తెలిసో తెలియకో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు దీపం అని పేరు పెట్టింది. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్.. అంటే పెట్టుబడుల, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ. నిర్వహణ అనే పేరుతో అది చేసే పని మాత్రం ప్రజల ఆస్తులను తెగనమ్మడమే. 1991లో మొదలు పెట్టి ఇప్పటిదాకా ఏటేటా ప్రభుత్వ రంగంలో ఉన్న మన ఆస్తులను మనమే ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అమ్ముకుని ప్రభుత్వాలను నడుపుతున్నాం. ఇలా 2017-18 ఏడాదిలోనే అత్యధికంగా లక్ష కోట్ల రూపాయలను సంపాదించాం.
Also read: వన్ సైడెడ్ లవ్!
‘స్వదేశీ‘ నినాదప్రాయం
భారతదేశంలో 1991లో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు పరిపాలన సరళిని మార్చారు. అంతవరకు మనం అనుసరించిన నెహ్రూవియన్ సోషలిజం సూత్రాలకు మంగళం పాడి నూతన ఆర్థిక విధానాలను అమలులోకి తెచ్చారు. సారంలో అది ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడమే. మొత్తం ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయలను అలా పీవీ నరసింహారావు ప్రభుత్వం సంపాదించింది. అప్పటికి దేశం ఒక పెద్ద ఆర్థిక ఆపద నుంచి గట్టెక్కిందనే సంబరపడ్డాం. కాని దాని విపరిణామాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు బోధపడి పెద్ద కంపెనీల ప్రైవేటీకరణ అంటుంటే రోడ్డెక్కుతున్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఆ రోజు మనం గుర్తించలేక పోయాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే పదమూడు బ్యాంకులను రాత్రికి రాత్రి ప్రభుత్వపరం చేస్తూ నేషనలైజ్ నిర్ణయం తీసుకున్న ఇందిరాగాంధీ ఎప్పటికీ రాజకీయ యవనికపై కథానాయికగానే ఉంటారు. పీవీ హయాం తర్వాత దేశంలో కుదురైన రాజకీయ ప్రభుత్వం ఏర్పడడానికి సుమారు అయిదేళ్లు పట్టింది. 13వ లోకసభ కొలువు దీరిన తరువాత అటల్ బిహారి వాజ్ పేయి నేతృత్వంలో ఈ ప్రైవేటీకరణ ఊపందుకుంది. అరుణ్ శారి నేతృత్వంలో ఒక పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భారతీయ జనతా పార్టీ అదేపనిగా బిగ్గరగా చెప్పుకుంటూ వచ్చిన స్వదేశీ నినాదం కేవలం ఒక ముసుగుగా తేలిపోయింది. తర్వాతి ఐదేళ్లలో 29 వేల కోట్ల రూపాయల ఆస్తులను తెగనమ్మారు. విదేశీ నిధులను వెల్లువలాగా దేశంలోకి ప్రవహింపజేశారు. కానీ స్వదేశీ నినాదాన్ని మాత్రం జనాల మనసుల్లో తాజాగా నిలిపి ఉంచగలిగారు. అందుకుగాను కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల కోసం దుర్వినియోగం చేశారు.
Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం
దేశం, దేవుడు, భక్తి అనే మత్తులో ప్రజలను ముంచేయడం ద్వారా శాస్త్రీయ విజ్ఞానపు ఆలోచనలను సమాధి చేస్తూ వచ్చిన ప్రభుత్వానికి తర్వాతి ఎన్నికలలో ప్రజలు మంగళం పాడారు. రెండు దఫాలుగా కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించకున్నారు. అయినప్పటికీ ప్రైవేటీకరణ మాత్రం ఆగలేదు. దానికి రెండు కారణాలు చూపిస్తారు. మొదటిది, దేశానికి ఆర్థికంగా మద్దతు లభిస్తుందని. రెండోది. సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికని చెప్తారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య తదితర సామాజిక రంగాలకు పెద్ద ఎత్తున అవసరమవుతోన్న నిధులను సమీకరించడానికి గొప్ప మార్గం ప్రైవేటీకరణ. తన సంస్థల ఆస్తులలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆయా సంస్థలలో పోటీతత్వం, మార్కెట్ క్రమశిక్షణ అలవర్చడం సాధ్యమవుతుందని ప్రభుత్వాలు నమ్మబలుకుతున్నాయి. ఈ వాదనలనే మన తెలుగు రాష్ట్రాలలో జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ప్రచారంలో పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు ఫోన్ రావాలంటే నెలల తరబడి నిరీక్షించవలసి వచ్చేదని, ఇప్పుడు ప్రైవేటీకరణ తరువాత క్షణాల్లో ఫోన్లు దొరుకుతున్నాయని చెప్తుంటారు. కాని, టెక్నాలజీలో శరవేగంగా వస్తోన్న మార్పులను, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వినియోగదారులను, డిమాండ్ సప్లయిలను ఉద్దేశపూర్వకంగా మరుగున పడేస్తుంటారు.
Also read: అతనికెందుకు పగ!
చెప్పేదొకటి చేసేదొకటి
నరేంద్రమోడీ నేతృత్వంలో ఇప్పుడు రెండుసార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ప్రభుత్వం చెప్పే మాటలొకటి, చేసే పనులు మాత్రం వేరొకటి అనడానికి నిదర్శనంగా ఈ గణాంకాలు చూపించవచ్చు. మొదటి ఏడాది అంటే 2014లో ప్రజా సంస్థలలో వాటాలను మాత్రమే కాక, గుత్తగా సంస్థలను సైతం అమ్మడం మొదలు పెట్టింది. తద్వారా పాతిక వేల కోట్ల రూపాయలను మాత్రమే సంపాదిస్తే, 2019కల్లా పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సంపాదించిన సొమ్ము ఒక లక్షా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు నిండకుండానే మరో లక్షా యాభై వేల కోట్ల రూపాయలను సంపాదించింది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలను సంపాదించాలని లక్ష్యం నిర్దేశించుకుంది (ప్రభుత్వం సంపాదించే ధనం కంటే ఆ సంస్థల విలువ చాలా ఎక్కువ. ఒక రకంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు ఆసాములకు కారు చౌకగా అమ్మడమే). అందుకే ప్రధాని మోడీ ఎలాంటి శషభిషలు లేకుండా వ్యాపారం చేయడం ప్రభుత్వ ధర్మం కాదని మనసులో మాట బయటపెట్టారు. అంటే వ్యాపారం చేయాల్సింది గుజరాత్ బనియాలు లేదంటే విదేశీ వ్యాపారులు మాత్రమే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయన శెలవివ్వలేదు.
Also read: హ్యాష్ టాగ్ మోదీ
ఇలా ప్రభుత్వ పరిరక్షణలో ఉన్న ప్రజాసంపదను అప్పనంగా అమ్మేయడం ఒక కొత్త ట్రెండు. ఇదే ట్రెండును మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన జమానాలోనూ అనుసరించారు. అందుకనే ఆయనను ప్రపంచ బ్యాంకు ఒక గొప్ప విజనరీగా కీర్తించింది. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మేసేవారే వారి దృష్టిలో గొప్ప ఆర్థికవేత్తలు, విజనరీలు. ప్రభుత్వాలు నడపడానికి కావలసిన డబ్బు సంపాదన కోసం చేపట్టే ఈ పెట్టుబడుల ఉపసంహరణ గురించి అన్ని కుంటిసాకులు చెప్తున్నారు. ఆయా సంస్థల ఉద్యోగులు సరిగా పనిచేయరని, ఉద్యోగుల, కార్మికుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు ఆయా సంస్థలు అప్పుల లేదా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయని చెప్పే కబుర్లన్నీ అబద్ధాలేనని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేవలం డబ్బుకోసమే ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారని తెలుసుకుంటున్నారు. లాభాపేక్ష తప్ప ప్రజల గురించి కనీసం పట్టించుకోని కార్పొరేట్ సంస్థలు ప్రజలకు మేలు చేస్తాయని భావించడం మన అమాయకత్వమే అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశపు బహుజనులకు రాజ్యాంగం ప్రసాదించిన కానుక రిజర్వేషన్లను తుంగలో తొక్కే కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందడం నిమ్న కులాలకు కుదరని పని అవుతుంది. కేవలం అగ్రకుల అగ్రహారాలుగా ఈ సంస్థలు రూపాంతరం చెందుతాయి. ప్రజలు లేదా వినియోగదారులు కనీస సౌకర్యాలకు, హక్కులకు సైతం కోర్టు గుమ్మాలను ఆశ్రయించాల్సి వస్తుంది. పలుకుబడి, డబ్బు ముందు న్యాయం బాధితులకు అందుతుందన్న భరోసా లేదు. దీనివల్ల ప్రైవేటు సంస్థలు అతి ముఖ్యమైన అకౌంటబిలిటీ బాధ్యత నుంచి నిష్క్రమించే ప్రమాదముందని మనకు మనం చేసుకోవలసిన హెచ్చరిక.
అయితే, ప్రతి కొత్త సమస్యపై యుద్ధం కూడా సరికొత్తగా చేయాల్సిందే. ఈ ఎరుక మన ఉద్యమకారులకు రావాలి. నలుగురు నిరసన తెలిపే ప్రతి చోటకు చేరే ఎర్ర జెండాలు పాత పద్ధతిలోనే పోరు సలపమని నిర్దేశిస్తాయి. దానిని అమలు చేస్తే ఏ ఉద్యమానిదైనా అధోగతే. బహుజనుల ఉద్యమాలు సరికొత్త రూపంలో జరగాలి. పాత మూస పద్ధతులు, బందులు, రాస్తారోకోలు సమస్యలకు పరిష్కారాలు కాజాలవు. అది కేవలం మనల్ని మనం హింసించుకోవడమే కాగలదు.
Also read: మేలుకో జగన్!