ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ, అప్రమత్తంగా ఉండడమే క్షేమంకరం. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నా, వ్యాప్తి వేగం భయపెడుతూనే ఉంది. దేశంలో రోజుకు 40 వేలకు అటుఇటుగా కొత్త కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య గతంలో కంటే కొంచెం పెరిగింది. మొన్న ఒక్కరోజే 600 మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. రికవరీ రేటు 97శాతనికి చేరడం గుడ్డిలో మెల్ల. జనవరి 16 వ తేదీన దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని డోసులు కలుపుకొని ఇప్పటి వరకు 50కోట్లకు పైగా పంపిణీ అయ్యాయి.
Also read: టోక్యోలో భారత్ పోరాటం
నిర్లక్ష్యమే ప్రమాద హేతువు
దిల్లీ మొదలైన ప్రధాన నగరాల్లో తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరగడం ఆందోళన రేపుతోంది. కేరళ,మహారాష్ట్రలో ఇంకా అదుపులోకి రాకపోవడం బాధాకరం. రెండో వేవ్ తగ్గుముఖం పడుతుందనుకునే సమయంలో కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిపుణులు గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలు పాటించకపోవడం మరో ముఖ్య కారణం. ఐసోలేషన్ లో ఉన్నవారిలో ఎక్కువమంది జాగ్రత్తలకు తిలోదకాలిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటులో అలసత్వం వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుగోడలవుతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించే విధానం సక్రమంగా అమలవ్వడం లేదు. మూడో ముప్పు (థర్డ్ వేవ్) విషయంలో శాస్త్రవేత్తలు ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్ విజృంభణ కొత్త కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పాలి. మూడో ముప్పుకు ఇవే ఆజ్యం పోస్తున్నాయి. అక్టోబర్ నాటికి ఉధృతి పెరుగుతుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. రెండో వేవ్ తో పోల్చుకుంటే మూడో వేవ్ లో విజృంభణ తక్కువే ఉంటుందని వినపడుతున్నా,మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. మూడో వేవ్ లో రోజుకు సుమారు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరీ ఉదృతరూపం దాలిస్తే 1,50,000 వరకూ కేసుల సంఖ్య పెరగవచ్చు. రెండో వేవ్ సమయంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదై ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుత వ్యాప్తిలో 80శాతం వాటా డెల్టా వేరియంట్లదే కావడం గమనార్హం. ఇతర దేశస్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే క్షేమం. అన్నిరకాల ప్రయాణ కేంద్రాల్లో పెరుగుతున్న రద్దీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమైనా,ఆశించిన స్థాయిలో జరగలేదనే చెప్పాలి. సరిపడా వ్యాక్సిన్ డోసులను ముందుగా సిద్ధం చేసుకోకపోవడం ఒక వైఫల్యం.
Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?
టీకా మందుల మధ్య ఘర్షణ
కోవాక్జిన్ – కోవీషీల్డ్ మధ్య జరిగిన మాటల యుద్ధం వల్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం మరోవైఫల్యం. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న వైనం వల్ల ఇప్పటికీ ఆ రెండు టీకాలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కుదరలేదన్నది వాస్తవం. ప్రత్యామ్నాయం లేక, గుడ్డిలో మెల్లగా భావించి, వాటితో సరిపెట్టుకుంటున్నారు.రెండు డోసులు పూర్తయిన వారిలో యాంటీబాడీలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో సమగ్రమైన నివేదికలు అందుబాటులో లేవు. యాంటీ బాడీలు పెరగకపోతే, టీకా వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే వైద్య రంగాల అభిప్రాయం.విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు కోవీషీల్డ్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. బూస్టర్ డోస్ కూడా తీసుకొస్తామని భారత్ బయోటెక్ గతంలో తెలిపింది. అది కూడా పూర్తయితేకానీ, యాంటీబాడీస్ ఆశించిన స్థాయిలో పెరగవని అర్ధం చేసుకోవాల్సి వస్తోంది.విదేశీ టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తాయనే ప్రచారం ప్రజల్లో ఉంది.రష్యాకు చెందిన స్పుట్నిక్ అందుబాటులోకి వచ్చింది. ఆ కంపెనీకి చెందిన సింగల్ డోస్ టీకాకు ఇంకా మనదేశంలో అనుమతి లభించలేదని సమాచారం. అమెరికా దిగ్గజ కంపెనీ జాన్సన్ & జాన్సన్ సింగల్ డోస్ టీకాకు తాజాగా అనుమతి లభించింది. ఇది కీలకమైన పరిణామం. ఈ టీకా అందుబాటులోకి వస్తే, ప్రక్రియలో మంచి పురోగతి సాధించినట్లే.అదే దేశానికి చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవలే భారత ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. ఆ విధంగా స్పుట్నిక్, మోడెర్నా, జాన్సన్ & జాన్సన్ మూడు విదేశీ వ్యాక్సిన్లు భారతీయులకు దగ్గరవ్వడం మంచి పరిణామం. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇంకా సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. వైరస్ వ్యాప్తి ప్రస్థానంలో ఆర్ ఫ్యాక్టర్ ఆందోళన రేపుతోంది.వైరస్ ఒకరి కంటే ఎక్కువమందికి సోకడమే ఆర్ ఫ్యాక్టర్ రేట్. పలురాష్ట్రాల్లో ఇది 1 దాటింది. ఇది ఇలా ఉండగా, మహారాష్ట్రలోని భంధారా జిల్లా మాత్రం కరోనాను తరిమి కొట్టి, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కరోనా ఒక్కకేసు కూడా లేని జిల్లాగా చరిత్ర సృష్టిస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో పాటు ,ట్రిపుల్- టీ విధానం- టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ – వల్లనే వైరస్ పై విజయం సాధించారు. అక్కడ ప్రభుత్వం – ప్రజలు కలిసి సాగి, ఈ ఘనతను అందుకున్నారు. మూడోముప్పు ముసురుకుంటున్న వేళ, అప్రమత్తంగా ఉండడమే శిరోధార్యం.
Also read: విశాఖ ఉక్కు: నాయకుల నక్కజిత్తులు