1000 పరుగుల రికార్డుకు 15 పరుగుల దూరంలో పూజారా
ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో అంతంత మాత్రంగానే రాణించిన భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆఖరిటెస్టులో స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే లిటిల్ మాస్టర్లు సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ ల సరసన నిలిచే అవకాశం దక్కుతుంది.
1000కి 15 పరుగుల దూరంలో పూజారా:
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారతగడ్డపై వెయ్యి పరుగులు సాధించిన దిగ్గజాల సరసన నిలిచే రికార్డు పూజారా కోసం వేచి చూస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో పూజారా 73, 15, 21, 7, 0 స్కోర్లకే అవుటయ్యాడు. అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన పూజారా గత ఐదుటెస్టు ఇన్నింగ్స్ లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయితే అహ్మదాబాద్ ఆఖరిటెస్టులో పూజారా మరో 45 పరుగులు సాధించగలిగితే…భారత గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరగలుగుతాడు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ తో ఆడిన స్వదేశీ సిరీస్ ల్లో పూజారా 955 పరుగులు మాత్రమే సాధించాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారతగడ్డపై వెయ్యి పరుగులు సాధించిన దిగ్గజాలలో సునీల్ గవాస్కర్,గుండప్ప విశ్వనాథ్, విరాట్ కొహ్లీ మాత్రమే ఉన్నారు.
సచిన్ కు దక్కని రికార్డు:
క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం స్వదేశీ గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 1000 పరుగులు సాధించడంలో సఫలం కాలేకపోయాడు. సచిన్ 22 సంవత్సరాల తన కెరియర్ లో భారత గడ్డపై ఇంగ్లండ్ తో వివిధ సిరీస్ ల ద్వారా 15 టెస్టుల్లో పాల్గొని 960 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇదీ చదవండి: భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ఆఖరాట
గవాస్కర్ అగ్రస్థానం
ఇంగ్లండ్ పై స్వదేశీ సిరీస్ ల్లో అత్యధికంగా 22 టెస్టుల్లో 1331 పరుగులు సాధించిన రికార్డు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేరుతో ఉంది. మరో లిటిల్ మాస్టర్ గుండప్ప విశ్వనాథ్ 17 టెస్టుల్లో 1022 పరుగులు, 36.50 సగటుతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కొహ్లీ 1015 పరుగులతో మూడోస్థానంలో ఉన్నాడు. విరాట్ కేవలం 12 టెస్టుల్లోనే 59.70 సగటుతో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. గుండప్ప విశ్వనాథ్ కు ఇంగ్లండ్ పై మూడు శతకాలు ఉన్నాయి. సునీల్ గవాస్కర్ 172 పరుగుల అత్యధిక స్కోరుతో మూడు శతకాలు, ఎనిమిది అర్థశతకాలు నమోదు చేశాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా కరుణ్ నాయర్ నిలిచాడు. నాయర్ 303, వినోద్ కాంబ్లీ 224 పరుగులతో మొదటి రెండుస్థానాలలో ఉన్నారు.
పూజారా పేరుతోనే అత్యధిక సెంచరీల రికార్డు:
భారత గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా పూజారా పేరుతోనే రికార్డు నమోదయ్యింది. ఇంగ్లండ్ పై స్వదేశీ సిరీస్ ల్లో భాగంగా 12 మ్యాచ్ లు ఆడిన పూజారా 206 పరుగుల నాటౌట్ స్కోరుతో మొత్తం నాలుగు సెంచరీలు సాధించాడు. 53.05 సగటు సైతం నమోదు చేశాడు. నిన్నటి వరకూ సర్దార్ పటేల్ స్టేడియంగా ఉన్న నేటి నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే పూజారా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో 206 నాటౌట్ స్కోరు సాధించడం విశేషం. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాపై తన ఆఖరి సెంచరీ సాధించిన పూజారా గత 19 టెస్టులుగా మూడంకెల స్కోరు సాధించలేకుండానే తన కెరియర్ ను నెట్టుకొంటూ వస్తున్నాడు.
ఇదీ చదవండి: కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ