైన అంశం అవుతుంది.
Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…