కె. రామచంద్రమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిపైనా, మరికొందరు న్యాయమూర్తులపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి శరత్ అర్వింద్ బాబ్డేకి రాసిన లేఖను మీడియాకు వెల్లడించడం తప్పుకాదని వివాదాస్పద న్యాయవాది ప్రశాంత్ భూషన్ వ్యాఖ్యానించారు. ‘ద హిందూ’ పత్రికలో సోమవారం ప్రచురించిన వ్యాసంలో ప్రశాంత్ భూషణ్, పారదర్శకత వల్ల నష్టం లేదని అన్నారు. లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ, జస్టిస్ రమణ కుమార్తెలు అమరావతితో భూములు కొనుగోలు చేసింది నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉంటుందోనని 2014 డిసెంబర్ లో ప్రకటించిన తర్వాతనే అయినప్పటికీ, వారు చెల్లించిన ధరలు ప్రకటనకు పూర్వం ఉన్నవేననీ, ప్రకటన దిరిమిలా ధరలు ఆకాశ మార్గాన పయనిస్తున్నప్పటికీ న్యాయమూర్తి కుమార్తెలు చాలా తక్కువ ధర చెల్లించారనీ, దీని వల్ల వారికి ఆర్థికంగా చాలా లబ్ధి కలిగిందనీ చెప్పారు.
రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించిన తర్వాత 2015 జూన్ లో న్యాయమూర్తి కుమార్తెలు భూములు కొన్నారనీ, అందులో తప్పేమిటనీ ప్రశ్నిస్తూ కొన్ని పత్రికలలో కొందరు వ్యాఖ్యాతలు ప్రశ్నించారు. నిజానికి అమరావతిలో భూములు కొనుగోలు చేసే స్వేచ్ఛ పౌరులందరిలాగానే న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. దీనిలో నేరం ఏమున్నదని ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారని తటస్థులు కూడా అనుకున్నారు. కానీ న్యాయమూర్తి కుమార్తెలూ, ఇతర బంధువులు తాము కొనుగోలు చేసిన భూములకు ఎంత ధర చెల్లించారోనన్న వివరాలు ప్రజలకు తెలియవు.
మరో విషయం ఏమంటే ఈ భూమి కొనుగోలులో ఉన్నత పదవులలో ఉన్నవారి ప్రమేయం ఉన్నది కనుక కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ – సీబీఐ) చేత దర్యాప్తు చేయించవలసిందిగా కేంద్ర పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పర్సెనల్ మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటనీ మార్చిలోనే లేఖ రాశారు. అంటే, జగన్ మోహన్ రెడ్డి పైన సీబీఐ పెట్టిన క్రిమినల్ కేసుల విచారణ రోజువారీగా, సత్వరంగా జరగాలని జస్టిస్ రమణ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచి నిర్ణయించడానికి చాలా మాసాల ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదించింది. అందువల్ల కేసుల విచారణను వేగిరం చేయాలని జస్టిస్ రమణ నిర్ణయించారు కనుక ఆయనపైన కక్షతో జగన్ మోహన్ రెడ్డి ఈ భూకొనుగోలు వ్యవహారాన్ని జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో ప్రస్తావించారనే వాదనలో బలం కానీ నిజం కానీ లేవు.
న్యాయవాదులపైన 1997లో ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి భారత న్యాయమూర్తి ముగ్గురు సిట్టింగ్ జడ్జ్ లతో (అప్పటికి సుప్రీంకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తులతో) ఒక కమిటీని నియమించారు. ప్రశాంత్ భూషణ్ ఏమంటారంటే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి రెండో స్థానంలో ఉన్న సీనియర్ జడ్డి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తులను విచారణ సంఘం సభ్యులుగా నియమిస్తే వారు తమకంటే సీనియర్, వచ్చే ఏప్రిల్ లో ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అలంకరించే న్యాయమూర్తి జస్టిస్ రమణపైన నిర్భయంగా విచారణ జరిపే అవకాశాలు ఉండవనీ, అందుకని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులలో మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నవారిని ముగ్గురిని ఎంపిక చేసి కమిటీ నియమిస్తే విచారణ సందేహాలకు అతీతంగా జరుగుతుందనీ సలహా చెప్పారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు విచారణ జరిపితే నిజం నిగ్గు తేలుతుందనీ, దీని వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులకు సైతం మంచి జరుగుతుందనీ, వారిమీద వచ్చిన నీలాపనిందలు తొలిగిపోతాయనీ, మొత్తం మీద న్యాయవ్యవస్థ విశ్వసనీయత పెరుగుతుందనీ ప్రశాంత్ భూషణ్ రాశారు.