(ప్రసాద్ గోసాల)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కులం ,మతం గురించి గతంలో ఎప్పుడూ జనసామాన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఆ స్ధానంలో ఎవరున్నా , ఏకులం వారన్న, ఏమతం వారన్న ఆలోచన జనసామాన్యానికి ఉండేదికాదు. కానీ గత రెండేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైన విభజన పూర్తిగా వచ్చేసింది. క్రైస్తవ సమాజం పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక నిలవడం , ఆయన కూడా అందుకు తగ్గట్టే క్రైస్తవ పాస్టర్లకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందించడంతో పాటు హిందూ దేవాలయాల విషయంలో అంతగా శ్రద్ధ చూపకపోయినా నిర్లక్ష్యంతో వ్యవహరించడం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
‘చవితి‘ చంద్రుడులా జగన్ కూ తప్పని నీలాపనిందలు!
వైఎస్ జగన్ మీద హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయాలనే ప్రయత్నం జరుగుతోందని వైసిపి నాయకత్వం ఆరోపిస్తోంది. అయితే, ఆ ప్రచారంలో నిజంలేదని చెప్పే పరిస్థితి వాస్తవంగా లేదు. ఇప్పుడు సామాన్యజనానికి కీలకమైన వినాయకచవితి విషయంలో తీసుకున్న నిర్ణయం మాత్రం గట్టిఝలక్ ఇచ్చేసింది. దాని ప్రభావం కనిపిస్తోంది.
వినాయక చవితి అన్నది జనం జరిపే పండుగ. ప్రతి చోటా , ప్రతి వీధిలో ప్రతి ఇంటా బయటా , ఆఖరికి ప్రతి అపార్ట్ మెంట్ కాంప్లెక్స్, ప్రతి కాలనీ, ప్రతి వీధిలో వినాయక చవితి పూజలు జరుపుకోవడం అన్నది సర్వ సామాన్యం. ఇంత పెద్ద ఎత్తున జరిగే పండుగ మరోటి లేదు. అలాంటి పండుగను సామూహికంగా జరపడానికి వీలు లేదు అని ఆదేశాలు జారీ చేయడం ప్రజల్లో గట్టిగా అసంతృప్తికి దారితీసింది.
సోషల్ మీడియాలో చలామణీ అవుతున్న వీడియోలు మామూలుగా లేవు. గుంటూరులో మున్సిపాల్టీ చెత్త ట్రాక్టర్ లోకి వినాయక విగ్రహాలు డంప్ చేస్తున్న వీడియో అలాంటి వాటిల్లో ఒకటి. ఇలాంటివి హిందువుల మనో భావాలను మామూలుగా దెబ్బతీయవు. పైగా కరోనా అనే సాకు ఇక్కడ సమర్ధనీయం కాదు. రోజుకు మూడు షో లకు థియేటర్లకు జనం వచ్చి వెళ్తున్నారు. బార్ లకు వచ్చి వెళ్తున్నారు. బజార్లు, షాపింగ్ మామూలే. కేవలం అర్థరాత్రి 11 నుంచే ఉదయం 6 వరకూ కర్ఫ్యూ వుంది తప్ప పగలు లేదు.
పుట్టిన రోజులు, పెళ్లిళ్లు నిర్ణీతగడువులో , నిబంధనలకు లోబడి అన్నిచోట్లా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వినాయక చవితికి ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను జనం చూస్తున్నారు. ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారు. ఇప్పటివరకు మనల్ని జనం నిలదీయలేదు కాబట్టి మనకున్న 151 ఎమ్మెల్యేల బలంతో మనం చేసిందల్లా కరెక్టుగా ఉందనుకుంటే పొరపాటు. వేలాది మంది పేద కార్మికులు, దుకాణ దారులు వినాయకచవితి మీద ఆధారపడి వున్నారు. వారంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయినట్లే. పైగా పక్కన తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. జనం చూసేది జగన్ ను, ఆంధ్రను మాత్రమే కాదు , తెలంగాణ ను కూడా.
చినుకూ చినుకూ కలిస్తే ప్రవాహం
ఏమైనా జగన్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ విషయంలో తీసుకున్న నిర్ణయం ఓ వర్గంలో అసంతృప్తికి దారితీసింది. ఒక చినుకు ఏమీ ప్రమాదం కాకపోవచ్చు. చినుకు..చినుకు కలిస్తే ప్రవాహమే అవుతుంది. జగన్ ప్రభుత్వం అది గమనించుకోవాలి. ఇప్పటికే రోడ్ల పరిస్థితి మామూలుగా నెగిటివ్ కావడం లేదు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ దేవాదాయ శాఖ మంత్రి మొత్తం నెపాన్ని బిజెపి ప్రభుత్వం వైపు తోసేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా నిర్ణయం మార్చుకుంటే మంచిది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో జనమే తమ నిర్ణయం మార్చుకుంటారు.
స్టీల్ ప్లాంట్, గంగవరం లాంటివి విశాఖలో, అమరావతి దక్షిణ కోస్తాలో ఎఫెక్ట్ చూపిస్తే, రాయలసీమలో నీటి ప్రాజెక్టులు ప్రభావం చూపిస్తే జనం సెంటిమెంట్ తో ముడిపడిన వినాయక చవితి మాత్రం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. పాలకులు ఇది గమనించుకోవాలి. జగద్గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వామిజీ అయినా చెప్పాలిగా మరి!