- మండిపడుతున్నటీడీపీ శ్రేణులు
- రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు (మార్చి 16) ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 23 ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో తెలిపారు. ఆరోజు చంద్రబాబు స్టేట్ మెంట్ తీసుకోనున్నారు.
అమరావతిలో ఉన్న అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఫిబ్రవరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. వీళ్లిద్దరితో పాటు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న కాంతిలాల్ దండేకు నోటీసులు ఇచ్చారు. భూ రికార్డులపై ఆయన్ను కూడా విచారించే అవకాశముంది.
ఇదీ చదవండి:ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం
న్యాయ నిపుణులతో మంతనాలు:
సీఐడీ నుంచి నోటీసులు తీసుకున్నట్లు ధృవీకరించిన చంద్రబాబు ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు అందుకున్నందున కోర్టుకు వెళ్లాలా? లేక విచారణకు హాజరుకావాలా అనే అంశంపై సదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మండిపడుతున్న టీడీపీ శ్రేణులు:
రాజధాని భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
ఇదీ చదవండి: జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ