ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికాలో ఘర్షణలు ఏర్పడతాయి. హింస జరుగుతుంది. జనవరి 20వ తేదీ నాడు అధికారికంగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొనేంతవరకూ న్యాయపోరాటాలు తప్పవని ప్రపంచమంతా ముందే ఊహించింది. అన్నట్టుగానే అలాగే జరుగుతోంది. ట్రంప్ మద్దతుదారులు తలపెట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. “మిలియన్ మాగా మార్చ్” పేరుతో ట్రంప్ మద్దతుదారులు – వ్యతిరేకులు బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు, కత్తిపోట్లు జరిగాయి. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే వంటి వాటిని కూడా ఉపయోగించాల్సి వచ్చింది. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఘర్షణ
ఈ ఘర్షణ మొత్తం ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా జరిగిందే. వేలాదిమంది చేపట్టిన ఈ నిరసన ర్యాలీ, ఈ హింస రాజధాని వాషింగ్టన్ లో, శ్వేత సౌధానికి కూతవేటు దూరంలో జరగడం విశేషం. ప్రౌడ్ బాయ్స్, యాంటిఫా వంటి కన్జర్వేటివ్ గ్రూప్ – ప్రత్యర్థి వర్గమైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ సభ్యుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ఇందులో ట్రంప్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న మహిళా వర్గాలు కూడా ఉన్నాయి. “ఉమెన్ ఫర్ అమెరికా ఫస్ట్” ట్రంప్ వైపు- “రెఫ్యూజ్ ఫాసిజం” ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగాయి .ఎన్నికల్లో అధ్యక్షస్థానంకు పోటీపడిన డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇద్దరూ శ్వేతజాతీయులే అయినప్పటికీ నల్లజాతీయుల వ్యతిరేకుడుగా ట్రంప్ ముద్ర వేయించుకున్నాడు.ఇప్పుడు జరిగిన ఘర్షణలో వ్యక్తివైరంతో పాటు జాతివైరం కూడా కనిపిస్తోంది. నల్లజాతీయులు పూర్తిగా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నారు. వీరికి తోడు వామపక్షవర్గం, రెవెల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీలు (ఆర్ సి పి) కూడా ఉన్నాయి.
ట్రంప్ గద్దె దిగాలని నినదిస్తున్న పక్షాలు
ట్రంప్ గద్దె దిగాలి, పరిపాలనలో ఉండకూడదని ఈ రెండు వర్గాలు కలిసి 2016లోనే ” రెఫ్యూజ్ ఫాసిజమ్” పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటుచేశాయి. వీరి దృష్టిలో ముసోలిని, హిట్లర్ ఎటువంటివారో డోనాల్డ్ ట్రంప్ కూడా అంతే. ట్రంప్ ను ఫాసిస్ట్ గా వీరు భావిస్తున్నారు. ముస్లింలు, మహిళలు, నల్లజాతీయులు, ల్యాటిన్ జాతీయులు, బాలలు, వృద్దులకు సంబంధించిన సమస్యలు, అంశాలపై “రెఫ్యూజ్ ఫాసిజమ్” గ్రూప్ పనిచేస్తోంది. ట్రంప్ శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడని, కిరాతంగా ప్రవర్తించే విధంగా పోలీసులను ప్రోత్సహిస్తున్నాడని, నల్లజాతీయులను శిక్షించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నాడని, విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చిన ఇతరదేశీయుల పట్ల తీవ్రవాదాన్ని మేలుకొల్పుతున్నాడని.. ఇలా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న ఈ గ్రూప్ శనివారం జరిగిన ఘర్షణలో పాల్గొని, తన వ్యతిరేకతను చాటిచెప్పింది.
ట్రంప్ కు మద్దతుగా ‘ప్రౌడ్ బాయ్స్’
ట్రంప్ కు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టిన “ప్రౌడ్ బాయ్స్ ” గ్రూప్ కూడా 2016లోనే ఏర్పడింది. నీయోఫాసిస్ట్ మొగవాళ్ళు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇది ఒక రాజకీయ సంస్థగా తెలుస్తోంది. ఆమెరికా, కెనడాలో రాజకీయ హింసను ప్రేరేపించే సంస్థగా దీనికి పేరుంది. వీరు పూర్తిగా శ్వేతజాతీయుల పెత్తనాన్నే కోరుకుంటారు. అందుకే, ఎన్నికల్లో జో బైడెన్ ఫలితాల ఆధిక్యాన్ని సహించలేక, ట్రంప్ కు మద్దతుగా బైడెన్ కు వ్యతిరేకంగా పోరాటబాట పట్టారు. మితిమీరిన శ్వేతజాతీయవాదమే వీరిని ఈ దిశగా నడిపిస్తోంది. హింసతో కూడిన ఫాసిజమ్ ను వ్యతిరేకించే సంప్రదాయ “యాంటీఫా” గ్రూప్ కూడా ట్రంప్ కు మద్దతుగా నిలిచింది. దీన్నిబట్టి చూస్తే, అమెరికా రాజకీయాల్లో రిపబ్లిక్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య ఉండే సహజమైన విభేదాలకు, ట్రంప్ రెచ్చగొట్టిన శ్వేతజాతీయవాదం బలంగా వెళ్ళూనుకుంటోంది. ఇటువంటి ఘర్షణలు కొత్తవి కాకపోయినా, ట్రంప్ వ్యూహం కొంత ఫలిస్తోంది.
భవిష్యత్తులో భయానక పరిణామాలు
దీని పరిణామాలు భవిష్యత్తులో మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు అధికార పీఠం దిగిపోయినా, ట్రంప్ తన వాదాలతో, వ్యూహాలతో ముందుకు వెళ్తూనే ఉంటాడు. నేటి ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినా, అధ్యక్షుడుగా పీఠాన్ని అధిరోహించడానికి కావాల్సిన మెజారిటీ కైవసం చేసుకున్నా , తిప్పలు తప్పడం లేదు. జో బైడెన్ సాధించిన అమేయమైన ఆధిక్యతను చూసి, మెల్లగా ట్రంప్ స్వరం తగ్గిస్తున్నాడు. అంతా కాలమే చెబుతుందంటూ వేదాంతం వినిపిస్తున్నాడు. ఇది పైకి మాత్రమే. తెరముందు, తెర వెనుక రాజకీయాలు సాగిస్తూనే ఉన్నాడు. అధికారాన్ని బదిలీ చెయ్యడంలో కీలక పాత్ర పోషించే ” జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్” (జి ఎస్ ఏ ) ఇంకా డోనాల్డ్ ట్రంప్ ఓటమిని, జో బైడెన్ గెలుపును అంగీకరించడం లేదు. ఈ విభాగం బైడెన్ గెలుపును అధికారికంగా గుర్తించకపోతే, అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవ్వదు.
రాజ్యాంగ స్పష్టత లోపించిన సందర్భం
ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవ్వాలన్న విషయంలో అమెరికా రాజ్యంగంలో స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు. నిధులు, ప్రభుత్వ భవనాలు, అధికారులు, పరికరాల వినియోగం, కమ్యూనికేషన్ వాడకం, వేతనాలు చెల్లించడం, ప్రయాణాల ఖర్చు, కీలక సమాచారం తెలుసుకోవడం, ఇతర దేశాధినేతలతో మాట్లాడే అనుమతులు మొదలైనవన్నీ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో, జో బైడెన్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద, అమెరికాలో అల్లర్లు, అలజడులు, ఘర్షణలు, జాతి విభేదాలు, న్యాయపోరాటాలు పెరిగిపోతున్నాయి. అధికార మార్పిడి జరిగేంతవరకూ ఇలాగే ఉండవచ్చు. తర్వాత కూడా, డెమెక్రటిక్ -రిపబ్లికన్ పార్టీల మధ్య గొడవలు గతంలో కంటే ఎక్కువగా జరిగేట్టు కనిపిస్తోంది.
World is observing the ugly face of Amarican democracy and pseudo liberty