Thursday, November 21, 2024

కృష్ణాజలాల పరిరక్షణకై కోదండరాం యాత్ర

  • బుధవారం సాయంత్రం నల్లగొండజిల్లాలో యాత్ర ప్రారంభం
  • పానగల్ గడియారం సెంటర్ లో బహిరంగసభ
  • ఉదయసముద్రం నుంచి నక్కలగండి వరకూ 6 రోజుల యాత్ర

తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ. కోదండరాం నాయకత్వంలో బుధవారం 04 మే 2022 న కృష్ణాజలాల పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తారు.  ఉదయ సముద్రం పానగల్ లో సాయంత్రం గం.4కుయాత్ర ప్రారంభం అవుతుంది. గడియారం సెంటర్ లో సాయంత్రం గం. 6-30 నిమిషాలకు బహిరంగసభ జరుగుతుంది. రాత్రిపూట బస నల్లగొండ పట్టణంలో చేస్తారు. ఉదయసముద్రం నుండి నక్కలగండి టన్నల్ వరకూ యాత్ర సాగుతుంది.

రెండో రోజు గురువారం ఉదయం గం.7-30లకు అద్దాలబావి నుంచి చర్లపల్లి, యంజి యూనివర్శిటీ, ఎల్లారెడ్డి గూడెం వరకూ యాత్ర ఉంటుంది. రాత్రి బస నార్కెట్ పల్లిలో.

మూడో రోజు శుక్రవారం నార్కట్ పల్లి నుంచి ఉదయం గం.7.00 లకు ప్రారంభమైన యాత్ర ఏనుగులడోరి, గోపాలాయపల్లి, నర్తిమట్టి స్టేజి, చిట్యాల మార్కెట్ కు చేరిన తర్వాత మద్యాహ్న భోజన విరామం ఉంటుంది.  తర్వాత నేరడ, చౌడంపల్లి మిదుగా బ్రాహ్మణవెల్లెంలలో రాత్రి బస.

నాలుగో రోజు శనివారం  బ్రాహ్మణవెల్లెంల నుంచి బయలుదేరి ఎలికట్టె, రత్తిపల్లి, సింగారం, మునుగోడు, బోడంగివర్తి చేరుకోని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.  ఆ తర్వాత కొండాపురం, కమ్మగూడెం, తేరట్ పల్లి, ఘట్టప్పల్ చేరుకొని రాత్రి బస.

అయిదో రోజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఘట్టుప్పల్ నుంచి బయలుదేరి చర్లగూడెం, మర్రిగూడెం సెంటర్, ఈదులకుంట, కృష్ణరాంపల్లి చేరుకొని అక్కడ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వింజమూరు, చింతపల్లి, మల్లేపల్లి, దేవరకొండ వరకూ యాత్ర సాగించి అక్కడ రాత్రి బస చేస్తారు.

ఆరవరోజు, ఆఖరి రోజు సోమవారంనాడు దేవరకొండ నుంచి ఉదయం తొమ్మది గంటలకు యాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్న 12 గంటలకు నక్కలగండి ప్రాజెక్టు చేరుకుంటారు. అరగంట తర్వాత యాత్ర ముగుస్తుంది.

కరపత్రం

యాత్ర ప్రారంభానికి ముందు ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులోని అంశాలు:

‘‘ఎంత సక్కని దానివే కృష్ణమ్మ…

ఏ దిక్కు పోతున్నావే కృష్ణమ్మ’’

తెలంగాణ రాకమునుపే గోరెటి వెంకన్న రాసిన పాట ఇది. ఆ నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాసిన  ఈ పాట మొత్తం ఇప్పటి  వాస్తవాలకు కూడా అద్దం పట్టిపట్టి చూపుతున్నట్టు ఉండటం విషాదమే.

‘‘ఏటి ఆవల భూమి ఏతీరుగున్నాది…

పారేదిమానేల…

మునిగింది ఈ ఊరు

ఈడ మా పాలిట ఇంకుడు గుంతలు..

అడుగుపెట్టిన తాన ఆకలి చూపినవు….

ఏటి పక్కన నేల ఎందుకు ఎండివున్నాది…

పండేది ఏనేల

ఎండిన కాలువల తొర్రలు, నెర్రెలు…

ఆడ నీ పుణ్యాన పచ్చని పైరులు

ఆపుకున్న తాన దోపిడి పెంచినవు…’’

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే కృష్ణా జలాల్లో వాటా దక్కుతుందని, ఈ ప్రాంతం పాడిపండటలతో కళకళలాడుతుందని కలలు కన్నం. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయమైన వాటా అడిగే అధికారం తెలంగాణకు లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కృష్ణాజలాల్లో తన భాగాన్ని అడిగే హక్కును పొందింది. దురదృష్టవశాత్తు ఎనిమిది సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దక్కవలసిన వాటాను పంచి ఇవ్వలేదు. ఇరు రాష్ట్రాలు పంచుకోవలసిన నీళ్ళు 811 టీఎంసీలు. అందులో మనకు తాత్కాలికంగా కేటాయించింది 299 టీఎంసీలు మాత్రమే. మన రాష్ట్రంలో నది సుమారు 420 కిలోమీటర్లు, ఆంధ్రాలో 250 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. నదీపరీవాహక ప్రాంతం – అంటే నదిలోకి నీళ్ళు ప్రవహించే ప్రాంతం- నూటికి 70 శాతం తెలంగాణలో ఉంటుంది. ఆ లెక్కన చూసినా, మన అవసరాల ప్రాతిపదికన చూసినా మనకు 548 టీఎంసీల పైననే నీళ్ళు దక్కాలి. కానీ కేంద్రం మనకు న్యాయమైన వాటా ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం మన వాటాకోసం కొట్లాడదు. అందుకోసం రాష్ట్రప్రభుత్వం చేసింది శూన్యమనే చెప్పాలి. కృష్ణాప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయలేదు. అందువలన దక్కిన కొద్దిపాటి జలాలను కూడా వాడుకునే సామర్థ్యం రాష్ట్రం సాధించుకోలేదు. ‘‘మా కృష్ణమ్మతల్లి తెలంగాణకు కన్నీళ్ళు తప్ప నీళ్ళివ్వలేదు’’ అని గద్దర్ చెప్పిన పరిస్థితి మార్చడంలో తెలంగాణ పాలకులు విఫలమయ్యారు.

మూలిగే నక్కపైన తాడిపండు

ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ, మనుగోడు నియోజకవర్గాలకు వరప్రదాయిని అయిన డిండి పథకానికి కృష్ణానదిలో ఎక్కడినుంచి నీళ్ళు తీసుకోవాలో ఇప్పటికీ తేలలేదు. మొత్తంగా నల్లగొండలో ప్రాజెక్టులు పూర్తి కావలసిన గడువు అయిపోయింది. అవి ఎప్పటికి పూర్తి అవుతాయో అర్థం కావడంలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు సరిగ్గా ఖర్చు చేసి ఉంటే దాదాపు అన్ని ప్రాజెక్టులూ పూర్తయ్యేవి. కానీ రీడిజైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, నిపుణులు వారించినా వినకుండా, ప్రాజెక్టులపై ఖర్చును పెంచింది. ఈ మార్పుల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకోసమే చాలావనరులను వినియోగించడంతో మిగతా ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పెండింగులో ఉన్న ఈ పరిస్థితిలో కేంద్రం కొత్త ఉత్తర్వులను గెజెట్ రూపంలో తెచ్చింది. ఈ నిర్ణయం మూలిగే నక్కపైన తాడిపండు పడ్డట్టు అయింది.

నదులపై ప్రాజెక్టులు కేంద్రం కైవసం

గెజెట్ వివరాలను చూస్తే జరిగే నష్టం తేటతెల్లమైతది. విభజన చట్టం నదీ జలాల వినియోగాన్ని నియంత్రించడానికి  గోదావరి నదికి ఒకటి, కృష్ణానదికి ఒకటి నదీ జలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే, ఏ బోర్డు ఎన్ని ప్రాజెక్టులను కంట్రోలు చేసేదీ చట్టంలో రాయలేదు. బోర్డుల అధికారం ఎన్ని ప్రాజెక్టులపై ఉంటదో తెలియజెప్పే ఆర్డర్ కేంద్రం జారీ చేస్తదని చట్టంలో రాసి ఉన్నది. దానని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం  15 జులై 2021నాడు గెజెట్ తీసుకొచ్చింది. విభజన చట్టానికి విరుద్ధంగా గెజిట్ ప్రాజెక్టున్నింటినీ బోర్డులకు అప్పజెప్పింది. గెజిట్ వలన చట్టంలో లేని అధికారాలు కూడా బోర్డులకు దక్కినాయి. నీళ్ళ విడుదల, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల మరమ్మతు వంటిపనులు బోర్డుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. గెజిట్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులను పూర్తిగా మూసివేస్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తప్ప నల్లగొండలోని ఏ ప్రాజెక్టుకూ అనుమతులు లేవు. ఈ నిర్ణయం వలన రాబోయే జులై నెలలో గెజిట్ అమలులోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదీజలాలపైన అధికారాన్ని కోల్పోతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయవలసి వస్తుంది. ఆ ప్రాజెక్టుల నుండి ఒక చుక్క నీటిని కూడా వాడుకోలేదు. పైగా ప్రాజెక్టుల నిర్వహణకోసం మనమే బోర్డుకు పైసలు ఇవ్వాలి. ముందుగా చెరి రూ. 200 కోట్లు జమ చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

పెండింగ్ ప్రాజెక్టులకు గెజెట్ అడ్డుతగులుతోంది

కృష్ణా నదీ జలాలలో వాటా తేల్చకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తెలంగాణకు న్యాయం జరుగదు. గెజెట్ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పెంచలేదు. తాత్కాలికంగా కేటాయించిన 299 టీఎంసీల నీళ్ళ పంపకాన్ని బోర్డు కొనసాగిస్తుంది. ఇది అన్యాయం. పైగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా గెజెట్ అడ్డుపడుతోంది. అందువలన నదీజలాలపై ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ఆంధ్రా ఆధిపత్యం ఇప్పుడు ఇంకా బలపడుతుంది. తనకు దక్కవలసిన వాటాను తెలంగాణ శాశ్వతంగా కోల్పోతుంది. గెజెట్ కృష్ణాజలాల పంపిణీలో ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన అసమానతలను కొనసాగిస్తుంది తప్ప దాన్ని సరి చేయదు. అంటే తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వదన్న మాట.  అంతే కాదు, ఇప్పుడు నదులపై కేంద్రం అధికారం  అసమానతలను కాపాడటానికే ఉపయోగపడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం నదులపై రాష్ట్రాలకు అధికారం ఉంటది. తెలంగాణ రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని మాత్రమే కాదు కృష్ణా నదిలోతన వాటాను కూడా కోల్పోతున్నది.

బేసిన్లు లేవు భేషజాలు లేవన్న కేసీఆర్

తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలకోసం సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజలాల్లో వాటి దొరకలేదని తెలంగాణకోసం  పోరాటం చేసినం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటా సాధించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే, రాష్ట్రం ఏర్పడిన తరువాత వాటా సాధించవలసిన ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షను అటకెక్కించింది. కృష్ణా జలాలను కరువుపీడిత దక్షిణ తెలంగాణ  జిల్లాలకు అందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోలేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉన్న నీళ్ళను ఉపయోగించే ప్రయత్నమే చేయలేదు. ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే తెలంగాణ పాలిట శాపంగా మారింది. పైగా బేసిన్లు లేవు, భేషజాలు లేవని ప్రకటించి న్యాయమైన వాటాను సాధించవలసిన బాధ్యతకు తిలోదకాలిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపాలి

ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న గెజెట్ ను రద్దు చేయాలి. కృష్ణాజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించుకోవాలి. పెండింగ్ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి. ఈ డిమాండ్ల సాధనకు రాష్ట్రప్రజల తరఫున కేంద్రంపైన ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే. వడ్ల కొనుగోలు విషయంలో ఆందోళన చేసినట్టు కృష్ణాజలాల్లో వాటాకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి తేవాలి. ఆ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం మరచిపోయింది. రండి. అందరం కలసి మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపుదాం. రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యాన్ని గుర్తు చేద్దాం. ఈ లక్ష్య సాధనకోసమే యాత్ర చేస్తున్నాం. ప్రతి ఊరికీ కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని తెలియజెప్పడం కోసమే ఈ యాత్ర. యాత్రను విజయవంతం చేద్దాం. కృష్ణాజలాల్లో వాటాను సాధించుకుందాం.

ఉద్యమాభివందనాలతో….

తెలంగాణ జన సమితి

యాత్రలో పాల్గొనాలనుకునేవారు సంప్రదించవలసిన మొబైల్

నంబరు:  9848287001    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles