ఖైరతాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దానం నాగేందర్, మంత్రి గంగుల కమలాకర్ లకు నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వెళ్లిన గంగుల, దానంను వరద సాయం అందలేదని స్థానికులు నిలదీశారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినకపోవడంతో ప్రచారంలో పాల్గొనకుండానే గంగుల, దానం నాగేందర్ వెనుదిరిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిఫ్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది.
ఆల్వాల్ పరిధి మచ్చ బొల్లారంలో పార్టీ అభ్యర్థి రాజ్ జితేందర్ నాథ్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారని గతంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని పద్మాదేవేందర్ రెడ్డి, కార్పొరేటర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదని పద్మాదేవేందర్ రెడ్డి ముందు ఆందోళన చేపట్టారు.
తమకు వరద బాధితుల ఆర్థిక సాయం కూడా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం యాప్రాల్ లో ప్రచారం నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావుకి కూడా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకు నచ్చచెప్పినా వినకపోవడంతో సొంత డబ్బులతో రోడ్లు బాగుచేయిస్తానని రాసిచ్చి అక్కడ నుండి బయటపడ్డారు మైనంపల్లి.