షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తిస్తూ రంపచోడవరం ITDA సేవలను కొనసాగించాలి
జూలై 8 శనివారం, ప్రత్తిపాడు మండల కేంద్రంలోని CPI ML లిబరేషన్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లాకు చెందిన 7 మండలాల నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 5వ షెడ్యూల్ సాధన సమితి, రాష్ట్ర కార్యదర్శి PS అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 గ్రామాలను గుర్తించి వాటిని షెడ్యూల్డ్ గ్రామాలుగా నోటిఫై చేయమని కోరుతూ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా 1976లో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసిందని ఆ తీర్మానం నేటికి అమలు కాకుండా ఉండిపోయిందని అజయ్ కుమార్ అన్నారు. షెడ్యూల్ ఏరియా పరిధిలో లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు చెందిన ఆదివాసీలు వివక్షకు గురవుతున్నారని ఆయన అన్నారు. గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటుతో నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలు ITDA సేవలను కూడా కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. రంపచోడవరం ITDA పరిధిలో సబ్ ప్లాన్ ప్రాంతంగా ఉన్న రౌతులపూడి, శంఖవరం, జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తీపాడు, కోటనందూరు మండలాలలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలు నేడు ఐటిడిఏలకు బయట ఉండిపోయారని అజయ్ కుమార్ అన్నారు. ఈ అన్యాయాన్ని సరి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని, ITDA లు జిల్లాలు మారినా పూర్వపు జిల్లాలోని ఆదివాసీలకు కూడా ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా కొనసాగుతాడని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండిపోయిన ఆదివాసీలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తిస్తామని 2007లో అప్పటి ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి శాసనసభలో హామీ ఇచ్చారని ఆ హామీని అమలు పరచవలసిన నైతిక బాధ్యత YS జగన్మోహన్ రెడ్డి పై ఉందని ఆన్నారు.
శంఖవరం మండలానికి చెందిన ఆదివాసి ప్రతినిధి జర్త ముసలయ్య మాట్లాడుతూ నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాల్లో కలపాలని కోరుతూ తాము దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఆగస్టు 7న చలో శంఖవరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆగస్టు 14న విజయవాడలో ధర్నా చౌక వద్ద ఒకరోజు ధర్నా నిర్వహిస్తామని ఇందులో కాకినాడ జిల్లా ఆదివాసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు.
Also read: అల్లూరి సీతారామరాజు – ఇందిరమ్మ ఇచ్చిన భూమి
అఖిల భారత ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం మాట్లాడుతూ నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత తాసిల్దారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. CPI ML లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఆదివాసీలకు ఇచ్చిన అటవీ హక్కుల చట్టం పట్టాలలో విస్తీర్ణాన్ని బాగా తగ్గించి వేశారని వాస్తవంగా ఆదివాసి 5 ఎకరాలు సాగు చేస్తుంటే 50 సెంట్లుపట్టాలో చూపారని దీనిపై పునర్విచారణ జరపాలని ఆయన కోరారు నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల పోరాటానికి లిబరేషన్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మిగిలిన వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికి శక్తులు ఆదివాసీల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలియచేయాలని ఒక ప్రకటనలో కోరారు.
సమావేశం అనంతరం ఆదివాసీలు లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి ప్రత్తిపాడు మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్తా ముసలయ్య. బూసర బాలరాజు, కర్రి నాగేశ్వరరావు, సోమల శ్రీను.పందిరి ప్రసాద్ జక్కంపూడి రాజు యట్లామల్లేశ్వరి,పాల్గొన్నారు.
Also read: రెండు నెలల రేషన్ అందింది, ఆహార భద్రతా చట్టం గూర్చి తెలిసింది
ఇఏఎస్ శర్మ లేఖ
నాన్ షెడ్యుల్ గ్రామాలుగా వుండిపోయిన గ్రామాలను షెడ్యుల్ ప్రాంతాలుగా గుర్తించాలని అప్పుడే మాకు రాజ్యంగపరమైన రక్షణ లభిస్తుందని ఆదివాసీలు అంటున్నారు.
EAS శర్మగారి లేఖ దిగువ ఇస్తున్నాను.
ఈ అ స శర్మ
పూర్వ ఆంధ్ర ప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్
To
గౌరవనీయులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు,
మీ ప్రభుత్వం కొత్త జిల్లాలను సృష్టించడం కారణంగా జిల్లాల పరిధులలో మార్పులు రావడం జరిగింది. కాని ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం, దశాబ్దాల క్రింద సృష్టించబడ్డ ITDA ల పరిధులలో ఎటువంటి మార్పులు మీ ప్రభుత్వం ప్రవేశ పెట్టకపోవడం సరి అయిన నిర్ణయం.
కొత్త జిల్లాలను సృష్టించిన తరువాత, కొన్ని ITDA లకు, రెండు మూడు జిల్లాలలో ఉన్న ఆదివాసీ గ్రామాల సంక్షేమం విషయంలో పని చేసే బాధ్యత ఉంది. ITDA అధికారులు, ఒకే జిల్లాకు పరిమితం కాకుండా, ఇతర జిల్లాలలో ఉన్న అటువంటి గ్రామాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండవచ్చు.
ఉదాహరణకు, పాడేరు ITDA పరిథి, ASR జిల్లాకే పరిమితం కాకుండా, అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆదివాసీ గ్రామాలకు కూడా వర్తిస్తుంది. అనకాపల్లి జిల్లాలో నాతవరం, గోలుగొండ, దేవరాపల్లి, మాడుగుల, రావికమతం, రోలుగుంట, చీడికాడ మండలాలలో అరవైకి పైగా ఆదివాసీ గ్రామాలకు వర్తిస్తుంది. అంటే పాడేరు ITDA అధికారులకు ఆ గ్రామాలకు వెళ్లి ఆదివాసీ ప్రజల సంక్షేమం విషయంలో దృష్టి పెట్టే బాధ్యత ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం అనకాపల్లి, ASR జిల్లా కలెక్టర్ల కు, పాడేరు ITDA ప్రాజెక్ట్ అధికారికి, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
అదే విధంగా మిగిలిన ఏడు ITDA అధికారులకు, ఆ ITDA పరిధిలో ఉన్న జిల్లాల కలెక్టర్లకు స్పష్టీకరణ చేయవలసి ఉంది.
ఇదే కాకుండా, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు వంటి నగరాల్లో చెంచులు, యానాదులు, ఎరుకలు వంటి ఆదివాసీలు వలస వచ్చి స్థిరపడ్డారు. కాని వారి విషయంలో అధికారులు ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదు. అటువంటి ఆదివాసీ ప్రజల సంక్షేమం బాధ్యత, మైదాన ప్రాంతాల ప్రత్యేక ITDA ప్రాజెక్టు అధికారికి ఇవ్వాలని విజ్ఞప్తి
ఇట్లు
ఈ అ స శర్మ
విశాఖపట్నం
4-7-2023
Also read: రెండు నెలల రేషన్ అందింది, ఆహార భద్రతా చట్టం గూర్చి తెలిసింది