కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రాను అరెస్టు చేశారు. లఖింపూర్ ఖేరీలో సోమవారం జరిగిన ఘటనలకు సంబంధించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆమె పైన కేసు పెట్టారు. ప్రియాంకను లక్నోలో గృహనిర్బంధంలో ఉంచారు. ఆమె గృహనిర్బంధం నుంచి తప్పించుకొని కాంగ్రెస్ నాయకులతో కలిసి లఖింపూర్ ఖేరీకి బయలుదేరి వెళ్ళారు.
లఖింపూర్ ఖేరీలో శనివారంనాడు కేంద్రమంత్రి అజయ్ శర్మ పర్యటనకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహిస్తున్న రైతుల పైనుంచి కారు వెళ్ళిన కారణంగా నలుగురు రైతులు మరణించారు. ప్రదర్శకులు రెచ్చిపోయి సృష్టించిన హింసాకాండలో నలుగురు ఇతరులు మృతి చెందారు. రైతులమీదినుంచి వెళ్ళిన కారులో అజయ్ మిశ్రా తనయుడు ఉన్నాడనీ, అతనే కారు నడుపున్నారనీ రైతులు ఆరోపిస్తున్నారు. తాను, తన కుమారుడు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్యాతో పాటు ఉన్నామనీ, కారులో తన తనయుడు లేడనీ మంత్రి అజయ్ శర్మ అంటున్నారు. మంత్రి కొడుకును తాను కళ్ళారా చూశానని కారు కిందబడి గాయాలపాలైన రైతు గట్టిగా చెబుతున్నాడు.
కాంగ్రెస్ నేతలతో లఖింపూర్ కు బయలు దేరిన ప్రియాంక పోలీసులకు చిక్కకుండా అయిదు గంటలపాటు ప్రయాణం చేసి చివరికి హరగాంవ్ దగ్గర దొరికారు. ఆమెనూ, పలువురు కాంగ్రెస్ నాయకులనూ పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 4వ తేదీన ఉదయం గం.4.30ల సమయంలో ప్రియాంకను అరెస్టు చేశారు. ప్రస్తుతం సీతాపూర్ లో పీఏసీ గెస్ట్ హౌస్ లో ఆమెను నిర్బంధించారు. ఆ గెస్ట్ హౌస్ ను తాత్కాలిక జైలుగా పరిగణిస్తున్నారు. ప్రియాంకను నిర్బంధించి 24 గంటలు అయిన సందర్భంగా ఎన్ డీటీవీ చేసిన ఇంటర్వ్యూలో తాను ఆరు రోజులైనా, ఆరు మాసాలైనా నిర్బంధంలో ఉండగలననీ, ఎటుంటి ఇబ్బందీ లేదనీ వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను నిర్బంధించిన యూపీ ప్రభుత్వం రైతులు మీది నుంచి కారు నడిపి ఆరుగురి మరణానికి కారకుడైన వ్యక్తినీ, అతడి తండ్రి అయిన కేంద్రమంత్రి అజయ్ శర్మనూ అరెస్టు చేయలేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇదే విషయంపైన ఆక్షేపిస్తూ ప్రియాంక ప్రధాని నరేంద్రమోదీకి ఒక ట్వీట్ పంపించారు.
రైతులు ఆందోళన చేయడం సరికాదనీ, వారు అభ్యంరతం చెబుతున్న మూడు వ్యవసాయ చట్టాలనూ అమలు చేయకుండా పక్కన పెట్టారనీ, వారి కేసు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నదనీ. అటువంటి పరిస్థితులలో ఆందోళన చేయడం సరికాదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలను గురించి ప్రశ్నించగా, సుప్రీంకోర్టు అన్న మాటల మీద తాను వ్యాఖ్యానించజాలననీ, భారత రాజ్యాంగం నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఇచ్చిందనీ, ఈ హక్కు సుప్రీంకోర్టు కానీ , ప్రభుత్వ కానీ ఇచ్చింది కాదనీ, ఇది ప్రజల ప్రాథమిక హక్కు అనీ ప్రియాంక అన్నారు.