ఇది టంగుటూరి ప్రకాశం పంతులు 150 జయంతి
భారతీయుడి ఆత్మగౌరవానికి, తెలుగువాడి ఆత్మస్థైర్యానికి నిలువెత్తు ప్రతిరూపం టంగుటూరి ప్రకాశం. ప్రకాశమానమైన ప్రతిభ, అచంచలమైన దేశభక్తి, ప్రజానురక్తి ప్రకాశంపంతులుని స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రత్యేకంగా నిలిపాయి. ప్రజల కోసమే జీవించారు, పేదల కోసమే తపించారు, ప్రజల మధ్యనే చరించారు. ప్రకాశం పంతులు నూటికి నూరుశాతం ప్రజానాయకుడు. ధీరోదాత్తుడు, త్యాగధనుడు, ధన్య,పుణ్య చరితుడు.ఆంధ్రప్రదేశ్ కు ఆయనే మొట్టమొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడూ ముఖ్యమంత్రిగా తెలుగువాణి వినిపించిన శూరుడు.
Also read: ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి
మనసు నవనీత సమానము
పైకి మహోగ్రరూపం కనిపించినా, లోపల మెత్తటి మనిషి. ఆగ్రహానికి ప్రతిరూపంగా అనిపించినా,శాంతి కాముకుడు. బ్రిటిష్ వారికి రొమ్ము చూపించి… దమ్ముంటే కాల్చండని సవాలు విసిరిన అత్యంత సాహసి. న్యాయవాద వృత్తి ద్వారా ధర్మమార్గంలో వందేళ్ల క్రితమే లక్షల రూపాయలు సంపాయించారు. ఆ మొత్తాన్ని ప్రజల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం సర్వం త్యజియించిన అనంత దానశీలి. పదవుల కోసం పాకులాడకుండా పనిచేసుకుంటూ వెళ్లిపోయిన కర్మయోగి. ఆయన జీవితం చిత్రవిచిత్రాల సంగమం. క్రికెట్ గొప్పగా ఆడేవాడు, పద్యాలు పాడేవాడు, నాటకాలు వేసేవాడు. చిన్నప్పుడే తన చుట్టూ వందలమంది తిరిగేవారు.నాటకాల్లో స్త్రీపాత్రలు కూడా పోషించి అద్భుతంగా మెప్పించేవారు. మంచిరూపం,కంచుకంఠం. నటనా ప్రతిభతో ‘రంగస్థల నక్షత్రమ్’ అనే బిరుదును గెలుచుకున్నారు. మద్రాస్ లో హైకోర్టు న్యాయవాదిగా ప్రభవించిన కాలంలో ఆయన వైభవం అంబరచుంబితం. ‘లా టైమ్స్’ అనే పత్రిక నడిపేవారు. న్యాయవాద వృత్తికి సంబంధించిన గొప్ప పత్రికగా అది రాణకెక్కింది. ఆయన వైభవాన్ని చూసి ‘ప్రిన్స్ అఫ్ మెడ్రాస్’ అని పిలిచేవారు. ఆ కాలంలో మద్రాస్ లో న్యాయక్షేత్రంలో ఇంగ్లిష్, తమిళులదే ఆధిపత్యం. అటువంటి సమయంలో అక్కడ బారిస్టర్ గా ప్రసిద్ధుడైన తొలి తెలుగువాడు ఆయనే. బారిష్టర్ కోర్సులో లండన్ లో ‘ప్రశంసాపత్రాన్ని’ దక్కించుకున్న ప్రతిభాశాలి. అప్పటి ఆయన నెలసరి ఆదాయం సుమారు మూడు లక్షల రూపాయలు ఉండేది. అప్పుడు బంగారం ధర తులం మూడు రూపాయలు ఉండేది. దానిని బట్టి లెక్కవేసినా, ఈరోజు లెక్కల ప్రకారం కోట్లాది రూపాయలు ఆయన ఆదాయం. మద్రాస్, ఊటీ, రాజమండ్రి, ఒంగోలు, వినోదరాయునిపాలెంలో లెక్కలేనన్ని ఆస్తులు ఉండేవి. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర 100ఎకరాలు భూమి ఉండేది. ఎన్నో భూములు, ఎన్నో భవనాలు,ఎంతో బంగారం, మరెంతో డబ్బు ఆన్నీ స్వరాజ్యం కోసమే ఖర్చు పెట్టేశారు.
Also read: విశాఖ ఉక్కు దక్కాలంటే పోరాటమే శరణ్యం
దానధనుడు
చివరకు తనకంటూ ఒక్కరూపాయి కూడా మిగుల్చుకోని దానధనుడు. కటికి పేదరికం అనుభవించినా,ఒక్క కన్నీటి చుక్క రాల్చలేదు. చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే కష్టపడ్డాడు.పేదరికాన్ని ఏనాడూ తక్కువగా చూడలేదు. ఐశ్వర్యాన్ని, వైభవాన్ని ఏనాడూ గొప్పగా భావించలేదు. తన సంపాదన, ధర్మార్జన ప్రజల కోసం, దేశం కోసం వెచ్చించాననే గొప్ప ఆత్మతృప్తి ఆయన ఆయుధం. మద్రాస్ లో సైమన్ కమీషన్ ను ఎదిరించిన సంఘటన ఒక్కటే కాదు, ఆయన జీవితంలో అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆన్నీ చరిత్రకెక్కలేదు. చూద్దాం తమాషా… ఆయన ఊతపదం. తెలంగాణలో రజాకార్ల అరాచకాలు జరుగుతున్నప్పుడు ఎవరు వారించినా వినకుండా తెలంగాణ ప్రాంతానికి వెళ్లి ప్రజలతో నిలిచాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రిజ్వీని కలిసి హితోపదేశం చేశాడు. ఆ ధైర్యాన్ని చూసి రజాకార్లు సైతం ప్రకాశంకు శాల్యూట్ చేశారు. ఇక అప్పటి తెలంగాణ ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. తమకోసం నడచివచ్చిన దైవంలా భావించి గుండెల్లో నిలుపుకున్నారు. జవహర్ లాల్ నెహ్రు చేసిన హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా హైదరాబాద్ రాష్ట్రంలో సందర్శించి ప్రజల వైపు నిల్చున్నారు.
ఎక్కడ అలజడి, అల్లకల్లోలం జరిగితే అక్కడికి వెళ్లిపోయేవారు. మోప్లా తిరుగుబాటు సమయంలో కేరళ, హిందూ – ముస్లిం ఘర్షణలు జరిగినప్పుడు ముల్తాన్, అకాలీ సత్యాగ్రహం సమయంలో పంజాబ్ పర్యటించి, అక్కడి ప్రజలకు అండగా నిలిచారు. కేరళలో ముస్లిం -హిందువుల మధ్య తగాదా వచ్చినప్పుడు ఇరువర్గాల నాయకులను పిలిపించి మాట్లాడి, శాంతి స్థాపన చేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా ఎక్కువకాలం ఆ పదవుల్లో ఉండలేక పోయారు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిబద్ధత, పేదలపక్షపాతం మొదలైన సద్గుణాలు కొందరు పెద్దలకు నచ్చలేదు. ఆయనపై తెరవెనుక కుట్రలు పన్నారు. కుళ్ళు రాజకీయాలు చేశారు. అయినప్పటికీ ఆయన ఎవరికీ, దేనికీ వెరవలేదు. తన నాయకత్వంలో కొన్ని వేలమందితో గుంటూరులో సహాయనిరాకరణ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టింది. గ్రామీణ వ్యవస్థపై ఆయనకు అపారమైన గౌరవం.భారతదేశ శక్తి మొత్తం పల్లెల్లో ఉందని చెప్పేవారు. ‘గ్రామీణ విశ్వవిద్యాలయం’ నెలకొల్పారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన ఆయన ప్రేరణే. కృష్ణా బ్యారేజి నిర్మాణం ఆయన చలువే. వ్యవసాయ నీటి ప్రాజెక్టులు ఆయన ఆశయమే.
Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ
జస్టిస్ కోకాసుబ్బారావుకు అండదండలు
జస్టిస్ కోకా సుబ్బారావును ఏరికోరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రదాన న్యాయమూర్తిగా తెప్పించుకున్నారు. గోవింద్ మీనన్ ను ఆ పదవిలో ఉంచాలని జవహర్ లాల్ నెహ్రు దగ్గర రాజాజీ విశ్వప్రయత్నం చేశారు. ప్రకాశంపంతులు పట్టుబట్టి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ గా కోకా సుబ్బారావును ఎంపికయ్యేలా చేశారు. 1966లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎంపికైన తొలితెలుగువాడిగా కోకా సుబ్బారావు చరిత్రకెక్కారు. ఈ చరిత్ర వెనుక అంత చరిత్ర ఉంది, ప్రకాశం పాత్ర ఉంది. స్వాతంత్ర్య పోరాట కాలంలో,ఉద్యమానికి ఊపిరిలూదడానికై, ‘స్వరాజ్’ దినపత్రికను స్థాపించారు.తెలుగు,తమిళ, ఇంగ్లిష్ మూడు భాషల్లో ఆ పత్రిక వచ్చేది.ఆ పత్రికల కోసం ప్రజలు ఎగబడేవారు. పాత్రికేయ రంగంలో, తర్వాత కాలంలో సుప్రసిద్ధులైన ఖాసా సుబ్బారావు,నార్ల వెంకటేశ్వరరావు మొదలైనవారు ‘స్వరాజ్’ పత్రికలోనే తమ నైపుణ్యానికి సానబట్టుకున్నారు, జర్నలిజంలో బహుముఖపరిజ్ఞానాన్ని పొందారు.ఇటువంటి ఎందరో పాత్రికేయులకు వేదిక కల్పించిన మహనీయుడు టంగుటూరి. ఈ పత్రికల నిర్వహణకు ఎంత కష్టపడ్డారో చెప్పలేం. సుప్రసిధ్ధ జంటకవులు కొప్పరపు సోదరకవులకు -ప్రకాశంపంతులుకు ఎంతో అనుబంధం ఉండేది. ఒకే ప్రాంతంవారు కూడా కావడం విశేషం. ప్రకాశంపంతులుపై ఉండే అవ్యాజమైన ప్రేమ, గౌరవాలకు సూచికగా కొప్పరపు కవుల మనుమడికి ప్రకాశంగారి పేరు పెట్టుకున్నారు.
Also read: అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం
150వ జయంతి వేడుకలు ఘనంగా జరగాలి
టంగుటూరివారికి కాసు బ్రహ్మానందరెడ్డి వీరాభిమాని, ప్రియశిష్యుడు. దానికి స్మృతిగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో తాము నివసించే ప్రాంతానికి ‘ప్రకాశం నగర్ ‘ అని బ్రహ్మానందరెడ్డి పేరు పెట్టారు.దానినే ప్రస్తుతం ‘ప్రకాష్ నగర్’ అంటున్నారు.ఒంగోలు జిల్లాకు ‘ప్రకాశం’ పేరు పెట్టారన్న విషయం తెలిసిందే. ఆయన చేసిన సేవలకు, చూపిన త్యాగాలకు మనం ఆయన స్మృతికి ప్రతిస్పందించిన తీరు చాలా తక్కువ. ఎన్నో ముఖ్యమైన కేంద్రాలకు ప్రకాశం పేరు పెట్టాలి. అడుగడుగునా ఆయన విగ్రహాలు పెట్టినా మనం చూపించే భక్తి తక్కువే. ఆయన ఆత్మకథ ‘ నా జీవిత యాత్ర’ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కన్నీళ్లతో హృదయం తడిసిపోతుంది. అంతటి మహనీయుడిని ఆ స్థాయిలో గుర్తుపెట్టుకోక పోవడం చాలా బాధాకరం. అధికారంలో ఎవరున్నా ప్రభుత్వాలన్నీ ఆయనను విస్మరించాయి. ఈ ఆగష్టు 23 నుంచి ఆయన 150 వ జయంతి ఆరంభమైంది. ఆ మహనీయునికి నివాళిగా ప్రజలు, ప్రభుత్వాలు ఈ సంవత్సరం మొత్తం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలి. ఆయన స్మృతిగా గొప్ప కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వాలు, నాయకులు మరచినా, టంగుటూరి ప్రకాశంపంతులు ప్రజానాయకుడిగా ప్రజాహృదయక్షేత్రంలో నిత్యం వెలుగుతూనే ఉంటారు.
Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!
నమః స్కృతులు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు,యావత్ తెలుగు ప్రజలందరి హృదయ స్పందన లే.ఆమహానుభావుని త్యాగనిరతి, ధైర్యసాహసాలు పరిపాలన దక్షత నిస్వార్థంగా, ధనాపేక్షలేకుండా , తనకున్న ఆస్తులనే స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు బ్రిటిష్ ప్రభుత్వం తలపెట్టిన దుష్కృత్యాలకు ఎదురొడ్డి నిలబడి జైలు శిక్ష అనుభవించారు
ప్రజాక్షేత్రంలో తిరుగులేని రాజకీయ దురంధరుడు ఎందరో మహానుభావులు అందరికి ఆరాధ్యదైవం . ఎన్నో కధనాలు వినిపిస్తున్నాయి, సమకాలీన రాజకీయ నాయకులు వారి స్వార్ధానికి బలిచేసి అర్ధాంతరంగా అవిశ్వాసం పెట్టినా , మొదటి గా సంతకం పెట్టుటకు భయపడి,, సీరియల్ గా కాకుండా రౌండ్రౌండుగా సంతకాలు పెట్టారు, మెజారిటీ అవిశ్వాసం ప్రకటిస్తూ ,పదవీచ్యుతుని చేసి పంతం నెగ్గించుకున్నారు.
పదవి పోయిన ఇప్పటికే ఎప్పటికీ ప్రజలు మనసులో వున్న మహనీయుడైవెలుగొందుతున్నారు.
ఇంతటి మహనీయుని గుర్తుచేసి 65సం వెనుక కు తీసుకొని వెళ్ళిన మీకు ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు నమఃశుమాంజలి 🙏🙏🙏