అశ్వినీకుమార్ ఈటూరు
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు బెంగళూరులో ఆదివారంనాడు జరగనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. పునీత్ పెద్దకుమార్తె వందిత అమెరికాలో చదువుకుంటోంది. ఆమె శనివారం సాయంకాలానికి బెంగళూరు చేరుకున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం అభిమానులతో క్రిక్కిరిసి పోయింది. ‘అప్పూ అమర్ రహే,’ ‘అప్పూ అప్పుడే పోయావా?’ అంటూ పునీత్ ఉరఫ్ అప్పూ అభిమానులు కన్నీరుమున్నీరైనారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రాణా, శ్రీకాంత్, తదితరులు బెంగుళూరు వెళ్ళి కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించారు. చిరంజీవితో కలిసి కనీసం ఒక్క నిమిషమైనా స్టెప్ప్ వేసి డాన్స్ చేయాలన్న పునీత్ అభిలాష తీరకుండానే ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారని కొందరు అభిమానులు అన్నారు.
మిగతా నటీనటుల మాదిరి కాకుండా పునీత్ కు అభిమానులతో పాటు అనుచరవర్గం కూడా ఉంది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా వదాన్యుడుగా, దాతగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. లక్షల సంఖ్యలో పునీత్ అభిమానులు ఉండటానికి అదే కారణం. కన్నడ మీడియం పాఠశాలలకూ, కళాశాలలకూ ఉదారంగా విరాళాలు ఇచ్చేవారు. సుమారు 1800 మంది విద్యార్థుల ట్యూషన్ ఫీజు ఆయన చెల్లించేవారు.16 వృద్ధాశ్రమాల్ని, 19 గోశాలల్నీ, 26 అనాథ వసతి గృహాలనీ, 45 ఉచితంగా విద్యనేర్పే పాఠశాలలనూ పునీత్ నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా తన తండ్రిలాగే అతని కళ్ళు రెండిటినీ దానం చేశారు.
పునీత్ కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివకుమార్ బాహాటంగానే పునీత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. పవర్ స్టార్ సున్నితంగా తిరస్కరించారు. ఇండిపెండెంట్ గా నిలబడిన తనకోసం ప్రచారం చేయవలసిందిగా నటీమణి సుమలత అడిగారు. అంబరీష్ పోయిన తర్వాత ఎన్నికల బరిలో దిగిన సుమలత అభ్యర్థనను సైతం అంతే సున్నితంగా తోసిపుచ్చారు. మైసూరులోని శక్తిధామ ఆశ్రమం ద్వారా తల్లి పార్వతమ్మతో కలిసి దానధర్మాలు చేస్తూ వచ్చారు. బెంగుళూరు ప్రీమియర్ ఫుట్సల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే మరణించిన ప్రజల హృదయాలలో ఎల్లకాలం ఉంటారు.