- పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
- గ్రామస్వరాజ్యం స్థాపించాలని పిలుపు
- రసాయనాల నుంచి మాతృభూమికి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ-కశ్మీర్ లో పర్యటించారు. ఆదివారం నాడు జరిగినఈ పర్యటన పలు ప్రాధాన్యతలను సంతరించుకుంది. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. రసాయనాల నుంచి మాతృభూమికి విముక్తి కల్పించాలని, గ్రామస్వరాజ్యాన్ని సుస్థాపించి, ప్రజాస్వామ్యాన్ని పాలనలో సుస్థిరపరచాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పర్యటన, ప్రకటనలు రెండూ అభినందనీయమే.
Also read: కరోనా మహమ్మారి కాటేస్తుంది జాగ్రత్త!
చట్టాలు సవ్యంగా అమలు జరిగితే కావల్సిందేముంది?
నిజంగా ఇవన్నీ నూటికి నూరు శాతం ఆచరణకు నోచుకుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? ఇంకా తుపాకీ నీడలోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న కశ్మీర్ వాసుల కష్టాలు తీరి, శాంతివీచికల నడుమ, ప్రగతిబాట పడితే.. అది జాతి హర్షించే పరిణామం. సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు బలంగా పడాలని, రసాయనాలకు పూర్తిగా దూరమవ్వాలని నిపుణులు ఎప్పటి నుంచో ఘోషిస్తున్నారు. ఇవన్నీ గ్రామపంచాయతీల స్థాయి నుంచి ప్రారంభమవ్వడానికి అందరూ చేతులు కలిపి సాగాలని ప్రధాని నరేంద్రమోదీ కోరుకుంటున్నారు. పూర్వ ప్రధానులు నెహ్రు, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వంటివారు కోరుకున్నది కూడా పంచాయతీల స్వయంపరిపాలన, స్వేచ్ఛాయుత ప్రవర్తన, ప్రగతులే. ఈ దిశగా వారు బలమైన ప్రయత్నాలు చేశారు. గట్టి పునాదులు వేయడానికి ఎంతో శ్రమించారు.రాజ్యాంగ సవరణలకు జై కొట్టారు. బలవంత్ రాయ్ మెహతా వంటి నాయకులు అద్భుతమైన సూచనలు చేశారు. ‘పంచాయతీ రాజ్’ అంటే సూక్ష్మంగా చెప్పాలంటే గ్రామీణ స్వపరిపాలన (స్థానిక స్వపరిపాలన). ‘గ్రామ స్వరాజ్యం’ అంటూ మహాత్మాగాంధీ అనేకసార్లు నినదించారు. దేశపాలన గ్రామాలతోనే మొదలవుతుంది. కొన్ని లక్షల గ్రామాల సమాహారమే భారతదేశం. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యానికి సుమారు 1919 ప్రాంతంలోనే కొత్త చట్టాలను తెచ్చారు. మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు తొలిగా రాజస్థాన్ వేదికయ్యింది. రెండో దానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా నిలిచింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో,1959 నవంబర్ 1 వ తేదీనాడు ఈ వ్యవస్థ రూపుదాల్చుకుంది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గ్రామ సచివాలయం’ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ తరహా వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఇందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందాన్ని అభినందించి తీరాల్సిందే. కాకపోతే, ఆచరణలో అనుకున్న ఫలితాలను ఇంకా రాబట్టాల్సివుంది. మొత్తంగా చూస్తే దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆశాజనకంగా లేదనే నిపుణులు విమర్శిస్తున్నారు.
Also read: మెరుగవుతున్న భారత్-బ్రిటన్ సంబంధాలు
అదికార వికేంద్రీకరణ ప్రజాస్వామ్యసారం
ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణ గొప్ప అధ్యాయం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు గ్రామాలకు చేరడంలో సంపూర్ణమైన ఫలితాలు రావడం లేదన్నది పచ్చినిజం. ‘నిధులు – విధులు- హక్కులు’ సాధించడంలో సర్పంచ్ లకు సంపూర్ణమైన స్వేచ్ఛ లేనే లేదు. ఒకప్పుడు పంచాయతీ సమితి అధ్యక్షులుగా చేసినవారే, తదనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులుగా కూడా పదోన్నతులు పొందారు. పరిపాలనా వ్యవస్థలను క్షేత్రస్థాయి నుంచి అధ్యయనం చేసిన వారి అనుభవం పరిపాలనకు ఎంతో కలిసివచ్చేది. మారుతున్న రాజకీయ వాతావరణంలో పాలనా అనుభవం లేనివారు, గ్రామీణ వ్యవస్థలపై సమగ్రమైన అవగాహన లేనివారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా వస్తున్నారు. ఒకప్పుడు స్టాండింగ్ కమిటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా ఉండేవారు. ప్రస్తుతం వారు కేవలం సభ్యులుగానే ఉంటున్నారు. జెండాలకు,రాజకీయ అజెండాలకు అతీతంగా ఉండాల్సిన గ్రామీణ స్వపరిపాలనా వ్యవస్థలో అంతటా రాజకీయమే రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల ప్రతినిధుల పెత్తనమే గ్రామ పంచాయతీల్లో బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, అధికారుల పాత్ర కూడా పరిమితమై పోతోంది. పరిపాలనపై రాజకీయాలే స్వారీ చేస్తున్న నేపథ్యంలో, పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇంకా బలంగా రూపాంతరం చెందలేదనే చెప్పాలి. అత్యంత ప్రాచీనమైన గ్రామ పాలనా వ్యవస్థ నేడు కుంటినడకలు వేస్తోంది.
Also read: సంప్రదాయవైద్యం దేశానికి ఆయువుపట్టు
కనీస వసతులు లేని గ్రామాలు కోకొల్లలు
ఇప్పటికీ రోడ్లు,బస్సు సౌకర్యం, విద్యుత్,పాఠశాలల నిర్మాణం, డ్రెయినేజ్ మొదలైన మౌలిక వసతులు సక్రమంగా లేక అష్టకష్టాలు పడుతున్న గ్రామాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. గ్రామీణ భారతం, తద్వారా భారతదేశం బాగుపడాలంటే ‘పంచాయతీరాజ్’ వ్యవస్థను పునఃసమీక్ష చేసి, ప్రక్షాళన చెయ్యాలి. గ్రామపంచాయతీలకు నిధులు అందడంలోని అన్యాయానికి చరమగీతం పాడాలి. నిధుల వాడకంలో స్వేచ్చాస్వతంత్రాలను కల్పించాలి.హక్కుల పరంగా సర్పంచ్ లు సర్వశక్తివంతులవ్వాలి. వీటన్నిటిని సాధిస్తే, ప్రధానిగా నరేంద్రమోదీ చరిత్రలో మిగులుతారు. అఫ్ఘాన్ ఉగ్రవాదుల నుంచి పెనుముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ-కశ్మీర్ లో పర్యటించడం సాహసమే. అక్కడ సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో, దేశంలోనే తొలిసారిగా కర్బన్ రహిత సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ‘గ్రామ్ ఊర్జా స్వరాజ్’ కార్యక్రమంలో భాగంగా ఈ స్థాపన జరిగింది.ఈ పథకం ఇంకా విస్తృతంగా అమలు కావాల్సిఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, గ్రామ స్వపరిపాలన జమ్మూ-కశ్మీర్ లో ఇంకా బలంగా నిర్మాణమవ్వాలి. ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షలు, ఆశయాలు నవభారత నిర్మాణానికి పునాదులు వేస్తే, అందరూ హర్షిస్తారు.
Also read: కొత్త రాష్ట్రపతిపై ఊహాగానాలు