హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరస సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే ఒవైసీ అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు.