Friday, November 22, 2024

సకాలంలో జమ్మూ-కశ్మీర్ కు తిరిగి రాష్ట్ర ప్రతిపత్తి:ప్రధాని

  • ప్రధాని హామీ ఇచ్చినట్టు సమాచారం
  • నియోజకవర్గాల పునర్విభజన జరగాలి
  • క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం బలపడాలంటూ మోదీ ట్వీట్

దిల్లీ: జమ్మూ-కశ్మీర్ ప్రధాన రాజకీయ నాయకులతో ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో గురువారంనాడు మూడు గంటలపాటు సమాలోచనలు జరిపారు. జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్రప్రతిపత్తి తిరిగి త్వరలోనే వస్తుందని, అందుకు సమయం రావాలని అన్నారు. ‘దిల్లీకీ దూరీ’నీ, ‘దిల్ కీ దూరీ’నీ తొలగించడం గురించి ప్రధాని మాట్లాడారు.

జమ్మూ-కశ్మీర్ ప్రధాన రాజకీయ స్రవంతికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులుగా  హాజరైన పధ్నాలుగు మంది నాయకులతో మోదీ చర్చలు జరిపారు. 2019లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీతో తెగతెంపులు చేసుకొని రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం దరిమిలా రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూ-కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత రాష్ట్రాలుగా ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్ ఒక కేంద్ర పాలితప్రాంతంగానూ, లదాఖ్ రెండవ కేంద్ర పాలిక ప్రాంతంగానూ ఉనికిలోకి వచ్చాయి.

సముచితమైన సమయంలో రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు అభిజ్ఞవర్గాల సమాచారం. ఎన్నికలు జరగడానికి వీలుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రాజకీయ నాయకులను ప్రధాని కోరారు. చర్చలలో పాల్గొన్న నాయకులలో చాలామంది ఇందుకు అంగీకరించినట్టు సమాచారం.

ప్రజాస్వామ్య విధానాన్ని పటిష్టం చేయడంపైన చర్చ కేంద్రీకృతమైంది. జమ్మూ-కశ్మీర్ లో ప్రజాస్వామ్య విధానానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ ప్రకటించారు. ‘‘టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడుకోగలగడమే మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని బలం. ప్రజలే, ముఖ్యంగా యువజనులే వారి ఆశలూ, అభిలాషలకు అనుగుణంగా జమ్మూ-కశ్మీర్ కి రాజకీయ నాయకత్వం అందించాలని నేను నాయకులకు చెప్పాను,’’ అని ట్విట్టర్ లో ప్రధాని రాశారు. 01 ఆగస్టు 2019న జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులూ, తండ్రికొడుకులూ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులూ ఫారుఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. మూడు రోజుల తర్వాత 04 ఆగస్టు 2019న తమను అరెస్టు చేసి, జమ్మూ-కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసినట్టు పార్లమెంటులో ప్రకటించడంతో తండ్రీకొడుకులు నివ్వెరపోయారు.

జమ్మూ-కశ్మీర్ లో మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడటం నాయకులందరికీ అసంతృప్తి కలిగిందనీ, ఇతర రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగవలసి ఉండగా జమ్మూ-కశ్మీర్ లో మాత్రం ఇప్పుడే ఎందుకు జరగాలని అంటున్నారని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ వద్దని తాము ప్రధానికి స్పష్టంగా చెప్పామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికీ, కశ్మీర్ కీ మధ్య విశ్వాస బంధం తెగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఫారుఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల నాయకత్వంలోని గుప్కార్ కూటమిలో ఏడు పార్టీలు ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్ కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలనీ, ప్రత్యేక ప్రతిపత్తిని కూడా పునరుద్దరించాలనీ గుప్కార్ కూటమి డిమాండ్ చేసింది. ‘నెలలు పట్టనీయండి, సంవత్సరాలు పట్టనీయడం. మేము 370 వ అధికరణ పునరుద్ధరించడంకోసం పోరాడతాం. ఈ ప్రత్యేక హోదా మాకు పాకిస్తాన్ నుంచి రాలేదు. ఇండియా నుంచి వచ్చింది. నెహ్రూ ఇచ్చారు. ఈ విషయంలో రాజీ ప్రసక్తి లేదు,’ అని మెహబూబా స్పష్టం చేశారు.

చర్చలో పాల్గొన్న నాయకులందరి మాటలనూ ప్రధాని నరేంద్రమోదీ ఆలకించారనీ, సభికులందరూ తమ అభిప్రాయాలను సూటిగా, నిస్సంకోచంగా చెప్పినందుకు సంతోషం వెలిబుచ్చారనీ అభిజ్ఞవర్గాలు తెలిపాయి. 370వ అధికరణ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిశితంగా విమర్శించిన నాయకులతో 2019 ఆగస్టు తర్వాత ప్రధాని మాట్లాడటం ఇదే ప్రథమం. అప్పుడు తెచ్చిన సమూలమైన మార్పులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించే అవకాశం ఇవ్వకుండా అమలు చేసిన భద్రతాచర్యలలో భాగంగా ఈ 14మంది నాయకులలో చాలామందిని నిర్బంధించారు. రాజకీయ ఖైదీల పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూ-కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని కూడా ఈ సమావేశంలో చెప్పారు.

2020 డిసెంబర్ లో జమ్మూ-కశ్మీర్  లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. గుప్కార్ కూటమికి వందకు పైగా స్థానాలు దక్కగా, బీజేపీ 74 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ప్రధాని నివాసంలో జరిగిన సమవేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles