- విశాఖకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు
- స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రో
- ట్రామ్ కారిడార్ ఏర్పాటు
- విశాఖ వాసులకు పోలవరం నుంచి నీరు
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ పరిపాలనా రాజధానిపై దూకుడు పెంచినట్లు కనిపిస్తోందిచిన్న చిన్న సమస్యలు ఉన్నా సీఎం జగన్ మొక్కవోని ధైర్యంతో పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా విశాఖకు సరికొత్త హంగులు అద్దేందుకు సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అప్రతిహత విజయాలను కట్టబెట్టిన ప్రజలకు మరింత సేవ చేయాలని జగన్ భావిస్తున్నారు.
13 మండలాల విలీనం:
విశాఖ జిల్లాలో గిరిజనేతర ప్రాంతం మొత్తాన్నీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (మార్చి 23) ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రావికమతం, బుచ్చయ్యపేట, నాతవరం, కె.కోటపాడు, దేవరపల్లి, మాకవరపాలెం, కోటవురట్ల, గొలుగొండ, రోలుగుంట, చీడికాడ మండలాల పరిధిలోని 431 గ్రామాలను వీఎంఆర్ డీఏలో చేర్చుతూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
విశాఖకు మణిహారంగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు:
బీచ్ కారిడార్ ప్రాజెక్టుతో పాటు భోగాపురం విమానాశ్రయం, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలించడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణతో కలిపి సుమారు 1,167 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. రానున్న 30 ఏళ్లపాటు విశాఖలో ప్రజల నీటి అవసరాలను తీర్చేలా పైపులైను నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు ప్రతిపాదించిన మెట్రోకు 76.9 కి.మీ. నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 స్టేషన్లు ఉంటాయని, దీంతోపాటు 60.2 కి.మీ. మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎంకు వివరించారు. మెట్రో నిర్మాణానికి 14 వేల కోట్లు, ట్రామ్ సర్వీసులకు మరో 6 వేల కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అధికారులు సీఎంకు సవిరంగా వివరించారు.
చక చకా పనులు :
పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే విషయంలో సీఎం జగన్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వారంలోనే 13 మండలాల పరిథిలోని 431 గ్రామాలను వీఎంఆర్ డీఏలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వివిధ కీలక శాఖల అధిపతులను విశాఖ పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు తమకు అనువుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. కొత్త రాజధానిలో ఎప్పటి నుండి పాలన ప్రారంభించాలనే దానిపై సీఎం జగన్ పక్కా వ్యూహంతో వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా మంగళగిరి, తాడేపల్లి
మే 30తో రెండేళ్ల పాలన పూర్తి :
మే 6 వ తేదీనుంచి అన్ని శాఖలు విశాఖపట్నం నుంచి పనిచేయడానికి కావాల్సిన ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. మే 30 నాటికి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తవుతుంది.ఈ నేపథ్యంలో మే మొదటివారంలో విశాఖలో వివిధ శాఖలను ప్రారంభిస్తే మూడో ఏడాది నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించినట్లవుతుంది.
త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు:
ఈ లోపు ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి 31 ముగియనుంది. కొత్త ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టాక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వైపు మే 2 నాటికి తిరుపతి ఉపఎన్నిక ఫలితం కూడా రానుంది. ఇక అన్ని ఎన్నికలు పూర్తయితే విశాఖ పట్నం నుంచి పరిపాలన ప్రారంభించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
న్యాయ, పరిపాలనా రాజధానుల మధ్య విమాన సర్వీసులు:
శాసన రాజధాని అమరావతికి సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఇప్పటికే ఉంది. న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్ అందుకనుగుణంగా ఓర్వకల్లులో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఇక్కడి నుండి ఈ నెల 28న ప్రారంభం కానున్న తొలి విమాన సర్వీసు కర్నూలు నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికే నని తెలుస్తోంది.
Also Read: ఎన్నికల నిర్వహణకు సమయం లేదు మిత్రమా!