- విజయ్ హజారే టోర్నీలో పృథ్వీషా సూపర్ డబుల్
- భారత 8వ ద్విశతక వీరుడు పృథ్వీ
దేశవాళీ వన్డే క్రికెట్ ( విజయ్ హజారే ట్రోఫీ )లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొనగాడిగా నిలిచాడు. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2021 విజయ్ హజారే టోర్నీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ప్రథ్వీ షా 227 పరుగులతో ద్విశతకం బాదాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకూ కేరళ ఆటగాడు సంజు శాంసన్ పేరుతో ఉన్న 212 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును పృథ్వీ అధిగమించాడు. ఈ క్రమంలో లిస్టు ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన భారత 8వ క్రికెటర్ గా పృథ్వీ రికార్డుల్లో చేరాడు. గతంలో ఇదే ఘనత సాధించిన ఆటగాళ్ళలో మాస్టర్ సచిన్, బ్లాస్టర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శిఖర్ ధావన్, కర్ణ్ కౌశల్ ఉన్నారు.
Also Read: డే-నైట్ టెస్టు తొలిరోజునే వికెట్లు టపటపా
ఇంగ్లండ్ తో సిరీస్ కోసం కొద్దిరోజుల క్రితమే ఎంపికైన ఐపీఎల్ హీరో సూర్యకుమార్ యాదవ్ సైతం పృథ్వీతో కలసి వీరవిహారం చేశాడు. సూర్యకుమార్ కేవలం 58 బంతుల్లోనే 133 పరుగులు సాధించాడు. 22 ఫోర్లు, 4 సిక్స్‌లతో శతకం సాధించడమే కాదు. పృథ్వితో కలిసి మూడో వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరి జోరుతో ఈ మ్యాచ్‌లో ముంబై 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 457 పరుగులు చేయడం విశేషం. 21 సంవత్సరాల పృథ్వీ షాకు భారత్ తరపున 5 టెస్టులు, 5 వన్డే మ్యాచ్ లు ఆడిన ఘనత ఉంది.
Also Read: వారేవ్వా!…మోతేరా!