‘కన్నడ కంఠీరవ’ రాజ్ కుమార్ నట వారసుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఈ హఠాన్మరణం కన్నడసీమను తీవ్ర విషాదమయం చేసింది. యావత్తు భారత చిత్రజగత్తును దిగ్భ్రమకు గురి చేసింది. ‘అప్పు’ అంటూ అందరూ ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. కన్నడ ‘పవర్ స్టార్’ గానూ ప్రసిద్ధుడు. 46 ఏళ్ళ వయస్సులోనే తనువు చాలించడంతో అందరూ చలించిపోయారు.
రాజ్ కుమార్ కు ఆయన కడగట్టుబిడ్డ. ముగ్గురు కుమారులు చిత్రసీమలోనే కొనసాగుతున్నప్పటికీ, ఎక్కువ స్టార్ డమ్ పునీత్ కే వచ్చింది. నటన, గానం (ప్లేబ్యాక్), నిర్మాణం మూడు రంగాల్లోనూ పేరు తెచ్చుకుంటూ, తండ్రి రాజ్ కుమార్ వారసత్వాన్ని నిలబెట్టడం పునీత్ ప్రత్యేకత. బాలనటుడుగా చిత్రరంగంలో అడుగుపెట్టి, కథానాయకుడుగా స్టార్ డమ్ ను తెచ్చుకోవడంలో అతని కఠోరమైన కృషి దాగివుంది. తండ్రి రాజ్ కుమార్ యశస్సు కలిసి వచ్చింది. అప్పు ఎటువంటి వ్యసనాలను దరిచేరనివ్వకుండా ఎంతో క్రమశిక్షణగా మెలిగారు. అందరితో తలలో నాలుకలా ఉంటూ, సాత్వికుడుగా మంచిపేరు తెచ్చుకున్నారు.
సినిమా ప్రపంచం పూర్తిగా గ్లామర్ రంగం. శరీరాకృతిని కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో, అందంగా కనిపించడం అంతే ముఖ్యం. దీని కోసం ఈ రంగానికి చెందినవారు నిత్యం శారీరక వ్యాయామం చేయడంతో పాటు ఆహారనియమాలను పాటిస్తూ వుంటారు. ఈ క్రమంలో అనేక త్యాగాలు కూడా చేస్తుంటారు. భారతదేశ కథానాయకులలో యోగాసనాలు, సూర్యనమస్కారాలు చేసేవారిలో రాజ్ కుమార్ గురించి ప్రముఖంగా చెప్పాలి. కొన్ని గంటలపాటు ఆయన యోగ సాధన చేసేవారు. ఆయన నటించిన కొన్ని సినిమాల నుంచి ఆ దృశ్యాలను చూడవచ్చు. వ్యాయామాల కంటే యోగసాధన వైపే ఆయన మొగ్గు చూపించారు. బాడీ బిల్డింగ్ పట్ల రాజ్ కుమార్ కు పెద్దగా ఆసక్తి లేదు. ఆ కాలంలో ‘సిక్స్ పాక్స్’ కల్చర్ కూడా లేదు.
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం
ఎన్టీఆర్ యోగాసనాలు, సూర్యనమస్కారాలతో పాటు వ్యాయామం కూడా బాగా చేసేవారు. అంతేమోతాదులో ఆహారాన్ని తీసుకొనేవారు. పౌరాణికచిత్రాల్లో శ్రీరాముడు, కృష్ణుడు వంటి దేవతల పాత్రలు వేసినప్పుడు మాత్రం నేలపైన పడుకోవడం, మాంసాహారాన్ని మానివేయడం మొదలైన నియమాలను పాటించేవారు. శోభన్ బాబు కూడా శరీరాకృతిని కాపాడుకోవడంలో ఎంతో క్రమశిక్షణను అలవాటు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఎన్టీఆర్ మరో 10-15 సంవత్సరాలు జీవించి ఉండేవారని అంటుంటారు. శోభన్ బాబు గుండెపోటుతో 70 ఏళ్లకు వెళ్లిపోయారు. అప్పటి వరకూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించారు.
సుమారు రెండు దశాబ్దాల నుంచి సినిమా కథానాయకుల వరవడి (ట్రెండ్ )మారింది. స్లిమ్ గా కనిపించడంపై కొందరు, సిక్స్ ప్యాక్ పై కొందరు, కాస్మోటిక్ సర్జరీపై కొందరు, బేరియాటిక్, లైప్రోస్కోపిక్ సర్జరీలపై కొందరు, తీవ్రమైన డైటింగ్ పై కొందరు దృష్టి సారిస్తున్నారు. వీరిలో చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. సహజసిద్ధమైన విధానంలో కాకుండా, వింతపోకడలు పోయి అనారోగ్య సమస్యలకు గురికావడం, ప్రాణాలను కోల్పోయేదాకా తెచ్చుకోవడం జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ రోజుకు వెయ్యి నేలదండీలు తీస్తారని చెబుతారు. ‘అతి సర్వత్ర వజ్రయేత్’ అనే సూక్తిని మరచిపోతున్నారు. పునీత్ కూడా తండ్రి నుంచి ప్రేరణ పొందినా, నేటి వరవడికి (ట్రెండ్) తగ్గట్టుగా వ్యాయామ సాధన చేసేవారు. గంటలపాటు ఆ కృషి సాగేది.
Also Read: పెగాసస్ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరిస్తుందా?
పునీత్ వయస్సు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. ఇంకా చాలాకాలం జీవించాల్సిన వ్యక్తి, ఎంతో భవిష్యత్తు ఉంది. అప్పుడే ఇలా.. హటాత్తుగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. ముందు రోజు రాత్రి (గురువారం) తీవ్రమైన గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. మర్నాడు హాస్పిటల్ కు వెళ్లి, వైద్యులను సంప్రదించమని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా జిమ్ కు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. జిమ్ లో ఉండగానే తీవ్రంగా గుండెపోటు రావడం, స్వల్పవ్యవధిలోనే ప్రాణాలను కోల్పోవడం జరిగింది. సరియైన సమయంలో చికిత్స తీసుకొని వుంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా…రిలీజ్ సమయంలో, హీరోలు తమ సినిమా ఫలితాలపట్ల, రాబోయే అవకాశాల పట్ల చిత్రసీమలో తమ స్థానాల పట్ల, తమ ఇమేజ్ ను కాపాడుకోవడం, పెంచుకోవడం పట్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారని సినిమా రంగానికి చెందిన ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. తాము ఎంచుకున్న రంగంలో విజయతీరాలకు చేరడం, పదికాలాల పాటు నిలబడగలగం ముఖ్యమే. అదే సమయంలో, శరీరాన్ని, మనస్సును శృతిమించి కష్టపెట్టడం, ఖర్చుపెట్టడం ఆరోగ్యకరమైన విధానం కాదని మానసిక వైద్యులు, వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: రసకందాయంలో పంజాబ్ ఎన్నికల రంగం
పునీత్ అటు సినిమా రంగంలోనూ – ఇటు టెలివిజన్ రంగంలోనూ. కరోర్ పతి (కోట్యాధిపతి) వంటి కార్యక్రమాల ప్రెజెంటర్ గా, రియాల్టీ షో నిర్వాహకుడుగా, సీరియల్స్ నిర్మాతగానూ రాణించారు. సేవా కార్యక్రమాల ద్వారా తన దేశభక్తిని, ప్రజల పట్ల ప్రేమను చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఇలా వెళ్లిపోవడం కలచివేస్తోంది. ఇటువంటి కథనాలన్నీ కొత్తతరంవారికి పాఠాలు, గుణపాఠాలు కావాలి. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతోనూ పునీత్ కు ఎంతో మంచి స్నేహం ఉంది. అందుకే ఈ శాండిల్ వుడ్ హీరోకు టాలివుడ్ మొత్తం నివాళి ఇచ్చి తన అనుబంధాన్ని చాటుకుంది. జోహార్ పునీత్ రాజ్ కుమార్.