నీ కొమ్మకు చేరువైతే చాలు
చేకొమ్మని చేయూతనిస్తావు
నిన్నుచూస్తూ నీడన నిలిస్తే చాలు
తాజాపూలతో అభిషేకిస్తావు
నీ కాలివేళ్లకు ప్రణమిల్లితే చాలు
నీతాగేనీళ్లు నాకు పాద్యమిస్తావు
నీ విస్ఫారిత హరితపత్రాలు చూస్తేచాలు
ఆఘ్రాణించమని గాఢ సుగంధాలు వీస్తావు
నా కళ్లలో ఆకళ్లు చూస్తే చాలు, కొమ్మలు సాచి
అమ్మవై నోటికి రస ఫల నైవేద్యాన్నిందిస్తావు
నీవు దేవుడంటూ నిను చేరిన వాడిని
నీవే దేవుడని పూజించే నిన్నేమనాలి?
–మాడభూషి శ్రీధర్
9.8.2021