Thursday, November 7, 2024

దేశ ప్రజలకు ఐక్యతే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరమే : రాహుల్ తో మానవ హక్కుల వేదిక

  • రాహుల్ గాంధీకి మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ.
  • ఇందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ ను వేదిక నాయకులు జీవన్ కుమార్ మమీడియాకు ఆదివారంనాడు విడుదల చేశారు.

జాతీయ కాంగ్రెస్ నాయకులు,

వైనాడ్ నియోజకవర్గం (కేరళ)  పార్లమెంటు సభ్యులు

 రాహుల్ గాంధి గారికి,

 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధిగా మీరు భారత్ జోడో (భారత ఐక్యత) పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. యాత్రలో మీరు ఆరెస్సెస్, బీజేపీల విద్వేషపూరిత రాజకీయాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, సంపద కేంద్రీకరణలను మౌలికంగా లేవనెత్తుతున్నారు. ఈ విషయాలను కొంత లోతుగా పరిశీలిస్తూ ఒక హక్కుల సంస్థగా మీరు కీలకంగా ప్రస్తావిస్తున్న విషయాలపై మీ నిర్దిష్టమైన అభిప్రాయాన్నీ, భవిష్యత్తులో వాటి గురించి మీరు తీసుకోబోయే చర్యలనూ తెలపాలని కోరుతున్నాం.

 1. విభజన రాజకీయాలు

అవును.  మత తత్వ, ఫాసిస్టు సంస్థలకు అబద్ధాలు, కల్పిత కథలు, వక్రీకరణలే యుద్ధ సామగ్రి. వివేచన వాళ్ళకు బద్ధ శత్రువు. వారి ఘనకార్యాలతో ఈ రోజు ప్రజల మధ్య విద్వేషం, విభజనలు ఊడలు దిగాయి. మతం మాటున పాలకులు యధేచ్ఛగా ప్రజాస్వామ్యం, సంక్షేమ పాలన, రాజ్యంగ వ్యవస్థలను మచ్చుకు కూడా లేకుండా తుడిచి పెడుతున్నారు. బీజేపీ తప్ప కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా రాజకీయ రంగాన్ని మార్చేస్తున్నారు.

    ఈ పరిస్థితుల్లో ఒక్క మైనారిటీ మతస్థులకే కాదు, అన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ వర్గాలకూ ఊపిరి ఆడే పరిస్థితి లేదు. అయితే మతం మాటున జరుగుతున్న సామాజిక, ఆర్థిక విధ్వంసం మెలమెల్లగా బట్టబయలౌతున్నది. సామాన్య ప్రజలు కూడా మతం పేరుతో తోటి భారతీయులపైకి తమను ఉసిగొల్పటం తప్ప పరిపాలకులుగా వారు తమకు చేసిన మేలు ఏదీ లేదని గ్రహిస్తున్నారు. విద్వేష రాజకీయాలను ఎండగట్టే కార్యక్రమం తీసుకున్నందుకు మీకు మా అభినందనలు. అర్థంలేని మతోన్మాద రాజకీయ, సామాజిక వాతావరణాన్ని ఈ యాత్ర ఏ మేరకు మార్చగలిగితే ఆ మేరకు సమాజానికి ప్రయోజనకరం కాబట్టి, ఈ విషయంలో మేము మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.

 2. నిరుద్యోగ సమస్య

యాత్రలో భాగంగా మీరు కర్ణాటకలో నిరుద్యోగులతో జరిపిన ఇష్టాగోష్టిలో ఉద్యోగాలను ఎలా కల్పించబోతున్నామో వివరించారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు. విద్య, ఆరోగ్య, పోషకాహార రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, చిన్న, మధ్యతరగతి వ్యాపారాలకు ప్రోత్సాహం, ఐటీ రంగంలో ఔట్ సోర్సింగ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవటం మొదలైన చర్యల ద్వారా ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఒక యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రం ప్రభుత్వ రంగ సంస్థల ‘అదుపులేని ప్రైవేటీకరణ’కు మీ పార్టీ వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలే బలహీన వర్గాలకు ఉద్యాగాలు కల్పించగలవన్నారు. ఇందులో విద్యా, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అనే విధానం తప్ప మిగతావన్నీ అన్ని పార్టీలూ, ప్రభుత్వాలూ నిత్యం వల్లించేవే. చిన్న, మధ్యతరగతి ఉత్పత్తి, వ్యాపారాలు కొత్తవి కావు. వాటి విధ్వంసానికీ ప్రపంచీకరణకీ సంబంధం ఉంది. అయినా వాటికి మద్దతు ఇచ్చిన చేసిన మేరకు మరికొంత మందికి స్వయం ఉపాధి దొరకవచ్చు. కానీ అందులో పని చేసే వారివి  ‘ఉద్యోగాలు’ అనలేం. నిజానికి కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పీవీ, మన్మోహన్ లు రహదారులు వేశారనే విషయం మరిచిపోలేం. అప్పటినుండే ఉన్న ఉద్యోగాలు పోవటం మొదలయ్యింది. ఇక ముందైనా PSU లను కాపాడతామనీ, తద్వారా ఉద్యోగ కల్పన చేస్తామని మీరు ప్రకటన చేయటం లేదు. మీరు పేర్కొన్న అనిర్దిష్ట, అస్పష్ట విధానాలకు పరిష్కారమయ్యేంత చిన్నది కాదు నిరుద్యోగ సమస్య. ఇప్పటికైనా మీకు, మీ పార్టీకి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీని నిందించి ఆగిపోకుండా , మీరు మీ పాత విధానాలను సమీక్ష చేసి, ఉద్యోగ కల్పనపై ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఒక ఆచరణాత్మకమైన, శాశ్వతమైన ఉద్యోగ కల్పనా విధానాన్ని అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగ సమాజానికి ఊరట చేకూర్చిన వారవుతారు.

 3. ధరల పెరుగుదల

సరుకుకైనా  ఉత్పత్తికయ్యే ఖర్చు కంటే మార్కెటింగ్ గోల్ మాల్ తో ధరలు కొన్ని రెట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. మధ్యలో ఉండే దళారీల పాత్రను తగ్గించక పోగా అన్ని పార్టీల ప్రభుత్వాలూ వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తున్నాయి. సాధారణ దళారులను కూడా బడా కార్పొరేట్లు మింగేస్తున్న కాలంలో, బీజేపీ ఎక్కువ మంది కార్పొరేట్లు కూడా ఎందుకని ఒకరిద్దరినే రంగంలో ఉంచుతున్నది. ఫలితం రిటైల్ మార్కెట్ పై విపరీతమైన ఏక ఛత్రాధిపత్యం పెరుగుతున్నది. రాను రాను ధరలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. కేవలం రోజువారీ సరుకులే కాదు, నిత్య జీవితంలో అవసరమయ్యే విద్యా, వైద్యం ఖర్చులు కూడా ప్రజల ఆదాయానికి పెద్ద సవాలుగా, జీవన్మరణ సమస్యగా మారాయి.         దేశంలో ఒకవైపు అత్యాధునిక  ‘మాయా’ సమాజం,  మరోవైపు పూట గడవటం కోసమే జీవితాలు ధారపోసే సమాజం, ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ మధ్యతరగతీ ఉన్నాయి. ధరలను అదుపులో పెడతామని పేద, మధ్యతరగతికి హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఆ పని చేసిన దాఖలా లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదలలో కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల పాత్రా ఉంది కాబట్టి ధరలను తగ్గించడానికి మీరు తీసుకోబోయే చర్యలేమిటి?  కొత్త నిత్యావసర సరుకుల ధరల విధానాన్ని రూపొందించి, అమలు చేస్తారా?

 4. సంపద కేంద్రీకరణ

కర్ణాటకలోనే ఒక పత్రికా సమావేశంలో మీరు చాలా స్పష్టంగా “మేము కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు, బిజినెస్ కి వ్యతిరేకం కాదు, మేము కేవలం ‘కంప్లీట్ మొనోపలైజేషన్ ఆఫ్ ఇండియన్ బిజినెస్’ కి మాత్రమే వ్యతిరేకం” అని చెప్పారు. అంటే అదాని లాంటి ఒకరిద్దరి చేతుల్లోనే అన్ని రంగాలూ ఉండకూడదు; పది, పదిహేను మంది కార్పొరేట్ల చేతుల్లో అయితే పరవాలేదనా! దాంతో సంపద వికేంద్రీకరణ జరిగినట్లు అవుతుందా! సంపద కార్పొరేట్ల ఖాతాల్లోకి చేరటానికి దేశ ఉమ్మడి వనరులపై ప్రజలకు గల సహజ హక్కును తొలగించి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు, లాభాలలో నడిచే ప్రభుత్వరంగ సంస్థలను వారికి ధారాదత్తం చేసే విధానాలు, శారీరక, మేధో శ్రామికులకు తక్కువ వేతనాలు ఇచ్చే విధానాలు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని విధానాలు, చిన్న వ్యాపారాలను మింగే కొండ చిలువలకు ఊడిగం చేసే విధానాలూ… ఇవి కదా సంపద కేంద్రీకరణకు అసలు కారణాలు. ఇవన్నీ కాంగ్రెస్ పాలనా విధానాలు కూడా కాదా? 

దేశ పౌరులను దేశ సహజ సంపదలైన గాలి, నీరు, భూమి, అడవి, పర్వతాలు, ఖనిజాలపై, అలాగే ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రోడ్లు, రైల్వే, విద్యుత్తు, టెలికాం మొదలైన అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలపై న్యాయంగా హక్కు కలిగిన భాగస్వాములుగా కాక  ఏదో ఇంత  విదిలించాల్సిన గుంపుగా, సంపన్నులకు అవసరమైన పని చేసే లేబర్ గా మాత్రమే చూసే దృష్టి ఎప్పుడు మారుతుంది? అన్ని ప్రపంచ దేశల్లోనూ రాజ్యం కేవలం జాతీయ, బహుళ జాతి కంపెనీల అవసరాలు తీర్చేదిగా మాత్రమే లేదు; ప్రజా సంక్షేమాన్ని కూడా తమ నైతిక భాధ్యతగా స్వీకరించి పని చేస్తున్నవీ ఉన్నాయి. మన దేశ పాలకులపై కూడా మన రాజ్యాంగం ఆ బాధ్యతను ఉంచింది. ఆదేశిక సూత్రాల్లోని 38 వ నిబంధన రాజ్యం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు అర్థిక, సామాజిక , రాజకీయ న్యాయం అందిస్తూ,  ఆర్థిక అసమానతలు కనిష్ట స్థాయికి తీసుకురావాలని చెప్తున్నది. ఆర్టికల్ 39 అయితే పౌరులందరికీ జీవనోపాధి ఒక హక్కుగా ఉండాలనీ, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించే రాజ్యం కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కాకుండా నివారించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగ దృక్పథం ఇలా ఉంటే గత కొన్ని దశాబ్దాల నుండి జరుగుతున్న పాలన అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నది. బీజేపీకి ఎలాగూ రాజ్యాంగం అంటేనే గిట్టదు. వారు రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఆలోచించే ఆస్కారమే లేదు. మీది రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ అని చెప్తున్నారు. కానీ మీ పాత విధానాలను మార్చుకోకపోతే సంపద కేంద్రీకరణను ఆపలేరు, ఉద్యోగాలను కల్పించలేరు. మీరు కార్పొరేటు అనుకూల విధానాలను వదిలేసి, సామాన్య ప్రజలకు అనుకూలమైన విధానాలకు మారితేనే రాజ్యాంగ స్ఫూర్తి నిజంగా అమలౌతుంది. ఆ పని చేయగలరా?

5. ప్రజాస్వామ్యం – హక్కులు

యాత్రలో ఎన్నో విషయాలను ప్రస్తావిస్తున్న మీరు ఎందుకో రెండు ముఖ్యమైన అంశాలను మాత్రం దాదాపుగా ప్రస్తావించటం లేదు. మత వివక్షతో కూడిన హక్కుల అణచివేత గురించి మాట్లాడుతున్నారే తప్ప పౌరులందరి ప్రాథమిక హక్కుల గురించి అసలు మాట్లాడటం లేదు.  ప్రజాస్వామ్య దేశం అంటే అక్కడ ‘ఎన్నికలు’ జరిగితే ఇక అంతా అయిపోయినట్టు కాదు, ఆ దేశంలోని పాలకులు పాలన సాగించే సమయంలో ప్రజలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవవహరించాలి. ఈ విషయంలో మీ పార్టీ చరిత్ర అస్సలు బాగాలేదు. గత చరిత్ర మాత్రమే కాదు, ఇవాళ ఛత్తీస్ గడ్ లో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వ విధానాలే అందుకు సజీవ సాక్ష్యం. తమ గ్రామాల్లో భారీ, శాశ్వత CRPF క్యాంపులు నెలకొల్పుతూ, వాటి రక్షణలో అటవీ ప్రాంతాన్ని తవ్వి  ఖనిజాలను తరలించటమే లక్ష్యంగా పని చేస్తున్న మీ ప్రభుత్వ విధ్వంసపు విధానాల్ని ఆపమని వేలాదిమంది ఆదివాసులు సుక్మా జిల్లా సిల్గేర్ లో ఏడాదిన్నరగా అహింసాయుతంగా నిరసన తెలియచేస్తున్నారు. గత ఏడాది వాళ్ల శిబిరంపై అకారణంగా కాల్పులు జరిపి ఐదుగురి మరణానికి కారణమయ్యారు. ఇటీవల ఆదివాసీలు సిల్గేర్ నుండి సుక్మాకు కాలినడకన సీపీఐ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో బయలుదేరితే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతుల్లేవనే పేరుతో అడ్డుకుంది. మీ యాత్రకొక నీతి, సామాన్య ప్రజల యాత్రకొక నీతి ఉంటుందా?  

ఎన్నో అణచివేత చట్టాలు మీ పాలనలోనే వచ్చాయనేది మేమెవరమూ మరిచిపోలేదు. టాడా, ఊపా వంటి చట్టాల రూపకల్పన, ప్రజల నిరసనలకు అవకాశాలు ఇవ్వకపోవటం, సాయుధ ఉద్యమాల అణచివేతే లక్ష్యంగా ప్రజలపై అంతులేని హింస, బూటకపు ఎదురుకాల్పులు, సల్వాజుడుం లాంటి ప్రైవేటు సాయుధ సైన్యం ఏర్పాటూ… అన్నీ మీ పార్టీ ప్రభుత్వాలు చేసినవే. ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీరు తెచ్చిన ఊపా(UAPA- చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం) చట్టాన్నే ఇంకా బలోపేతం చేసి హక్కుల అణచివేతకు సాధనంగా వాడుతోందనేది మీకు తెలియందా?

ఈ యాత్రలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దాని రద్దుకు కృషి చేస్తానని మీరు ప్రకటన చేస్తారా?  సాయుధ ఉద్యమాలతో పాటు ఏ రకమైన ప్రజా నిరసనలు, ఉద్యమాల వెనుక  అయినా బలహీనులైన విస్తారమైన జన బాహుళ్యం యొక్క ఆకాంక్షలుంటాయని పాలకులు అర్థం చేసుకోవాలి. వాటిని పరిష్కరించాలి. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ రోజు దేశ ప్రజలకు ఐక్యత ఒక్కటే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరమే.

 మేం పైన వివరించిన ఐదు అంశాల్లో మొదటిదైన మత విద్వేష రాజకీయాలు చేయకపోవటం అనే ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీని కొంతవరకు నమ్మవచ్చు. మిగతా విషయాల్లో మీ పార్టీ తన సాంప్రదాయ పాలనా విధానాలను సమీక్షించుకుంటుందా, మార్చుకుంటుందా అనే దానిపై మీరు స్పష్టమైన ప్రకటన ఇస్తే ప్రజలు తాము ఎంత ప్రయోజనం పొందగలరో అంచనా వేసుకోగలరు. యాత్ర పట్ల మరింత స్పష్టతతో స్పందించగలరు. అలా కాక మీరు కేవలం అధికార పార్టీ(ల) పట్ల ప్రజల్లో పెరిగే వ్యతిరేకతనే ఉపయోగించుకుంటూ, మీ పాత విధానాలనే కొనసాగించదల్చుకుంటే రేపు మీరు గద్దెనెక్కినా కూడా ప్రజలకొక ఉత్తమ ప్రత్యామ్నాయం కాలేరు. కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో ప్రజలకొక ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం నేటి అవసరం. ఆ దిశగా మీరు ఆలోచించాలని కోరుతూ…

 – మానవ హక్కుల వేదిక

   HUMAN RIGHTS FORUM

   (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ )

  తేదీ 29.10.2022.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles