Friday, December 27, 2024

కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?

  • గాంధీలతో నాలుగు గంటల భేటీలో భవిష్యత్ చిత్రపటంపై చర్చ
  • ఎన్ డీ ఏ కి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కసరత్తు
  • కాంగ్రెస్ లో చేరి పార్టీకోసం పని చేయాలని రాహుల్ సూచన

ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మంగళవారంనాడు ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీ నివాసంలో నాలుగు గంటలపాటు కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికను చర్చించారు. తన భవిష్యత్తు ఏమిటో నిర్ణయించుకునేందుకు చర్చ దోహదం చేస్తుంది. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన సభ్యులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. మూడు రోజుల్లో కాంగ్రెస్ లో చేరేదీ లేనిదీ తేల్చి చెప్పాలని గాంధీలు కిశోర్ కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి లోపటి నుంచి పార్టీకి మరమ్మతు చేయడానికి అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించే పనిలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. చేరితో ఏ హోదాలో చేరుతారన్నది చూడవలసిన విషయం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు. వారికి ఇబ్బంది లేకుండా, వారిలో ఎవ్వరూ మనసు నొచ్చుకోకుండా కిశోర్ ని పార్టీలో ప్రవేశపెట్టాలి. బయట ఉండి వ్యూహకర్తగా పని చేసినప్పుడు కిశోర్ కి ఉండే స్వేచ్ఛ కాంగ్రెస్ లోపల ఉంటే ఉండదు. కానీ ఆయన వ్యూహకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు.

Also read: మాయావతి రాజకీయం: యూపీ మాయాబజార్

చర్చ పంజాబ్, యూపీలపై కాదు

ఈ సమావేశంలో పంజాబ్ గురించి కానీ ఉత్తరప్రదేశ్ గురించి కానీ చర్చించలేదనీ, రాబోయే 2024 ఎన్నికలలో ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించే విధంగా కాంగ్రెస్ ను బలోపేతం చేయడం కోసం కిశోర్ సమర్పించిన ప్రణాళికపైన చర్చ జరిగిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. తన ప్రణాళిక అమలు చేసే పరిస్తితిలో తన ఉనికి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలని కూడా ప్రశాంత్ కిశోర్ కోరారు.

ఇటీవల పశ్చిమబెంగాల్ లో, తమిళనాడులో మమతాబెనర్జీకి, స్టాలిన్ కి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ, ఈ అవతారం చాలించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా మరో విధంగా జీవితం గడపాలని భావిస్తున్నట్టు చెప్పారు. అప్పటి నుంచీ ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీతో సంపర్కంలో ఉంటున్నారని తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలతో అతడికి ఇప్పటికే ప్రమేయం ఉన్నది. బిహార్ లో జేడీ (యూ)లో ఉపాధ్యక్ష పదవినీ, కేబినెట్ హోదానీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇచ్చారు. కానీ అంతలోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీపైన నితీశ్ కుమార్ ఎక్కువగా ఆధారపడటం కిశోర్ కి నచ్చలేదు. 2014లో బీజేపీ విజయానికీ, నరేంద్రమోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేయడానికి దారితీసిన పరిస్థితులలో ప్రశాంత్ కిశోర్ కీలకమైన భూమిక పోషించారు. దాని తర్వాత మోదీతో, బీజేపీ నాయకత్వంతో విభేదించి, వారికి దూరమై, ఇతర పార్టీలకు సలహాలు ఇస్తూ వచ్చారు. అటువంటి బీజేపీకి నితీశ్ కుమార్ దగ్గర కావడం కిశోర్ సహించలేకపోయారు. నిశిత విమర్శలను తట్టుకోలేక పార్టీ నుంచి కిశోర్ ని నితీశ్ బహిష్కరించారు.

Also read: ఉపా చట్టం రాజ్యాంగవిరుద్ధం

యూపీలోనే వైఫల్యం

గతంలో 2017 యూపీ ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేశారు. రాహుల్ గాంధీనీ, సమాజ్ వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ నీ జంటగా ‘యూపీ కే లడకే’ అని పిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా ఎన్నికల ప్రచారం చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. యూపీ ప్రజలు బీజేపీకి ఘనవిజయం అందించారు. ఆ దెబ్బతో నిరాశ చెందిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తో పని చేయడం కష్టమంటూ వ్యాఖ్యానించారు. ‘‘నా వంటి వ్యక్తితో కలసి పని చేసే సౌలభ్యం కాంగ్రెస్ నాయకత్వంలో లేదు. అది వందేళ్ళ పార్టీ. దాని శైలి దానికి ఉంటుంది. నాకు ఆ పార్టీతో కలసి పని చేయడం కుదరదు,’’ అంటూ మేనెలలో వ్యాఖ్యానించారు.  ఈ సమస్యను కాంగ్రెస్ గుర్తించి దాని గురించి ఏదో ఒకటి చేసి సమస్యను పరిష్కరించుకోవాలంటూ హితవు చెప్పారు. ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా ఆయన అన్నారు.

Also read: మేటి కథకుడైన కథానాయకుడు పీవీ

శరద్ పవార్ తో భేటీ

ఇన్ని వ్యాఖ్యానాలు చేసిన 44 ఏళ్ళ ఎన్నికల వ్యూహకర్త ఇటీవల రెండు విడతల నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ తో సమాలోచనలు జరిపారు. రెండు సమావేశాల మధ్య పవార్ నివాసంలో కొన్ని ప్రతిపక్షాల నాయకులు సమావేశమై దేశంలో రాజకీయ పరిస్థితిని చర్చించారు. ఆ సమావేశానికి ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన వయోధిక నాయకుడూ, పూర్వ కేంద్ర ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా చొరవ తీసుకున్నారు. నాటి సభకు కాంగ్రెస్ ప్రతినిధి ఎవ్వరూ హాజరు కాలేదు. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చినప్పుడు కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు అవకాశం లేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అదే విషయాన్ని శరద్ పవార్, బిహార్ ఆర్ జేడీ అధినేత తేజశ్విని యాదవ్ కూడా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అవసరమైన చికిత్స చేసే ప్రయత్నంలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు.

Also read: ఇది ‘రమణ ఎఫెక్ట్’, రిబీరో వ్యాఖ్య

పీకే అంటూ రెండు పొడి అక్షరాలలో పిలిచే ప్రశాంత్ కిశోర్ కి సవాళ్ళు ఎదుర్కోవడం అంటే మహా ఇష్టం. బలమైన ప్రత్యర్థిని ఢీకొని గెలుపొందాలనే ఉబలాటం ఎక్కువ. 2014లో యూపీఏని ఎదిరించి బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీఏ ని అధికారంలోకి తీసుకొని రావడం ఒక పెను సవాలు. బీహార్ లో ఆర్ జెడీ, జేడీ(యూ), కాంగ్రెస్ కలసి ఏర్పాటు చేసిన కూటమిని గెలిపించడం 2016లో కిశోర్ ఎదుర్కొన్న సవాలు. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్ ను గెలిపించగలిగినప్పటికీ యూపీలో కాంగ్రెస్-ఎస్ పీ కూటమిని గెలిపించలేక విఫలమైనారు. అది ఒక్కటే వ్యూహకర్తగా పీకే విఫలమైన సందర్భం.  2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ సీపీని గెలిపించి గద్దెనెక్కించడం మరో సవాలు. ఇందులోఅద్భుతమైన విజయం సాధించారు. 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్నది. మొన్న 2021 ఏప్రిల్-మేలో బెంగాల్ లో నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయాన్ని ఎదిరించి అప్పటికే పదేళ్ళు అదికారంలో ఉండి ప్రజలకు దూరమైనట్టు కనిపించిన మమతా బెనర్జీని గెలిపించడం మధురమైన విజయం. అదే సమయంలో తమిళనాడులో స్టాలిన్ కూడా ప్రశాంత్ కిశోర్ సహకారం తీసుకున్నారు. తమిళనాట అప్పటికే పదేళ్ళు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకె అధినేత జయలలిత లేకుండా ఎన్నికల బరిలో మొట్టమొదటిసారి నిలిచింది. ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. ప్రశాంత్ కిశోర్ తోడు లేకపోయినా డిఎంకె గెలిచేదనడంలో సందేహం లేదు. ప్రశాంత్ కిశోర్ ప్రభావం తమిళనాడు ఎన్నికలపై ఉంటే ఏఐఏడిఎంకెకి అన్ని సీట్లు వచ్చేవి కావు. బెంగాల్ విజయాన్ని నిస్సందేహంగా ప్రశంసించవలసి ఉన్నప్పటికీ తమిళనాడు సంగతిని పెద్దగా చెప్పుకోనవసరం లేదు.

Also read: ఉద్యమస్ఫూర్తికి ఊరట

కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స

ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దుర్బలంగా ఉంది. నిర్ణయాలు తీసుకోలేని బలహీనమైన మానసిక స్థితి 2009 నుంచీ కొనసాగుతూనే ఉంది.  డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిర్ణయాలు తీసుకోలేని ప్రభుత్వంగా, పని చేయని ప్రభుత్వంగా, అవినీతిలో కూరుకుపోయిన సర్కార్ గా యూపీఏ-2 పేరు తెచ్చుకున్నది. అదే దుస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొనసాగుతోంది. 2014లో, 2019లో ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ సంస్కరణలకు నోచుకోలేదు. 23 మంది వరిష్ఠ నాయకులు అధినాయకత్వానికి లేఖాస్త్రం సంధించి తీరు మార్చుకోవాలనీ, నాయకత్వం పార్టీని ముందుండి నడిపించాలనీ హితవు చెప్పినా చలనం లేదు. 2019లో ఓటమికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవి నుంచి రాహుల్ రాజీనామా చేసినా అతడి స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోలేదు. రాహుల్ ప్రధానిపైన ఎప్పటికప్పుడు విమర్శలు కురిపిస్తున్నారు. అధ్యక్ష పదవిలో లేకపోయినా అధ్యక్షుడి తరహాలోనే వ్యవహరిస్తున్నారు. నిజానికి గాంధీ కుటుంబీకులు కాకుండా బయటివారు అధ్యక్ష బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేసే అవకాశాలు కూడా లేవు. తిరిగి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఎన్నుకోవడానికి అవసరమైన రంగం సిధ్ధం అవుతోంది.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

సంస్థాగత ఎన్నికలు

సమితి లేదా మండల స్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ప్రశాంత్ కిశోర్ తో జరిగిన చర్చలలో రాహుల్ గాంధీ అన్నట్టు తెలుస్తున్నది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రయత్నించారు. కానీ అది ఎంతో దూరం సాగలేదు. ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరితే, అతను తయారు చేసిన ప్రణాళికను గాంధీలు అమలు జరగనిస్తే సంస్థాగత ఎన్నికలు జరగవచ్చు. పార్టీలో మళ్ళీ చర్చలూ, వాదోపవాదాలూ వినవచ్చు. ప్రజాస్వామ్య వాతావరణం మళ్ళీ చోటుచేసుకోవచ్చు. కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేసిన తర్వాత ప్రశాంత్ కిశోర్, రాహుల్ గాందీ కలసి ఇతర ప్రతిపక్షాలతో వ్యవహారం చేసి బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీఏ కి ప్రత్యమ్నాయ కూటమిని తయారు చేయవలసి ఉంటుంది.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles