ప్రజాస్వామ్య విలువలకు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని, అందుకు స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ అవసరమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. క్రమశిక్షణరాహిత్యం, అమర్యాదరకర భాషా ప్రయోగం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. ప్రజలు తమ ప్రతినిధుల నుంచి క్రమశిక్షణను ఆశిస్తారని అన్నారు. గుజరాత్ లోని నర్మదా జిల్లా కేవడియాలో బుధవారం ప్రారంభమైన అఖిల భారత సభాపతుల 80వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. చట్టసభల్లో ఆరోగ్యవంతమైన చర్చలు జరిగేలా సభాపతులు చొరవ చూపాలనీ,అధికార విపక్షాల సమన్వయం, పరస్పర సహకారంతోనే ప్రజాస్వామ్యం పరిఢివిల్లుతుందనీ,తద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందనీ రాష్ట్రపతి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ కర్తవ్యంగా ప్రజాప్రతినిధుల గుర్తించాలని సూచించారు.
మూడు వ్యవస్థలు సమానమే..కానీ…: వెంకయ్య
రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలు సమానమేనని, అవి సామరస్యపూర్వక సమమన్వయంతో పని చేయవలసి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కానీ అవి తమ పరిధులు అతిక్రమిస్తున్నాయా? అనిపి స్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. శాసన, కార్యనిర్వాహక విభాగాల్లోకి చొరబ డేందుకు న్యాయవ్యవవస్థ ప్రయత్నిస్తోందా అనిపిస్తోందనీ, కొన్ని సందర్భాలలో శాసన వ్యవస్థ కూడా రేఖ దాటుతోందనీ వెంకయ్యనాయడు అన్నారు.
స్వయం నిర్ణయాలతో ఆత్మవిశ్వాసం: మోదీ
నూతన విద్యా విధానం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగు తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రభుత్వం ఇటీవల రూపొందించిన విద్యావిధానంపై సమగ్ర చర్చ, సూచనలు అవసరమని బుధవారం లక్నో విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ఈ విద్యా విధానంలోని అంశాలను క్షుణ్ణంగా చర్చించిన మీదట తక్షణ అమలుకు సహకరించాలని ఉపాధ్యాయ, విద్యార్థిలోకాన్ని కోరారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో భాగంగా, లక్నో విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం చిహ్నంగా తపాలా బిళ్ల, కవర్, నాణెం విడుదల చేశారు.
ఆంక్షలే….లాక్ డౌన్ లేదు
కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుత అన్ లాక్-5 నిబంధనలు ఈ నెల30వ తేదీతో ముగుస్తాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు, రాత్రివేళల్లో కర్య్ఫూ విధించుకోవచ్చు. లాక్ డౌన్ లు అవసరం లేదని తెలిపింది. అయితే కేంద్ర హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు జారీ చేసిన నిబంధనలు. ప్రామాణికాలను పాటించవలసి ఉంటుంది.
తాజా మార్గదర్శకాల ప్రకారం……
అంతరాష్ట్ర రాకపోకలు, సరుకుల రవాణాపై ఆంక్షలు ఉండవు.
వారంలో పధి శాతానికి మించి పాజిటివ్ రేటు నమోదు కాకుండా ఉండేలా కార్యాలయాల పనివేళలను నిర్ణయించాలి.
అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 65ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు వారు, గర్భిణీలు అత్యసవరమైతే తప్ప ఇళ్లకే పరిమితం కావాలి.
50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు నిర్వహించుకోవచ్చు. విద్య, వినోద, సామాజిక, మత, క్రీడాపరమైన కార్యక్రమాలను 50 శాతం హాల్ సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చు. నాలుగు గోడల మధ్య అయితే గరిష్ఠంగా 200 మందికే అనుమతి ఉంటుంది. కోవిడ్ ఎక్కువగా ఉన్న చోట్ల ఈ సంఖ్య సగానికి పరిమితమవుతుంది.