- 16న లాంఛనంగా ప్రారంభించనున్న మోదీ
- ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
- టీకా తీసుకున్నా మాస్క్ తప్పనిసరి
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని రాష్ట్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా నిర్ధేశించిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు టీకాల రవాణా జరుగుతోంది. అయితే జనవరి 16న ప్రారంభం కానున్న వాక్సినేషన్ లో తొలిరోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2934 కేంద్రాలలో ఈ వాక్సినేషన్ అందుబాటులో ఉండనుంది. ప్రతికేంద్రంలో వంద మందికి టీకాలు ఇచ్చే విధంగా ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పటిష్ట భద్రత నడుమ టీకాలు:
వ్యాక్సిన్ పంపిణీని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16 న లాంఛనంగా ప్రారంభిస్తారు. వాక్సినేషన్ కు కావాల్సిన టీకాలను దేశవ్యాప్తంగా ముందుగా నిర్ధారించిన 12 కేంద్రాలకు తరలించి సురక్షితంగా భద్రపరిచారు. వ్యాక్సినేషన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్త్లలపై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచనలు చేసింది. అవసరానికంటే 10% టీకా డోసులను అదనంగా ఉంచుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను అవసరాన్నిబట్టి పెంచుకుంటూ వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
ఇది చదవండి: కార్గో విమానాల్లో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వాక్సిన్ సరఫరా
దేశంలో అత్యవసర వినియోగం కింది కొవాగ్జిన్, కొవిషీల్డ్ వాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిలో తమకు నచ్చిన టీకాను ఎంచుకునే సౌలభ్యం ప్రస్తుతం లబ్ధిదారులకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలిదశ వాక్సినేషన్ లో భాగంగా కోటి మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకు అవసరమైన 1.65 కోట్ల డోసులను ప్రభుత్వం టీకా కేంద్రాలకు తరలించింది. వీటిలో 1.10 కోట్ల కొవిషీల్డ్ డోసులు కాగా, మరో 55 లక్షల భారత్ బయోటెక్ కొవాగ్జిన్ డోసులని అధికారులు తెలిపారు.
వాక్సిన్ తీసుకున్నా అప్రమత్తత తప్పనిసరి:
కరోనా వ్యాక్సిన్ ను రెండు డోసులుగా ఇవ్వనున్నారు. మొదటి డోసుకు ఇచ్చిన 28 రోజుల తరువాతే రెండో డోసు ఇవ్వనున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తరువాతే దాని ప్రభావం ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. టీకాలు తీసుకున్నా అజాగ్రత్తగా ఉండరాదని తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది చదవండి: టీకాల అనుమతిపై రాజకీయ వివాదం