- అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు సరిపోతాయి
- ప్రాథమిక రక్షణ చర్యలు మాత్రం నిర్లక్ష్యం చేయరాదు
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 16 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ (గురువారం) నమోదైన కేసుల సంఖ్య 1013 గా తెలుస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 609 కేసులు నమోదైనట్లు సమాచారం. కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరణాలపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఇప్పటివరకూ చూస్తే,దేశంలో మొత్తంగా 3368 యాక్టివ్ కేసులు వున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని, కేసుల తీరును గమనిస్తే అత్యధిక కేసులు కర్ణాటకలో, అత్యల్పంగా ఉత్తరాఖండ్ లో నమోదై వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 189, కేరళలో 154 కేసులు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ వైరస్ వ్యాప్తి మొదలైంది. ఈ జె.ఎన్ -1 వేరియంట్ ను ‘వేరియంట్ అఫ్ ఇంట్రెస్ట్’ ప్రపంచ ఆరోగ్య సంస్థగా (డబ్ల్యూ హెచ్ ఓ ) అభివర్ణిస్తోంది. ఈ వేరియంట్ లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ముప్పు శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య సంస్థ ధైర్యాన్ని అందిస్తోంది.అదే సమయంలో, రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేస్తోంది.జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) నెల రోజుల క్రితం దేశంలోని మూడు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాప్తిలో వుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలకు పాకింది. దీనిని మనం గమనంలో ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం 189 కేసులు నమోదు కావడం గమనార్హం. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే.
Also read: జమిలి ఎన్నికలు జరిగేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు వరుసలో…
గతంలో, కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం. ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, తగిన చర్యలు ప్రారంభించింది. కాకపోతే చలికాలం, పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళ, కర్ణాటకలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇది మంచి పనే. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం – కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Also read: లక్షద్వీప్ వైపు లక్షలమంది చూపు!
కొత్త వేరియంట్ కి వైద్యం అందుబాటులో ఉంది
కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే,ప్రభుత్వం, నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. పరీక్షలు పెంచడం,వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలి. యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. ఐనా, యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది.
Also read: ఆంధ్రమేవ జయతే!
యోగ, వ్యాయామం శ్రేయస్కరం
కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది. అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం, శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం, నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం.
Also read: సంస్కృత భాష భవిత?