- విద్యార్థులకూ,తల్లిదండ్రులకూ అవమానం
హైదరాబాద్ : కిందటి సంవత్సరం వచ్చిన కొవిడ్ సామాన్యుల జీవితాలను తలకిందులు చేసేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి అష్ట కష్టాలు పడ్డారు. స్కూళ్ళలో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అందినకాడికి దండుకుంటున్నాయి. క్లాసులు జరగకున్నా తరువాతి సంవత్సరానికి విద్యార్థిని ప్రమోట్ చేయాలంటే ఫీజు మొత్తం కట్టాల్సిందేనంటూ భీష్మించుకొని కూర్చున్నాయి. ఇపుడిపుడే గాడినపడుతున్న సామాన్యులు మళ్లీ మోయలేని ఆర్థికభారంతో కుంగిపోతున్నారు.
ఫీజు కోసం ఒత్తిడి :
బోయిన్ పల్లి ప్రైవేటు స్కూలుకు చెందిన 9 వ తరగతి విద్యార్ధినులు తమ తల్లిదండ్రులతో కలిసి పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సిన ఫీజును చెల్లించారు. అయినా స్కూల్ యాజమాన్యం వీరిని అవమానపరిచింది. ప్రోగ్రెస్ కార్డులను జారీ చేయడానికి తదుపరి తరగతికి పంపించేందుకు పూర్తి రుసుము చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: లక్షల హృదయాల్లో కోనప్ప. -ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
ఫీజు కట్టని విద్యార్థుల పట్ల ప్రైవేటు స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంది. సహవిద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందు ఫీజు కట్టలేదని దారుణంగా విద్యార్థినులనూ, వారి తల్లిదండ్రులనూ అవమానించారు. దీంతో అవమానభారంతో ఇద్దరు బాలికలు అకస్మాత్తుగా స్కూల్ నుండి వెళ్ళిపోయారు. మిస్సయిన విద్యార్థినుల తల్లి దండ్రులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సాయంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా ఈస్ట్ మారేడుపల్లిలోని షెనాయ్ నర్శింగ్ హోమ్ సమీపంలో బాలికల ఆచూకి లభ్యమయినట్లు పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి వి. వి. శర్మ తెలిపారు. బాలికలను బోయిన్ పల్లి సీఐ తల్లిదండ్రులకు అప్పగించారు. స్కూల్ యాజమాన్యం వేధింపులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇదే వ్యవహారంలో మరో విద్యార్థి తల్లిదండ్రులకు ఫీజు చెల్లించకున్నా పొరపాటున రిపోర్టు కార్డ్ జారీ చేశారు. తప్పు తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం రిపోర్టు కార్డును వెనక్కి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు.
Also Read: తల్లి దండ్రుల కన్నుగప్పుతున్న అమ్మాయిలు
ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేసి ట్యూషన్ ఫీజు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇపుడిపుడే స్కూళ్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఫీజు మొత్తం కట్టాలనడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ స్కూల్ పిల్లలు నయం. అవమానభారంతో యధాశ్వని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు వీళ్ళు కూడా అఘాయత్యం చేయలేదు.