- శుక్రవారం సోనియాతో సిద్ధూ సమావేశం
- గురువారంనాడు వేడెక్కిన రాజకీయం, రెండు శిబిరాలలో సుదీర్ఘ మంతనాలు
- అమరేంద్ర, సిద్ధూ మధ్య సయోధ్య అసాధ్యం
- పీసీసీ అధ్యక్షుడుగా సిద్ధూ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్రసింగ్, అసమ్మతి నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య రగులుతున్న వివాదం సమసిపోయేటట్టు లేదు. గురువారం రాత్రి మొహాలీలోని తన వ్యవసాయక్షేత్రంలో కెప్టెన్ అమరేంద్రసింగ్ తన అనుయాయులైన మంత్రులతో, ఎంఎల్ఏలతో సమావేశం జరుపుకున్నారు. సిద్ధూ సైతం ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్న ముగ్గురు మంత్రులతో (సుఖీందర్ సింగ్ రంధవా, చరంజిత్ సింగ్ చన్ని, తృప్త్ రాజీందర్ బజ్వా) సహా ఆరుగురు ఎంఎల్ఏలతో సమాలోచనలు జరిపారు. సిద్ధూతో, అమరేంద్రసింగ్ తో పలుమార్లు చర్చలు జరిపిన అధిష్ఠానం ఒక రాజీ సూత్రాన్ని ప్రతిపాదించింది. సిద్ధూని పీసీసీ అధ్యక్షుడుగా నియమిచాలనీ, వర్కింగ్ ప్రెసెడెంట్లుగా ఒక దళితుడినీ, ఒక హిందువునీ నియమించాలన్నది ఆ సూత్రం సారాంశం. దీనికి ముఖ్యమంత్రి సుముఖంగా లేరు. తాను జాట్ నేననీ, మరో జాట్ అయిన సిద్ధూకి పీసీసీ పదవి కట్టబెట్టడంతో జాట్ ల ఆధిక్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనీ పైకి వాదిస్తున్నప్పటికీ అసలు విషయం ఏమంటే సిద్ధూతో రాజీ ముఖ్యమంత్రికి బొత్తిగా ఇష్టం లేదు. ఈ రోజు (శుక్రవారం) సిద్ధూని చర్చలకు సోనియాగాంధీ పిలిచారు.
Also read: కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?
వారం రోజుల కిందట అమరేంద్రసింగ్ కాంగ్రెస్ అధిష్ఠానదేవత సోనియాగాంధీని కలుసుకున్నారు. వారు ఏమి మాట్లాడుకునారో తెలియదు కానీ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చి విలేఖరులతో మాట్లాడుతూ, ‘‘సోనియాగాంధీ ఏమి నిర్ణయిస్తే దాన్ని అమలు చేస్తాం. సిద్ధూ సాబ్ గురించి ప్రత్యేకంగా చర్చించలేదు,’’ అని పొడిపొడిగా చెప్పారు. సమావేశం జరిగిన తీరు కెప్టెన్ కు నచ్చలేదని అప్పుడే సంకేతాలు వెలువడినాయి.
Also read: రోదసిలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చిన శిరీష, బ్రాన్సన్
ప్రశాంత్ కిషోర్ తో సుదీర్ఘ సమాలోచన
మొన్న ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్ గాంధీలతో సమావేశమైనప్పుడు పంజాబ్ ప్రస్తావన కూడా వచ్చి ఉంటుందని పరిశీలకుల భోగట్టా. అమరేంద్రసింగ్ కు ప్రశాంత్ కిశోర్ సన్నిహితుడు. 2017 ఎన్నికలలో పంజాబ్ లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ అమరేంద్రసింగ్ తో కలసి పని చేశారు. అప్పటి నుంచి అమరేంద్రసింగ్ తోనే ప్రశాంత్ కిషోర్ ప్రయాణం సాగుతోంది. గురువారం ఉదయం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా సోనియాగాంధీని కలుసుకున్నారు. తొమ్మది విడతల లోక్ సభకు ఎన్నికైన 74 ఏళ్ళ కమల్ నాథ్ గాంధీ కుటుంబానికి దగ్గర. గ్రూప్-23గా పిలుస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడా చనువుగా ఉంటారు. గ్రూప్-23 నేతలు నిరుడు సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి విదితమే. పార్టీ పని చేస్తున్న తీరు పట్ల ఆవేదన వెలిబుచ్చుతూ, నాయకత్వం పార్టీని ముందుండి నడిపించాలనీ, ఆ విధంగా నడిపిస్తున్న దేశ ప్రజలకు తెలియాలనీ కోరారు. ఆ లేఖ పైన సోనియాగాంధీ ఇంతవరకూ స్పందించలేదు. సీనియర్ నాయకులతో ఎట్లా వ్యవహరించాలన్న విషయం కూడా కమల్ నాథ్ తో సోనియా చర్చించి ఉండవచ్చు. అదేసమయంలో కెప్టెన్ అమరేంద్రసింగ్, సిద్ధూల మధ్య సంఘర్షణ వాతావరణం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు. అమరేంద్ర సింగ్ తో కమల్ నాథ్ కు ఆత్మీయమైన అనుబంధం ఉంది.
Also read: ఆఫ్ఘానిస్థాన్ లో మళ్ళీ తాలిబాన్ పాలనకు రంగం సిద్ధం!
కమల్ నాథ్ కు కరతలామలకం
అమరేంద్రసింగ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నే కమల్ నాథ్ సంవత్సరం కిందట ఎదుర్కొన్నారు. ఇప్పుడు అమరేంద్రసింగ్ ను సిద్ధూ ధిక్కరిస్తున్నట్టే నిరుడు కమల్ నాథ్ ని జ్యోతిరాదిత్య సింధియా ధిక్కరించారు. అధిష్ఠానవర్గం అప్పుడు కూడా గట్టి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కమల్ నాథ్ కావాలో జ్యోతిరాదిత్య కావాలో తేల్చుకోవలసిన పరిస్థితి. కమల్ నాథ్, జ్యోతిరాదిత్య కలసిమెలసి ఉంటే అధిష్ఠానవర్గానికి కావలసింది ఏముంటుంది? జ్యోతిరాదిత్యను సంతోషపెట్టి, ఆ యువనేతను తనతో కలుపుకొని వెళ్ళి ఉంటే కమల్ నాథ్ పట్ల అధిష్ఠానవర్గం సద్భావంతో ఉండేది. కానీ వారిద్దరూ కలసి పని చేసే వాతావరణం లేదు. ఎవరో ఒకరు ఉండాలనే స్థాయికి విభేదాలు చేరాయి. అప్పుడు అధిష్ఠానం కమల్ నాథ్ వైపు మొగ్గు చూపింది. జ్యోతిరాదిత్య ఇరవై మంది ఎంఎల్ఏలతో కలసి బీజేపీలో చేరి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ తర్వాత బీజేపీ జ్యోతిరాదిత్యకు రాజ్యసభ స్థానం ఇచ్చింది. ఇటీవల మంత్రిమండలి విస్తరణ సందర్భంగా కేబినెట్ పదవి కూడా ఇచ్చి పౌరవిమానయానం శాఖను అప్పగించింది. ఒకరకంగా చెప్పాలంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బీజేపీకి అప్పగించినందుకు సింధియాకు ప్రతిఫలం చెల్లించింది.
Also read: దిలీప్ కుమార్ శకం ముగిసింది
సిద్ధూ జ్యోతిరాదిత్య కాజాలడు
సిద్ధూకు అంత బలం లేకపోవచ్చు. అమరేంద్రసింగ్ ను గద్దె దింపే శక్తి లేదు. పంజాబ్ లో రాజకీయ వాతావరణం కూడా మధ్య ప్రదేశ్ లో ఉన్నట్టు లేదు. మధ్యప్రదేశ్ లో గట్టి ప్రతిపక్షంగా బీజేపీ ఉంది. పంజాబ్ లో బీజేపీ లేదు. అకాలీదళ్ కూ, బీజేపీకి మధ్య సయోధ్య లేదు. పైగా ఎన్నికలు మరి ఏడు మాసాలలోనే ఉన్నాయి. అందువల్ల మధ్యప్రదేశ్ పరిణామాలు పంజాబ్ లో పునరావృత్తం అయ్యే అవకాశాలు లేవు. రేపు ఎన్నికల బరిలో సిద్ధూ సహకారం లేకుండా, సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కెప్టెన్ కాంగ్రెస్ ను గెలిపించగలరా అన్నది అధిష్ఠానం ఎదుట ఉన్న ప్రధానమైన ప్రశ్న. సిద్ధూను పార్టీలో చేర్చుకోవడానికే కాదు పంజాబ్ విభాగం నాయకత్వం అప్పజెప్పడానికి ఆమె ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారు.
Also read: బెయిల్ కోసం నిరీక్షిస్తున్న స్టాన్ స్వామి మృతి
ముఖ్యమంత్రి అమరేంద్రసింగ్ కానీ అసమ్మతి నాయకుడు నవజోత్ సిద్ధూ కానీ కమల్ నాథ్ చెబితే ఆలకించే పరిస్థితి లేదు. సోనియాగాంధీ స్వయంగా పిలిచి చెప్పినా ఇద్దరూ ఆమె మాటను మన్నించి రాజీపడి కలసి పని చేసే పరిస్థితులు కనిపించడం లేదు. 2017 నుంచి మొదలైన సంఘర్షణలో వారిరువురూ చాలా దూరం వెళ్ళారు. ఒకరి పొడ మరొకరు సహించలేని స్థితి చేరుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిలో ఎవరినో ఒకరిని కోరుకోవాలి. ఇద్దరూ కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు. సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే అమరేంద్రసింగ్ ఎదురు తిరుగుతారు. కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త కుంపటి పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. సిద్ధూకి గ్లామర్ ఉంటే అమరేంద్రకు స్థానికంగా పార్టీ కార్యకర్తలపైన పట్టు ఉంది. సమర్థుడైన నాయకుడుగా ప్రజలలో ప్రాబల్యం ఉంది. ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.
Also read: మాయావతి రాజకీయం: యూపీ మాయాబజార్
అధిష్ఠానం అవస్థ
మామూలుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సోనియా నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంటూ దేశంలోని పది, పదిహేను రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉంటే పార్టీ అధిష్ఠానం అంటే ఇతర నేతలకు ఖదరు ఉండేది. ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయం నిర్వహణకు అవసరమైన ఖర్చులు కూడా భరించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో పంజాబ్ ప్రధానమైనది. వనరుల పరంగా కెప్టెన్ అమరేంద్రసింగ్ పైనే అధిష్ఠానం ఆధారపడవలసిన పరిస్థితి కారణంగా ఆయనకు గట్టిగా చెప్పే అవకాశం లేదు.అమరేంద్ర సింగ్ నాయకత్వంలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పార్టీ అధిష్ఠానం ప్రకటించినప్పటికీ ఆయనకు ఇష్టం లేని వ్యక్తి సిద్ధూని పీసీసీ అధ్యక్షుడుగా నియమిస్తే అమరేంద్రసింగ్ పెత్తనం ఏముంటుంది? ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడికే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎక్కువ అధికారం ఉంటుంది. అందుకే సిద్దూని ఆ పదవిలో నియమించడం అమరేంద్రసింగ్ కు ఇష్టం లేదు.
Also read: చైనా బెదరదు, బెదిరించదు: సీ జిన్ పింగ్
సిద్ధూతోనే భవిష్యత్తు ఉంటుందనుకొని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తే, అమరేంద్రసింగ్ ఎదురు తిరిగినా ఫర్వాలేదనే భరోసా అధిష్ఠానవర్గానికి ఉంటే అది సంకల్పించినట్టు పీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధూకి అప్పగించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి నుంచి తాకిడి ఎదుర్కోవలసి వస్తుంది. తిరుగుబాటు చేసిన అమరేంద్రసింగ్ బీజేపీలో చేరితే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. సొంతగా ప్రాంతీయపార్టీ పెడితే పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. పంజాబ్ చిన్న రాష్ట్రమే కావచ్చు. కానీ ఎన్నికలు మరి కొద్ది మాసాలలో జరగవలసి ఉన్న కారణంగా కీలకమైన రాష్ట్రమైంది. కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
Also read: ఉపా చట్టం రాజ్యాంగవిరుద్ధం