- పని త్వరలో ప్రారంభిస్తారని షర్మిల వెల్లడి
- తన జీవితం తెలంగాణకే అంకితమని ప్రకటన
హైదరాబాద్ : ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి పని చేస్తారనీ, త్వరలోనే ఆయన పని ప్రారంభిస్తారని వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రకటించారు. వీ6 చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తాను రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారో, ఎట్లా నెగ్గుకొని రావాలని అనుకుంటున్నారో వివరించారు. 2018లో టీఆర్ ఎస్ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను కానీ బీజేపీని కానీ ప్రజలు భావించకపోవడం వల్లనే ఆ పార్టీ రెండో సారి గెలుపొంది అధికారంలో కొనసాగుతోందని ఆమె విశ్లేషించారు. తెలంగాణ రాజకీయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాననీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)జుట్టు బీజేబీ అగ్రనాయకత్వం చేతుల్లో ఉందనీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ కి ‘బీ-టీం’లాగా వ్యవహరిస్తోందనీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన అనంతరం కేసీఆర్ నియంతగా మారిపోయారని అన్నారు.
వైఎస్ఆర్ ఒక బ్రాండ్ అనీ, ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరచిపోజాలరనీ, ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారనీ, రైతు రుణ మాఫీ, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజుల రీఎంబర్స్ మెంట్, మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టినవేననీ అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ఎవ్వరూ అధికారంలోకి రాజాలరనీ, ప్రజలు ఓటు వేసి గెలిపిస్తేనే గెలిచి అధికారంలోకి వస్తారనీ ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మహిళల, చిన్నారుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైనదనీ, మహిళలపైన నేరాలు మూడు వందల రెట్లు పెరిగాయనీ, మద్యం, మాదకద్రవ్యాలు విరివిగా లభిస్తున్నాయనీ, వాటి ప్రభావంతోనే మహిళలూ, బాలికలపైన హత్యాచారాలు జరుగుతున్నాయనీ ఆమె వ్యాఖ్యానించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఒక బాలకపైన హత్యాచారం జరిగితే ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక టీఆర్ఎస్ కొర్పొరేటర్ కు కూడా తీరికలేకుండా పోయిందని విమర్శించారు.
తనకూ, అన్న జగన్ మోహన్ రెడ్డికీ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలూ లేవనీ, తన జీవితం తెలంగాణకి అంకితమైపోయిందనీ, ఒక ప్రాంతీయపార్టీ రెండు రాష్ట్రాలలో నెగ్గుకురావడం సాధ్యం కాదనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలకూ, తెలంగాణ సమస్యలకూ తేడా ఉన్నదనీ, ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకోవాలనీ అన్నారు.