భారతీయ థియేటర్ మార్గదర్శకుడు, హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రగామి పృథ్వీరాజ్ కపూర్ 1906 లో నవంబర్ 3 న జన్మించారు. పృథ్వీరాజ్ కపూర్ బాలీవుడ్ ప్రసిద్ధ కపూర్ కుటుంబానికి పితామహుడు. అతను పాకిస్తాన్లోని లియాల్పూర్ (ఇప్పుడు ఫైసలాబాద్)జిల్లాలోని సముంద్రి గ్రామం లో జన్మించాడు. పృథ్వీరాజ్ కపూర్ తన స్వస్థలమైన లియాల్పూర్ లోనూ, పెషావర్లలోనూ థియేటర్ ఆర్టిస్ట్ గా తన నటనా వృత్తిని ప్రారంభించాడు. 1928 లో పృథ్వీరాజ్ తన అత్త నుండి అరువు తెచ్చుకున్న కొంత డబ్బుతో బొంబాయికి (ఇప్పుడు ముంబై) వెళ్లి ఇంపీరియల్ ఫిల్మ్స్ కంపెనీలో చేరాడు.
ఆ సంస్థలో, అతను సినిమాల్లో చిన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. 1929 లో కపూర్ తన మూడవ చిత్రం ‘సినిమా గర్ల్’ లో మొదటి ప్రధాన పాత్రను పొందాడు.‘దో ధారి తల్వార్ ,’ ‘షేర్-ఎ-అరా బి,’ ‘ప్రిన్స్ విజయకుమార్’ వంటి తొమ్మిది నిశ్శబ్ద చిత్రాలలో పృథ్వీరాజ్ నటించారు. 1931 లో దేశంలోని మొట్టమొదటి టాకీ ‘ఆలం అరా’ విడుదలైంది. ఆ చారిత్రక చిత్రంలో కపూర్ సహాయక పాత్ర పోషించారు.
పృథ్వీ థియేటర్
ప్రఖ్యాత థియేటర్ నటుడిగా, పృథ్వీరాజ్ బ్రిటిష్ ప్లేహౌస్ అయిన గ్రాంట్ ఆండర్సన్ థియేటర్ కంపెనీలో చేరారు. అతను చేరిన వెంటనే కంపెనీ ఇంగ్లాండ్ కు మారింది.1946 లో పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీ థియేటర్స్ అనే థియేటర్ సంస్థను స్థాపించారు, పృథ్వీరాజ్ పృథ్వీ థియేటర్లలో పెట్టుబడులు పెట్టారు, ఇది భారతదేశం అంతటా చిరస్మరణీయమైన ప్రదర్శ నలను అందించింది. ఈ నాటకాలు అత్యంత ప్రభావవంతమైనవి, భారత స్వాతంత్ర్య ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి యువతను ప్రేరేపించాయి. 16 సంవత్సరాల కాలంలో ఈ థియేటర్ 2,662 ప్రదర్శనలను ప్రదర్శించింది. ఇందులో పృథ్వీరాజ్ ప్రధాన నటుడిగా నటించారు. 1996 లో థియేటర్ గోల్డెన్ జూబ్లీలో ఇండియన్ పోస్ట్ రెండు రూపాయల పోస్టల్ స్టాంప్‌ను జారీ చేసింది. భారతీయ సినిమా 100 సంవత్సరాల సందర్భంగా, అతని పోలికను కలిగి ఉన్న మరొక తపాలా బిళ్ళను ఇండియా పోస్ట్ 3 మే 2013 న విడుదల చేసింది. అతని ప్రసిద్ధ నాటకాల్లో ఒకటైన ఒక ముస్లిం, అతని హిందూ స్నేహితుడి కథతో 13 ఏప్రిల్ 1947 న ప్రారంభమైన “పఠాన్” నాటకం ముంబైలో దాదాపు 600 సార్లు వేదికపై ప్రదర్శించ బడింది. 1950 దశాబ్దం చివరి నాటికి ట్రావెలింగ్ థియేటర్ (సంచార రంగస్థలం) యుగం సినిమా ప్రభావ కారణంగా అంతిమ దశకు చేరుకుంది.
రంగస్థలం నుంచి సినిమాకి
క్రమంగా పృథ్వీ థియేటర్ కార్యకలాపాలను నిలిపివేసాడు. తన సొంత కుమారులతో సహా చిత్రనిర్మాతల నుండి అప్పుడప్పుడు ఆఫర్లను అంగీకరించాడు. తన కుమారుడు రాజ్‌తో కలిసి 1951 చిత్రం ‘అవారా’లో తన భార్యను తన ఇంటి నుండి బయటకు నెట్టివేసిన కఠినమైన న్యాయమూర్తిగా కనిపించాడు. తరువాత, పృథ్వీ థియేటర్ ఇండియన్ షేక్స్పియర్ థియేటర్ సంస్థ “షేక్స్పియెర్నా” తో విలీనం అయ్యింది. సంస్థ 5 నవంబర్ 1978 న ముంబైలో పృథ్వీ థియేటర్ ప్రారంభోత్సవంతో శాశ్వత గృహాన్ని పొందింది.
అతని చిత్రాలలో ఒకటి ‘కల్ ఆజ్ అవుర్ కల్’లో కపూర్ కుటుంబానికి చెందిన మూడు తరాలు – కుమారుడు రాజ్ కపూర్, మనవడు రణధీర్ కపూర్ మరియు పృథ్వీరాజ్ నటించారు.
‘ఆవారా’ ప్రత్యేకత
పృథ్వీరాజ్ తండ్రి, దేవాన్ బాషేశ్వర్నాథ్ కపూర్ కూడా రాజ్ కపూర్ చిత్రం ‘అవారా’లో అతిధి పాత్రలో నటించారు . ఈ విధంగా, కపూర్ కుటుంబం భారతదేశంలో ఐదు తరాల సినీ కళాకారులను కలిగి ఉన్న ఏకైక కుటుంబంగా మిగిలిపోయింది. ఆలం ఆరా (1931) (భారత మొదటి టాకీ సినిమా); విద్యాపతి (1937); సికందర్ (1941); ఆవారా (1951); ఆనంద్ మఠ్ (1952); పర్దేశీ (1957); మొఘల్ ఎ ఆజం (1960) (అక్బర్ చక్రవర్తి పాత్ర); జిందగీ (1964); ఢాకూ మంగళ్‌సింగ్ (1966); హీర్ రాంఝా (1970); కల్ ఆజ్ ఔర్ కల్ (1971); సాక్షాత్కార – (కన్నడ) (1971); తదితరాల్లో భిన్నమైన పాత్రలలో ప్రతిభ కనబరిచిన నటునిగా గుర్తింపు పొందారు. అతను పంజాబీ చిత్రాలలో నానక్ దుఖియా సబ్ సంసార్ (1970), మేలే మిత్రాన్ దే (1972) లలో కూడా నటించాడు .మొఘల్ ఎ ఆజం (1960)లో అక్బర్ పాత్ర మరువ లేనిది.
పద్మభూషణ్, రాజ్యసభ సభ్యత్వం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
1954 లో ఆయనకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్,1969 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేసింది. ఎనిమిదేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1972 మే 29న తన 70వ ఏట మరణించాడు. పృథ్వీరాజ్ కు కుమారులు షంషేర్ రాజ్ (షమ్మీ) మరియు బల్బీర్ రాజ్ (శశి) (వారు ప్రసిద్ధ నటులు, చిత్ర నిర్మాతలుగా మారారు), కుమార్తె ఉర్మిలా సియాల్. 1949– రాష్ట్రపతి మెడల్; 1954– సంగీత నాటక అకాడమీ; ఫెలోషిప్. (సంగీత నాటక అకాడమీ ద్వారా); 1956– సంగీత నాటక అకాడమీ అవార్డు (సంగీత నాటక అకాడమీ ద్వారా); 1969– భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డులను అందు కున్నారు. ఆయనకు మరణానంతరం 1971 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
(నవంబర్ 3 పృథ్వీ రాజ్ కపూర్ జన్మదినం)