ఫొటో రైటప్: ప్రతిభ, సుఖు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించాలనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఏలు వదిలివేశారు. వారంతా కాంగ్రెస్ పరిశీలకుల సమక్షంలో సమావేశమై ఏకవాక్య తీర్మానం ఆమోదించారు. ముగ్గురు పరిశీలకులూ అధిష్ఠానవర్గానికి శనివారంనాడు తమ నివేదిక అందజేస్తారు. అధిష్ఠానం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులలో ఒకరైన రాజీవ్ శుక్లా శుక్రవారం సాయంత్రం విలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు.
కాంగ్రెస్ పరిశీలకులకు ఎంఎల్ ఏలు చెప్పిన పేర్లలో ప్రతిభాసింగ్ ఒకరు. ఆమె ప్రస్తుతం మండి లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికలలో ఆమె హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించారు. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా గ్రామీణ నియోజకవర్గంన నుంచి శాసనసభకు ఎన్నికైనారు.
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్ అధిష్ఠానం పరిశీలకుడిగా సిమ్లా వెళ్ళి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిభాసింగ్ తో పాటు సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, హర్షవర్థన్ చౌహాన్ కూడా పోటీలో ఉన్నారు. అత్యధిక సంఖ్యాకులు ప్రతిభాసింగ్ ను బలపరిచారు.
శుక్రవారం ఉదయం ఎన్ డీటీవీతో ప్రతిభాసింగ్ మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి పదవిని నిభాయించగలననీ, వీరభద్రసింగ్ పేరుతోనే నలభై స్థానాలు గెలుచుకోగలిగామనీ, ఆయన కుటుంబానికి పదవి ఇవ్వకపోవడం అన్యాయం అవుతుందనీ అన్నారు. అన్యాపదేశంగా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సముచితంగా ఉంటుందని ఉద్ఘాటించారు. హోటల్ ఒబరాయ్ సిసిల్ లో సమావేశం జరిగింది. ప్రతిభాసింగ్, సుఖుల మద్దతుదారులు హోటల్ బయట బలప్రదర్శన చేశారు. ప్రతిభాసింగ్ వర్గం తమకు 15 మంది ఎంఎల్ఏల మద్దతు ఉన్నదంటే సుఖు వర్గం ఇరవై మంది ఎంఎల్ఏల మద్దతు ఉందని పోటీ పడుతున్నారు.
శుక్రవారం ఉదయం కాంగ్రెస్ నాయకులు భగేల్, బిఎస్ హూండా, రాజీవ్ శుక్లాలు సిమ్లాలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని కోరుతూ ఒక వినతిప త్రాన్ని అందజేశారు. తమ పార్టీ గుర్తుపైన గెలుపొందిన నలభై మంది ఎంఎల్ ఏ ల జాబితాను వారు గవర్నర్ కు సమర్పించారు.
సీఎల్ పీ సమావేశం లో కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే బాధ్యతను పార్టీ అధిష్ఠానవర్గానికి వదిలివేస్తూ తీర్మానించారు. ఇది మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఫక్కీలోనే జరిగింది.
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినవారిలో ప్రతిభా సింగ్ మాజీ ముఖ్యమంత్రి వీర్ భద్రసింగ్ భార్య. ఆయన ఆరు తడవలు ముఖ్యమంత్రిగా పని చేశారు. చాలా మంచి పేరు ఉంది. వీర్ భద్రసింగ్ నిరుడు కన్నుమూశారు. వెంటనే ఆయన భార్యను పీసీసీ అధ్యక్షురాలుగా నియమించారు. ఆయన పట్ల ప్రజలలో ఆదరణ ఉన్నది. సానుభూతిని వినియోగించుకోవాలని ఆయన భార్యకు అందలం అప్పగించారు. ఈ సారి కూడా అదే జరగవచ్చు. ప్రతిభ మూడోసారి లోక్ సభ కు ఎన్నికైనారు.
ప్రతిభతో పోటీ పడుతున్న సుఖ్విందర్ సింగ్ సుఖు న్యాయశాస్త్రం అభ్యసించారు. మూడు సార్లు హమీర్ పూర్ జిల్లా నాడౌన్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైనారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలోో చురుకైన పాత్ర పోషించారు. సిమ్లా విశ్వవిద్యాలయం రాజకీయాలలో ఎన్ ఎస్ యూఐ నాయకుడిగా వెలిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. దాంతో పూర్తికాలం రాజకీయవేత్తగా మారారు. సిమ్లాకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ సిమ్లా మునిసిపల్ ఎన్నికలలో రెండు విడతల విజయం సాధించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా సుఖు పని చేశారు.
మరో పోటీదారు ముఖేష్ అగ్నిహోత్రి. స్వతహాగా జర్నలిస్టు. అక్కడి నుంచి రాజకీయాలలో ప్రవేశించి ఇప్పటికి అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైనారు వీరభద్రసింగ్ కి బాగా దగ్గర. సొంత ప్రతిభతో రాజకీయాలలో ఎదిగారు. మొన్నటి బీజేపీ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా అగ్నిహోత్రి సేవలందించారు.