Thursday, November 7, 2024

మాటలకూ, చేతలకూ తగ్గని అంతరం

  • తన ప్రభుత్వానికి మంచి సర్టిఫికేట్లు ఇచ్చుకున్న మోదీ
  • ఆర్థిక, వ్యవసాయక సంస్కరణలు భేష్
  • మరో నాలుగేళ్ళలో మనది 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ : ప్రధాని విశ్వాసం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ భారతదేశ ప్రగతి చాలా ఉజ్వలంగా ఉందని, ఉంటుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో మన పాత్ర అద్భుతం అని సమాధానం చెప్పారు. 2024 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతమవుతుందని, చాలా బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థ ఆదర్శవంతంగా సాగుతోందని కితాబు ఇచ్చారు.

సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తాయి: మోదీ అభయం

వ్యవసాయంలోనూ, కార్మిక రంగంలోనూ తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.కరోనా వంటి కష్టకాలంలో, విపత్తుల్లో పేదవాడికి ప్రభుత్వం అందించిన చేయూత అద్భుతమైనదని, ఆత్మతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి,  తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందని సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే, ఆశించిన అభివృద్ధి జరగదని తెలిపారు.

పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాల పాత్ర

పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని సూచించారు.చేయాలనుకున్న మేలు, చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని, ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్ డి ఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. లక్షలాది మంది ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేయగలిగామనే ఆత్మతృప్తి తనకు ఎంతో ఉత్సహాన్ని, శక్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రభుత్వం మాత్రమే చేసిన చారిత్రక చర్య అని తెలిపారు. ఇలా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన భావాలను, అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను, సంకల్పాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో, ఇంకా సంధించాల్సిన చాలా ప్రశ్నలు సంధించలేదని చెప్పాలి.

వాస్తవానికి కొన్ని దగ్గరగా, మరికొన్ని దూరంగా…

ప్రధాని చెప్పిన జవాబుల్లోనూ ఇంకా విస్తృతి వుంటే బాగుండేది. త్వరలో మరికొన్ని ఇంటర్వ్యూల పరంపర జరుగవచ్చని భావిద్దాం. ప్రధానమంత్రి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను  సమీక్ష చేసుకుంటే, కొన్ని వాస్తవానికి దగ్గరగానూ, కొన్ని దూరంగానూ ఉన్నాయి.సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, మరణాల సంఖ్యను అదుపులో ఉంచడంలోనూ, పరీక్షలు జరపడంలోనూ మంచి ఫలితాలే వచ్చాయి. ముందుజాగ్రత్త చర్యలు, హెచ్చరికలు  చేపట్టకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఎన్నో అనర్ధాలు జరిగాయి. ముఖ్యంగా వలసకార్మికులు పడిన కష్టాలు, పోగొట్టుకున్న ప్రాణాలు, కోల్పోయిన ఉపాధి వర్ణనాతీతం. లాక్ డౌన్ వల్ల ఆరోగ్యపరంగా కొంత రక్షణ పొందాం.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గడ్డుకాలం లేదు

సమాంతరంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదు. గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చిన దశ కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరాన్ని పరిశీలిస్తే, ఇప్పటి వరకూ రెండు క్వార్టర్లు ముగిసాయి. మూడవ క్వార్టర్ లో ఇప్పుడే అడుగుపెట్టాం. జి.డి.పిలో ఇప్పటి వరకూ సగటుగా దాదాపు 25శాతం నష్టపోయాం. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుండీ కొంత ప్రగతి నమోదవుతూ వస్తోంది. మొదటి క్వార్టర్ (త్రైమాసికం) కంటే రెండవ క్వార్టర్ లో అభివృద్ధి ప్రారంభమైంది. ఇది కొంత మంచి పరిణామమే. నిర్మాణం, ఉత్పత్తి రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ధిక లావాదేవీలు ఇంకా ఎంతో ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఇంకా ఆరోగ్యదాయకంగా లేదు.

మనతో పాటు అమెరికా, చైనా

కరోనా ప్రభావంతో తోటి దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా, చైనా రెండూ ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.ఐనప్పటికీ, చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు తెగిపోతూ ఉండడం వల్ల, దీని ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడింది.ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం.అదే విధంగా “మేక్ ఇన్ ఇండియా” ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. కాబట్టి, ఈ పరిణామాల వల్ల మూల్యం చెల్లించుకుంటున్నాం. ఇంత గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగం.అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది.

వ్యవసాయంపై ఇతోధిక శ్రద్ధ అవసరం

యత్ర  నార్యంతు పూజ్యతే… అన్నట్లుగా, ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దాన్ని గుర్తించి, వ్యవసాయాన్ని విస్తరించాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా చాలా వ్యతిరేకత వస్తోంది. నిపుణులతో చర్చలు జరిపి, దీన్ని పునః సమీక్షించుకోవాలి. ఆహార రక్షణపై  (ఫుడ్ సెక్యూరిటీ) శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై ఏలినవారు ఎంత వరకూ దృష్టి పెట్టారన్నది పెద్ద ప్రశ్న. స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన  సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన జి ఎస్ టి బకాయిలపై కేంద్రం చెప్పేవి మాటల గారడీ మాత్రమేనని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పాతికేళ్ళకోసారి పెను మార్పులు

రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏమాత్రం ఉందన్నది సందేహమే. థామస్ రొబెట్ మాల్టస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 150ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని, వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించాడు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా, మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నామన్నది అక్షర సత్యం. ఆ మహనీయుని మాటలు వెలకట్టలేనివి.

మోదీ సంకల్పం మంచిదే…

భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం, పూజనీయం. 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధాని మహదాశయం.కరోనా వ్యాప్తిని, మరణాలను నివారించాలన్నది దేశాధినేత సంకల్పం.కరోనా దుష్ప్రభావాలు, కష్టాల నుండి భారత్ ను అత్యంత త్వరగా బయటపడవేయాలన్నది ప్రధాని ప్రధాన ఎజెండా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రపంచ పరిణామాలను గమనిస్తే, 2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే? అది గొప్ప ప్రగతి, సందర్భమని ఆర్ధిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాని సంకల్పిస్తున్నట్లుగా 5 ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. నిజంగా అది సాధిస్తే, నరేంద్రమోదీ చరిత్రలో నిలుస్తారు. తథాస్తు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles