వ్యంగ్యం
మన దేవుణ్ణి మనం కాపాడితే, మన దేవుడు మనని కాపాడుతాడు.
పరాయి దేశస్తులొచ్చి మన ఇళ్ళూ, ఊళ్ళూ, ఆ మాటకొస్తే మన దేశాన్ని కొల్లగొట్టి, మన మతాన్ని మనకి కాకుండా చేశారు. ఈ ఘోరాల్ని ఈ పాపాల్నీ చూడలేక మన దేవుళ్ళు మనని ఒదిలేసి వెళ్ళిపోయారు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళకి పేర్లు మార్చి అన్యమతస్తుల దేవుళ్ళ పేర్లు పెట్టి ప్రార్థనలు చెయ్యడం మొదలు పెట్టారు. అప్పట్నించీ మనం ఎలుగెత్తి అరిచినా, ఏడ్చినా మన దేవుళ్ళు పలకడం మానేశారు. పరాయి ప్రభువుల్నించి దేశాన్ని కాపాడుకొన్నాం. కానైతే పరాయి మతాన్నించి మనని కాపాడుకొని, మన దేవుళ్ళని కాపాడుకోవాలి. అన్యమత ప్రాంతాల ప్రార్థనా మందిరాలు మన గుళ్ళే. అందుచేత ఆయా మందిరాల్ని స్వాధీనపర్చుకొని మన దేవుళ్ళని ప్రతిష్టించుకొందాం అని గొంతెండిపోయినా, ఆగి గుక్కెడు నీళ్ళైనా తాగకుండా మిట్ట మధ్యాహ్నపు టెండలో, ఎండకి వెరవకుండా బోధించారు స్వామి కాశీనాధులవారు.
బతుకు దెరువు లేక ఆయన ఈ మధ్యనే కాశీకి వెళ్ళారు. అలా కాశీకి వెళ్ళి గంగలో మునిగి ఆత్మహత్య చేసుకొంటే ఆత్మహత్యాపాతకపాపం చుట్టుకోకపోగా, పుణ్యం, పురుషార్థం కల్సొచ్చి ఏ స్వర్గంలోనో తేలొచ్చనుకొని గంగలో ముక్కు మూసుకొని మూడు మునకలు వేశాడు. ఊపిరాడక గిలగిలా కొట్టుకోవడంతో ఆ కాశీనాధుని దయవల్ల, గంగని ఈదుకుంటూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వెళ్ళి తేలాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒదిలేసరికి అతని ఒంటికి పాములా కాషాయం చుట్టుకొని ఉంది. చూస్తుండగానే పదిమంది శిష్యబృందం చుట్టూ చేరి ‘‘కాశీనాథస్వామికీ జై’’ అంటూ, ఆయన చుట్టూ పూనకంతో భజనలూ, డాన్సులూ చెయ్యడం మొదలు పెట్టారు.
అప్పుడు జ్ఞానోదయమైంది స్వాములవారికి ‘ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కని ఎందుకంటారోనని…
సరిగ్గా అప్పుడే ఏ దిక్కూ, ఏ ఎజెండా లేకుండా, అధికారం కోసం ఆవురావురంటున్న ఒక రాజకీయ పార్టీకి దేవుడే దిక్కన్న ఒక సందేశం మెరుపులా మెరిసింది. అశరీరవాణిని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ‘‘దైవభక్తే దేశభక్తి మన దేవుళ్ళని ప్రతిష్టించుకొందాం! దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకొందా’’ అని తిరిగి స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రారంభించింది.
ఇదేదో బాగుందనుకొని తనని దైవకార్యసాధన నిమిత్తమై ఆ భగవంతుడు బ్రతికించుకొన్నాడని తీర్మానించుకొని కాషాయం ఒదలకుండా, ఊరూరా తిరిగి ప్రచారం మొదలు పెట్టాడు, స్వామీ కాశీనాథులవారు.
రాజకార్యమూ, స్వకార్యమూ, దైవకార్యమూ ఒకటే అయితే, యింక అడ్డేముంటుంది అనుకొని తను దైవాంశసంభూతుణ్ణనీ, రాజగురువుననీ స్వయంగా ప్రకటించుకొన్నారు. ఆ దెబ్బతో మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ప్రధానులు కావాలనుకొన్నవాళ్ళంతా క్యూకట్టారు. ‘మన దేవుళ్ళకి స్వాతంత్ర్యం సాధించడానికి కాషాయాన్ని గెలిపించాలి’’ అంటూ స్వామీ కాశీనాథులవారు భగవంతుడి తరఫున ప్రజలకి పిలిపిచ్చారు. ప్రజలు కాషాయం పార్టీని గెలిపించారు.
స్వామీ కాశీనాథులవారు భగవంతుడి తరఫున ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘దరిద్రం నుంచి మాకెప్పుడు విముక్తి కలుగుతుంది సామీ’’ అని ప్రశ్నించారు ప్రజలు.
‘‘దరిద్ర నారాయణులు మీరు. ఆ సామే మీ ఇంట కొలువైనప్పుడు మీకెక్కడిది దరిద్రం?’’ అని పేదరికంలో భగవంతుణ్ణి దర్శించుకొని, చేతులు జోడించి దండం పెట్టుకొన్నారు స్వామి కాశీనాథులవారు.