ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికలలో ప్రియాంకాగాంధీ కాంగ్రె్స్ కి సారథ్యం వహిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేస్తారనీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతారని కూడా అంటున్నారు. అసాధ్యం అనుకుంటున్న అంశాన్ని ఇందిరమ్మ మనుమరాలు సుసాధ్యం చేయగలదా?
ఇందిరాగాంధీ మనుమరాలు, రాజీవ్ గాంధీ గారాలపట్టి, నెహ్రు-గాంధీ కుటుంబాల వారసురాలు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించబోతున్నారని,ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడబోతున్నారనే వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవడానికి పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి -మార్చి మధ్యలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పట్టుమని ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. గడచిన మూడు సంవత్సరాల నుంచి ఆ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యురాలుగా ప్రియాంక వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో పార్టీలో ఆమె వివిధ సంస్కరణలు చేపట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయానికి -ఇప్పటికీ అక్కడ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సర్వం రాహుల్ గాంధీ అన్నట్లుగానే అప్పటి వరకూ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం తప్ప, మొన్నటి వరకూ ప్రియాంక పాత్ర ఏమీ లేదనే చెప్పాలి.
Also read: వేగం పరమౌషధం
వరుస పరాజయాలు
2017 ఎన్నికల్లో పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ అదే పరాజయం ఎదురైంది. 1989 నుంచి ఆ పార్టీ అధికారానికి దూరమై పోయింది. ఈ 32ఏళ్ళలో సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్, బిజెపి రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ వచ్చాయి. రేపు 2022ఎన్నికల్లో గెలుపు మాదే అనే ధీమాలో అధికార బిజెపి,సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. అధికారాన్ని చేజిక్కుంచుకోగలమనే విశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ స్థాయిలో లేదు. ప్రియాంక గాంధీ వల్ల పార్టీకి ఎంతోకొంత బలం పెరుగుతుందనే నమ్మకం మాత్రం ఎక్కువమందిలో ఉంది. ప్రస్తుత బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అద్భుతాలు ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే చెడ్డపేరే మూటకట్టుకుంది. క్షీణ, హీన దశలో ఉన్న కాంగ్రెస్ కు జవసత్వాలు తేవడంలో ప్రియాంకగాంధీ విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంపై పెదవి విరుస్తున్నారు. అద్భుతాలు ఏవైనా జరిగితే తప్ప అది సాధ్యం కాదని అంటున్నారు. ప్రియాంక గాంధీకి ప్రజల్లో ఆకర్షణ లేకపోలేదు. కొన్నేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా ఆమెకు మంచి క్రేజ్ ఉండేది. కేంద్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ చీకటి నీడలు ఆమెపై కూడా పడ్డాయి. ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉండడం, హిందీ బాగా మాట్లాడగలగడం,అది కూడా.. దేశవాళీ శైలిలో (నేటివిటీ) సాగడం, వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు లేకపోవడం, రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉండడం మొదలైనవి ప్రియాంకలోని ఆకర్షణలు. ఉత్తరప్రదేశ్ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నైతికబలాన్ని పెంచుతున్నారనే మాటలు వినబడుతున్నాయి. పార్టీ నిర్మాణంలోనూ అంతర్గతంగా అనేక మార్పులు తీసుకు వచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుకుంటూ వస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ దగ్గరగా వెళ్లే పరిస్థితులు నాయకులకు ఉండేవి కాదు. అగ్రనేతలకు తప్ప ఆ అవకాశం ఎవ్వరికీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ చిత్రపటమే మారిపోయింది.
Also read: పెగాసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ దాపరికం
కార్యకర్తల అందుబాటులో ప్రియాంక
చిన్న కార్యకర్తకు కూడా నేరుగా మాట్లాడే స్వేచ్ఛ ప్రియాంక దగ్గర లభిస్తోంది. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక,సామాజిక వర్గ వ్యతిరేక పరిణామం ఏది జరిగినా, గళం విప్పండి, ఉద్యమించండి… అంటూ ఆమె శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారనే ప్రచారం పార్టీలో ప్రబలంగా జరుగుతోంది. ప్రియాంక తరచుగా రాష్ట్రానికి వెళ్తున్నారు. కార్యకర్తల నుంచి పెద్ద నేతల వరకూ అందరితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏదున్నా..నేరుగా నన్ను సంప్రదించండి.. అని ఆమె కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్ర నాయకత్వంలోనూ ఆమె పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. పోరాటయోధుడుగా పేరున్న అజయ్ కుమార్ లల్లూను పార్టీకి రాష్ట్ర అధిపతిగా నియమించారు. అజయ్ కుమార్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు. ప్రస్తుతం లక్ష్మీపూర్ ఖేరీ నియోజకవర్గం శాసనసభ్యుడు కూడా. ఉత్తరప్రదేశ్ లో తరచుగా ప్రియాంక పర్యటనలు జరపడం వెనకాల లల్లూ ప్రమేయం ఉంది. స్థానికులు,పార్టీ పట్ల విధేయత కలిగినవారు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు బాగా ఎరిగినవారిని కార్యవర్గంలోకి తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ, ‘ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ’ లోనూ అటువంటివారికే చోటు కల్పించారు. ఇవి ప్రియాంక చేపట్టిన ముఖ్యమైన చర్యలు. 2022అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ పథకరచన చేసినట్లుగా సమాచారం. బిజెపి వలె, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా జరపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తరగతులు ఆరంభమయ్యాయి.”పరీక్షన్ సే పరాక్రమ్ – కాంగ్రెస్ విజయ్ సేన నిర్మాణ్” పేరుతో రెండు లక్షలమందికి శిక్షణ ఇవ్వాలనే సంకల్పంలో పార్టీ ఉంది. బ్రాహ్మణులను, అగ్రవర్ణాలను ఆకర్షించడానికి ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాహ్మణులు లేదా అగ్రవర్ణాలపై పార్టీలో ఎటువంటి వ్యతిరేకత లేదనే ప్రచారం పెంచాలని ఆమె నాయకులకు సూచిస్తున్నారు. బ్రాహ్మణుల వైపు మేము ఉన్నామనే భరోసాను కల్పించమని పార్టీ శ్రేణులకు ఆమె చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకూ 10మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులను నియమించిన ఘనత కాంగ్రెస్ కే చెందుతుందని ప్రచారం చేపట్టమని ప్రియాంక దిశానిర్దేశం చేశారు. పార్టీ వెబ్ సైట్ లో ప్రముఖంగా ప్రకటించమని ఆమె చెప్పారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతోంది. అదే విధంగా, అగ్రవర్ణాలపైనా అదే దృష్టి పెట్టారు. దళితుల సమస్యల పైన పోరాటానికి నడుం కట్టండని ఆమె చెప్పడం వెనకాల ఉన్న ఎన్నికల వ్యూహ రచన తెలుస్తోంది. శాసన సభా పక్షనేతగా ఆరాధనా మిశ్రాను ఎంపిక చేయడంలోనూ అదే తేటతెల్లమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తాజాగా చేసిన ప్రకటనతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రియాంక పాత్ర పెద్దఎత్తున చర్చకు తెరతీసింది. 2022- అసెంబ్లీ ఎన్నికలు ప్రియాంక గాంధీ నాయకత్వంలో జరుగుతాయాని ఆయన చేసిన ప్రకటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Also read: గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక
ప్రియాంక పోటీ చేస్తారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కూడా ఆమెదేననీ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన నేపథ్యంలో,రాష్ట్ర కాంగ్రెస్ లో అన్నీ ఆమెగానే మారిపోయారు. ప్రియాంక గాంధీ ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడ లేదు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకూ అందరూ లోక్ సభ స్థానంలోనే నిలబడ్డారు. ఒకవేళ అసెంబ్లీ కి పోటీచేస్తే ఆ కుటుంబం నుంచి అసెంబ్లీకి నిలుచున్న మొట్టమొదటి వ్యక్తి ఆమే అవుతారు. ఏ నియోజకవర్గం నుంచి నిలబడతారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి 12వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు మొన్న ప్రకటన వెలువడింది. ‘కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర’ పేరుతో అది సాగనుంది. పల్లెలు,పట్టణాలు, నగరాల్లో సాగే ఈ యాత్ర ప్రియాంక గాంధీ సారథ్యంలో జరుగనుంది. ఈ యాత్ర పార్టీకి ఊతమిచ్చే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. బిజెపి, సమాజ్ వాదీ పార్టీలను తట్టుకొని నిలబడడం అంత ఆషామాషీ కాదు. కాంగ్రెస్ -సమాజ్ వాదీల పొత్తు వ్యవహారం ఇంకా తేలలేదు. బిజెపి -బహుజన్ సమాజ్ మధ్య కొంత రహస్య బంధం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం, మాయావతి అంత బలంగా కనిపించడం లేదు. ఇదే ఊపు కొనసాగితే ప్రియాంక గాంధీ వల్ల ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.అధికారంలోకి వచ్చేంత బలం కష్టమేనని ఎక్కువమంది భావిస్తున్నారు. ప్రియాంక ‘హస్త’వాసి ఎలా ఉంటుందో వేచి చూద్దాం.
Also read: వీగిపోయిన అగ్రరాజ్యహంకారం