తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 11వ భాగం
సమాజంలో అణగారిన వర్గాలలోని స్త్రీల బతుకులు, వారి జీవితాలను అధోగతి లోకి నెట్టి వారి జీవన గమనాన్ని అతలాకుతలం చేసే వారివల్ల ఆ మహిళల మనుగడ ఎలా ఊహించని మార్పులకు బలి అవుతుందో, రసార్ద్రంగా చిత్రీకరించడం దర్శకుడు టి. కృష్ణ చిత్రాలలో ప్రతిఫలిస్తుంది!
ఇక ఇప్పటికీ మన ప్రభుత్వాలు – కారణాలు ఏవి అయినా “విద్య వైద్యం“ మీద తగినంత శ్రద్ధ చూపడం లేదని విమర్శకులు అనడం, అక్షర సత్యమని మనకి తెలుస్తూనే ఉంది!
“చదువు“ అన్న మూడక్షరాలు “మనిషి“ అనే మూడక్షరాల జీవితాన్ని ప్రగతిపథం వైపు పయనింపచేస్తుంది అంటారు! అంటే విద్యకున్న విలువ అటువంటిది!
రేపటి పౌరులు
కానీ ఆర్ధిక లేమి, కుటుంబ అవసరాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, కొందరిని ఆ విలువైన విద్యకు దూరం చేస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా ఇప్పటికీ జరుగుతున్న చరిత్ర! కాదనలేని కఠిన వాస్తవం. నలుగురున్న పేద కుటుంబంలో అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో తల్లితండ్రులతో పాటు పదేళ్ళు కూడా నిండని పిల్లలు కూడా బడికి కాకుండా పనికి వెళ్ళాలి. సంపాదించాలి. అప్పుడే ఆ సంసారం ఇంత తినగలుగుతుంది రెండు పూటలా!
ఈ పరిస్ధితికి కారణం ఎవరు అన్నదానికి జవాబు అందరికీ తెలిసిందే. అయితే తోటిపిల్లలు చక్కగా బడికి వెళ్తుంటే తను కూడా చదువుకుంటానని ఓ పేద పిల్లవాడు కోరుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియచెప్పే చిత్రం రేపటి పౌరులు.
మనం వింటూనే ఉన్నాం ఏళ్ళ తరబడి “నేటి బాలలే రేపటి పౌరులు“ అన్న నినాదం. అయితే ఆ నినాదం కేవలం నినాదంగానే మిగిలిపోవడం విచారకరం. పైన చెప్పిన బాలలు కూడా మరి రేపటి పౌరులే. వారి విలువైన భవిష్యత్తు కోసం వారి ఆశలకు, ఆలోచనలకు అటు ప్రభుత్వాలు కానీ, ఆలోచన అంటూ చేయడం జరుగుతోందా? ఈ ప్రశ్న ఇలా ప్రశ్నగానే ఉండిపోయింది అని మనందరికీ తెలుసు. కానీ ఈ పరిస్ధితి మారి ఆ బాలలు కూడా నిజమైన రేపటి పౌరులుగా మారాలి, అది మనందరి బాధ్యత అని రేపటి పౌరులు చిత్రంలో దర్శకుడు టి.కృష్ణ దృశ్యమానం చేయడం అభినందనీయం. ఆయనలోని ప్రగతి కోణానికి నిలువెత్తు చిత్రరూపం!
ఒక సిద్ధాంతానికి, అందులోనూ సమాజ శ్రేయస్సు కోసం నిలబడి, తనలోని అభ్యుదయ భావాలను అందరికీ తెలియచెప్పాలని, అందుకే కట్టుబడి ఆ ధోరణిలోనే, చిత్ర కథా కథనాలతో రూపొందించిన చిత్రాలు, దర్శకుడు టి. కృష్ణలోని వృత్తి పట్ల నిజాయితీని తెలియచేస్తాయి అంటే ఎవరూ కాదనరు.
పాత్రకు జీవం పోసిన విజయశాంతి
ముఖ్యంగా దర్శకుడు టి. కృష్ణ ప్రస్థానంలో ఆయన అఖండ విజయానికి కారణమైన చిత్రం ప్రతిఘటన అని చెప్పాలి. రాజకీయ నాయకులుగా, ప్రస్తుత సమాజంలో ఎంతో మంది అవినీతి వర్తనులు, నేరచరిత్ర ఉన్న వారు గూండాలుగా చలామణి అవుతున్న వాళ్ళు, కుల బలంతోనో, ధన బలంతోనో సంఘంలో ప్రముఖ స్ధానాల్లో ఉండటం జరుగుతున్నదే. అటువంటి వారిని ప్రశ్నించే వ్యక్తులున్న సమాజం రావాలని, అలాంటి సంఘ ద్రోహులని కనిపించకుండా చేయాలన్న సందేశంతో వర్తమాన రాజకీయాల నేపథ్యంగా దర్శకుడు టి. కృష్ణ తీర్చిదిద్దిన చిత్రం ప్రతిఘటన.
సమాజం అన్నాక అన్ని కులాలు, మతాలతో పాటు ఆర్ధికంగా, సామాజికంగా కూడా విభిన్న తరగతుల వారుంటారు. ఓ మధ్య తరగతి కుటుంబ మహిళ తన కళ్ళ ముందు ఒక రాజకీయ గూండా చేస్తున్న దుర్మార్గాన్ని, అకృత్యాలని ఎలా ఎదుర్కొంది? అందుకు ఆమెను ప్రేరేపించిన సంఘటనలు, సందర్భం ఏమిటి అన్నది ఆసక్తికరమైన కథాంశంతో ప్రతిఘటన చిత్రంలో కథానాయకి పాత్రను సృష్టించడం జరిగింది. ఆ పాత్ర నేటి యువతకు ఆదర్శప్రాయమైనది. మన చుట్టుపక్కల ఏం జరిగినా మనకెందుకులే అని పట్టించుకోకుండా పోయే వారి కళ్ళు తెరిపించి, వాళ్ళలో సామాజిక చైతన్యం కలిగించిన పాత్ర అది. ఇటువంటి సమాజ సమస్యలకు, ఇలా ముగింపు చెప్పినా తప్పులేదు అని నిర్భయంగా ప్రవర్తించిన ఆ పాత్రలో ప్రముఖ నటి విజయశాంతి నటన కూడా ఆ పాత్రకు జీవం పోసింది, చిత్ర విజయానికీ కారణమైందిఅంటే అతిశయోక్తి కాదు. ఇదే చిత్రాన్ని దర్శకుడు టి. కృష్ణ హిందీలో “ప్రతిఘాత్“ పేరుతో రూపొందించడం జరిగింది. అక్కడా విజయం సాధించింది అంటే కారణం కథ, కథనాల్లోని ప్రగతిభావ సమాహారమే! ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు ప్రగతి అనేది. అందరికీ, అన్ని వర్గాల వారికి, సమాజం అనేది సర్వజనహితంగా సాగాలన్నదే ప్రగతి లక్ష్యం! ధ్యేయం!
ప్రగతి పథమే కృష్ణ తృష్ణ
ఇలాంటి సామాజిక స్పృహతోనే దర్శకుడు టి. కృష్ణ సారథ్యంలో దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం మొదలైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
దర్శకుడు టి. కృష్ణ వృత్తిగతమైన ప్రయాణం అలుపు ఎరుగని గమనం. ఆయన పథం, దృక్పథం విభిన్నం! విలక్షణం! చిత్ర మాధ్యమం ద్వారా సమాజంలోని చీకటి కోణాలను వెలికితీస్తూ, సమాజానికి వెలుగు చూపుతూ, సినిమా అన్నది కేవలం వినోదం కోసం కాదు మనలో సామాజిక స్పృహ కలిగించే గొప్ప వివేక మాధ్యమం అని గాఢంగా నమ్మిన ప్రయోజనాత్మక చిత్రాల దర్శకుడు టి. కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు మరికొన్ని ఉత్తమ చిత్రాలను అందించవలసిన దర్శకుడు టి. కృష్ణ చాలా చిన్న వయసులో మరణించడం అత్యంత విచారకరం. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆయనను నిత్యం స్మరించుకునే విధంగా ఉండటం గమనార్హం!
‘‘విలక్షణ విశిష్ట దర్శకుడు టి. కృష్ణ
ప్రగతి పథమే ఆయన తృష్ణ!’’
మరికొన్ని ప్రగతిశీల చిత్రాలు – దర్శకులు
సమాజాన్ని చైతన్యపథం వైపు నడిపించే చిత్రాలు రావాలని, సామాజిక రుగ్మతలను రూపుమాపి అభ్యుదయ మార్గం వైపు మళ్ళించి సమ సమాజ స్థాపనయే ధ్యేయం కావాలనిపించే చిత్రాలు నిర్మించే కొందరు దర్శకుల చిత్రాలను ఈ సందర్భంగా పరిశీలన చేసినప్పుడు వారికి తమ వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను మనం అభినందించకుండా ఉండలేము. సమాజం పట్ల ఉన్న బాధ్యతను కూడా గుర్తుచేసే ఆ దర్శకుల చిత్రాలు ఎప్పటికీ ఇటు చిత్ర పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు మార్గదర్శకాలు అనడంలో సందేహం లేదు.
వివాహ వ్యవస్ధపై తిరుగుబాటు బావుటా
భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిలో భాగం. అయితే కొందరు ఛాందసవాదులు మూఢ నమ్మకాలున్న వారు ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్ధ పేరు మీద ఆచారాలంటూ అమాయక బాలికల జీవితాలను నాశనం చేసే వారు సృష్టించిన దురాచారమే కన్యాశుల్కం!
ఈ సమస్య మీద “మహాకవి గురజాడ“ వ్రాసిన గొప్ప నాటకం “కన్యాశుల్కం“. తెలుగు నాటక రంగంలో అప్పటికి ఇప్పటికీ ధృవతారగా నిలిచిన ఈ నాటకం ఆనాటి కొందరు అగ్రవర్ణాల వారి స్వార్ధపరత్వాన్ని, స్ర్తీలను అందులోనూ బాల వితంతువులను కేవలం ఇంటిపనికే పరిమితం చేయడంలాంటి దుర్మార్గాలను ఎండగడుతూ వ్యంగ్య వైభవంతో బహిర్గతం చేయడం విశేషం.
సుప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం
సాహిత్య లోకంలో ఎంతగానో ప్రసిద్ధి పొందిన “కన్యాశుల్కం“ నాటకాన్ని 1955లో ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య చలనచిత్రంగా రూపొందించారు. ఆనాడు వస్తున్న చిత్రాల ఒరవడిలో “కన్యాశుల్కం“ నాటకాన్ని చిత్రంగా తీయడం ఓ సాహసం అని చెప్పాలి. సాంఘిక సంస్కరణ ప్రధానాంశంగా ఉన్న ఈ నాటకం అప్పటికింకా సంస్కరణలను, జీర్ణించుకోని దశలో ఉన్న పరిస్ధితులలో చిత్రంగా రూపొందించడం, దర్శకునికి ఉన్న విశాల భావాన్ని, అభ్యుదయ భావాల పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేస్తుంది. ఒక గొప్ప రచన, అది కథ, నవల, నాటకం ఏదైనా చిత్ర మాధ్యమంగా రూపుదిద్దుకున్నప్పుడు మరింతగా ప్రజలకు (ప్రేక్షకులకు) చేరువవుతుంది. అప్పుడు ఆ రచనకు మరింత సార్థకత లభిస్తుంది. ఏ సంస్కరణ ఎవరు ఆరంభించినా ఫలితాల ఫలాలు అందడానికి వ్యవధి అవసరం అవుతుంది. ఇది ఎన్నో సామాజిక సంస్కరణల విషయంలో నిజమైన రుజువు.
అలా కన్యాశుల్కం సాంఘిక సంస్కరణ ప్రధాన ఇతివృత్తంగా మలిచిన నాటకం. అయితే చిత్రంగా వచ్చినప్పుడు ప్రేక్షకులు గొప్పగా బ్రహ్మరథం పట్టలేదు అనడం నిర్వివాదాంశం. కారణం అంటూ వెతికితే అప్పటికి ప్రేక్షకులు సినిమాను ఇంకా వినోద ప్రక్రియగా చూస్తూ ఉండడమే ప్రధాన కారణం అంటారు విమర్శకులు! ఏదైనా అటువంటి సాంఘిక ప్రయోజనం గల చిత్ర నిర్మాణం జరగడం ఆహ్వానించదగిన విషయం.
అందుకే అప్పటికే అభ్యుదయ భావాలతో రచనలు చేసిన “గురజాడ“ ప్రగతిపథానికి అడుగుజాడ అనడం ఆక్షేపణీయం కాదు!
గతంలో ఇలాంటి సాంఘిక ప్రయోజనం కలిగిన చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు మనం ప్రస్తావించుకోవలసిన మరో చిత్రం వరకట్నం! పైన చెప్పిన “కన్యాశుల్కానికి“ ఇది పూర్తిగా వ్యతిరేకమైన దురాచారం. ఇది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉండటం దురదృష్టం! మన సమాజపు వెనకబాటుతనం అని చెప్పాలి. అటు కన్యాశుల్కం అనే దురాచార కోరలకు, ఇటు వరకట్నం లాంటి అనాచార జ్వాలలకు బలి అయిపోతున్నది అమాయక మహిళలే కావడం, ఈ దేశంలోని మహిళల దుస్థితిని తెలియచేస్తుంది!
వరకట్న మహాపిశాచి
ఈనాటికీ వరకట్నం పేరుతో ఎందరో స్త్రీల మాన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నో చట్టాలు, శిక్షాస్మృతులు వచ్చినా సమాజంలోని ప్రతి స్థాయిలోనూ ఇంకా వరకట్నం అమలు అవుతూనే ఉంది. విద్యాధికులు కూడా ఈ వరకట్నం దురాచారాన్ని కొనసాగించడం, వారి విజ్ఞతా లేమిని సూచిస్తుంది. ఇక సామాన్య కుటుంబాలలోనూ విద్యాపరంగా, ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారు కూడా వరకట్నం విషయంలో మానవత్వం మరిచి ప్రవర్తించడం హేయమైన సంగతి! ఖండించవలసిన విషయం.
ఇటువంటి దురాచారం, ఇప్పటికైనా నశించాలని అప్పుడే మహిళ మానప్రాణాలు నిలుస్తాయని, సమాజం సమభావన వైపు నడుస్తుంది అన్న అభ్యుదయ భావజాలంతో వాణిజ్య సూత్రాలతో వరకట్నం చిత్ర నిర్మాణం జరిగింది! ఆశించిన సంస్కరణ ఫలితం మాట ఎలా ఉన్నా చిత్రానికి ప్రేక్షకలోక ఆదరణ ఘనంగా లభించింది! అందుకే ఈ వరకట్నం చిత్రం అభ్యుదయ ఇతివృత్తం గల చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
విచిత్రంగా నాటి కన్యాశుల్కం నేటి వరకట్నం చిత్రాలు రెండింటిలోనూ కథా నాయకుడు ఎన్.టి. రామారావు కావడం విశేషం!
(మిగతా వచ్చేవారం)